గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ కోసం తెచ్చిన ‘ధరణి’ పోర్టల్‌లో భారీ అక్రమాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే.అందులోని లొసుగులను అడ్డుపెట్టుకుని కొందరు అక్రమార్కులు పేదలు, ప్రభుత్వ భూములను కాజేయాలని చూశారు.వేల ఎకరాల భూముల ఓనర్ షిప్ రాత్రికి రాత్రే మారిపోయినట్టు ఆరోపణలు ఉన్నాయి. ధరణి అక్రమాల కారణంగా అన్నదాతలు పదేపదే రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. పోర్టల్‌లో వివరాలు సరిగా లేక చాలామంది రైతు బంధు (పెట్టుబడి సాయం) కూడా కోల్పోయారు. అమ్ముకుందామనుకున్న వారికీ చిక్కులు తప్పలేదు.అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం చేతులు మారక కాంగ్రెస్ సర్కార్ ధరణి స్థానంలో భూభారతిని తీసుకొచ్చింది.
అయితే, ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే తాము అధికారంలోకి వస్తే ధరణి మాటున అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ మేరకు ధరణి అక్రమాలపై విచారణ చేయించారు. ఈ వ్యవహారంలో తాజాగా సీఐడీ దూకుడు పెంచింది. గతంలో ధరణిని అడ్డుపెట్టుకుని భూ అక్రమాలు, దోపిడీకి పాల్పడిన వారిపై చర్యలకు ఉపక్రమించింది. శనివారం ఉదయం ధరణి పోర్టల్ భూ రికార్డుల అక్రమాల వ్యవహారంపై సీఐడీ (CID) విభాగం రాష్ట్రవ్యాప్తంగా మెరుపు దాడులు నిర్వహించింది.
15 బృందాల తనిఖీలు..9 మంది అరెస్టు!
పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చూసిన IL&FS టెక్నాలజీ లిమిటెడ్, TerraCIS టెక్నాలజీ లిమిటెడ్ సంస్థల పాత్రతో పాటు, అనధికారిక లాగిన్లు, రికార్డుల ట్యాంపరింగ్‌కు పాల్పడిన వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టినట్టు సమాచారం. సీఐడీ అధికారులు 15 ప్రత్యేక బృందాలుగా విడిపోయి ఏకకాలంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, భువనగిరి, గజ్వేల్ తదితర కీలక ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సీక్రెట్ ఆపరేషన్‌లో భాగంగా భూ రికార్డుల మార్పిడిలో కీలక పాత్ర పోషించినట్లు భావిస్తున్న 9 మంది ధరణి ఆపరేటర్లను/అనుమానితులను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.
ఇదిలాఉండగా, ధరణి పోర్టల్ అక్రమాలపై సమగ్ర విచారణ కోసం సీఐడీ డీజీ చారుసిన్హా నేతృత్వంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సాంకేతిక నిపుణులతో కూడిన ఏడుగురు సభ్యుల స్పెషల్ ఎంక్వైరీ టీమ్‌ను ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పోర్టల్ డిజైన్, టెండర్ ప్రక్రియ, డాక్యుమెంట్ల నిర్వహణ, డేటా భద్రత ఉల్లంఘనలపై IL&FS, TerraCIS టెక్నాలజీస్ సంస్థల ఒప్పందాలు, నిధుల ప్రవాహాన్ని విచారణ బృందాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.
గతంలో జరిగిన ఫోరెన్సిక్ ఆడిట్ ఆధారంగా డిజిటల్ ఫుట్‌ప్రింట్స్‌ను సేకరించారు. కోర్టు కేసులు, మధ్యంతర ఉత్తర్వులను ఆసరాగా చేసుకుని విలువైన భూముల యాజమాన్య హక్కులను మార్చడం, భూదాన్ భూములకు బై నంబర్లు సృష్టించి అక్రమాలకు పాల్పడటం వంటి అంశాలపై సీఐడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. కాగా, సీఐడీ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు, స్వాధీనం చేసుకున్న కీలక డాక్యుమెంట్లకు సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది.


