తెలంగాణ

Congress : నా మాట ఎవరూ వినడం లేదు.. ఏఐసీసీకి పీసీసీ చీఫ్ ఫిర్యాదు

5 నిమిషాల పఠనం

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఇప్పట్లో ఆగేలా లేవు.కొందరివి పదవుల కోసం ఆరాటం అయితే, మరికొందరిది సీనియర్లం అనే ఇగో. నిన్న గాక మొన్నవచ్చి మాకే నీతులు చెబుతావా? నా నియోజకవర్గంలో తల దూర్చుతావా? అంటూ సీనియర్ లీడర్లు జూనియర్ నేతల మీద విరుచుకుపడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఇప్పట్లో ఆగేలా లేవు.కొందరివి పదవుల కోసం ఆరాటం అయితే, మరికొందరిది సీనియర్లం అనే ఇగో. నిన్న గాక మొన్నవచ్చి మాకే నీతులు చెబుతావా? నా నియోజకవర్గంలో తల దూర్చుతావా? అంటూ సీనియర్ లీడర్లు జూనియర్ నేతల మీద విరుచుకుపడుతున్నారు. ఓ నేత బహిర్గతంగా దూషణలు చేస్తే మరో సీనియర్ మాత్రం సైలెంట్‌గా తన పనిని తాను కానిచ్చేస్తున్నారు. దీంతో జూనియర్లు సైతం కౌంటర్లు ఇస్తున్నారు. ఈ వ్యవహారం కాస్త కాంగ్రెస్ పార్టీని నడి బజారుకు ఈడుస్తోంది. ప్రతిపక్షాలు, ప్రజల ముందు చులకన చేసి చూపిస్తోంది.

అయితే, పార్టీ వ్యవహారాలను చక్కదిద్దాల్సిన నేత మాత్రం ఈ పంచాయితీలను తెగ్గొట్టడం నాతో కాదు బాబోయ్ అంటున్నారు. ఎవరికి వారు తమకు తోచినట్టు చేసుకుంటూ వెళ్తున్నారని, తన మాట ఎవరూ వినడం లేదని, అలాంటప్పుడు నేనేం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, ఈ వ్యవహారాన్ని మీరే చక్కదిద్దాలంటూ బంతిని తీసుకెళ్లి ఏఐసీసీ కోర్టులో ఉంచారు. కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య అంతర్గత కలహాలు ప్రస్తుతం ఢిల్లీకి చేరడంతో ఏఐసీసీ ఏం చర్యలు తీసుకుంటుంది అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కాగా, మంత్రి దామోదర రాజనరసింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు మధ్య నెలకొన్న వివాదంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. ‘నా మాటే వినకపోతే.. నేనెందుకు?’ అని పీసీసీ చీఫ్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల మధ్య వివాదాలు కొనసాగుతున్న తరుణంలో ఆయన తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

తప్పు చేసిన వారిని వివరణ కోరితే.. ‘నీ కంటే మేము సీనియర్లం’ అంటూ ఎదురు సమాధానాలు చెబుతున్నారని, ఇలా అయితే పార్టీ వ్యవహారాలు నడపడం కష్టమంటూ ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల మధ్య గొడవలను మీరే పరిష్కరించాలంటూ ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు పీసీసీ చీఫ్ లేఖ రాసినట్టు తెలిసింది. అందులో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మధ్య ఢిల్లీలోని శాంగ్రిలా హోటల్‌లో జరిగిన వివాదాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. అదేవిధంగా నిధుల విషయంలో పార్టీకి వ్యతిరేకంగా ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు, అదే విధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ మంత్రి శ్రీధర్ బాబును ఉద్దేశించి రాసిన లేఖ విషయాన్ని కూడా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

#Tpcc cheif mahesh kumar goud#AICC#Complaint#minister damodara#mla kantarao issue#internal politics#congress#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి