జాతీయం

ట్రంప్ చెప్పినట్టు మోదీ వింటున్నారా..? రాహుల్ విమర్శలతో పొలిటికల్ హీట్!

12 నిమిషాల పఠనం

ఢిల్లీలో ఇండి కూటమి ర్యాలీ తర్వాత దేశ రాజకీయాలు వేడెక్కాయి. సర్ వ్యతిరేక ఉద్యమంతో వచ్చిన ఊపును ఎక్కడా తగ్గకుండా చూడాలనే వ్యూహంలో ఉంది కాంగ్రెస్. రాహుల్ ఒక అడుగు ముందుకేస్తే.. షా రెండు అడుగులు ముందుకేస్తున్నారు.

దేశ రాజకీయాల్లో డైలాగ్ వార్

ప్రధానిని టార్గెట్ చేసిన రాహుల్

రాహుల్ కి అమిత్ షా సవాల్

పార్లమెంటులో తేల్చుకుందామా అంటూ షా కౌంటర్

ఢిల్లీలో ఇండి కూటమి ర్యాలీ తర్వాత దేశ రాజకీయాలు వేడెక్కాయి. సర్ వ్యతిరేక ఉద్యమంతో వచ్చిన ఊపును ఎక్కడా తగ్గకుండా చూడాలనే వ్యూహంలో ఉంది కాంగ్రెస్. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే పార్లమెంటు ఎన్నికల కోసం ఇప్పటి నుంచే దూకుడు మంత్రాన్ని జపిస్తోంది. ఇందులో అందరి కంటే ముందుండాలనే ప్రయత్నాల్లో ఉన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అందుకే ఆయన ప్రధాని మోదీని నేరుగా ప్రశ్నిస్తున్నారు. ట్రంప్ చెప్పినట్టు మోదీ నడుచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. దేశ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెడుతున్నారంటూ విరుచుకుపడుతున్నారు. అంతేకాదు.. మోదీతో ఫేస్ టు ఫేస్ చర్చకు సిద్ధమని, 5 నిమిషాల్లోనే ఆయన దేశద్రోహి అని నిరూపిస్తానని సవాల్ చేస్తున్నారు.

మరోవైపు రాహుల్‌కు కౌంటర్ ఇచ్చేందుకు రంగంలోకి దిగారు అమిత్ షా. హైదరాబాద్ వేదికగా మొదలైన ఎదురుదాడిని హర్యానా వరకు కొనసాగించారు. రాహుల్‌కు నిజంగా దమ్ముంటే పార్లమెంట్‌కు వచ్చి చర్చించాలని సవాల్ విసిరారు. రాహుల్ ప్రధాని అయ్యేది మాక్ పార్లమెంట్‌లోనే అంటూ ఎద్దేవా చేశారు.

ఇప్పుడు రాహుల్ ఒక అడుగు ముందుకేస్తే.. షా రెండు అడుగులు ముందుకేస్తున్నారు. షా సవాల్ విసిరితే.. రాహుల్ మరో సవాల్‌తో సిద్ధమవుతున్నారు. మాటల యుద్ధం కాస్తా వ్యక్తిగత రాజకీయ ప్రతిష్ఠకు సంబంధించిన పోరుగా మారుతోంది. అసలు ఈ ఇద్దరి మధ్య ఇంతటి రగడకు కారణమేంటి?

ఢిల్లీ ర్యాలీ.. రాజకీయ యుద్ధానికి రణభేరి!

నవంబర్ 1. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం. ఓట్ల చోరీ, ఎన్నికల అక్రమాల ఆరోపణలతో కాంగ్రెస్ సహా ఇండియా కూటమి భారీ ర్యాలీ నిర్వహించింది. ఎన్నికల సంఘం పనితీరును ప్రశ్నించింది. సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. కానీ బీజేపీ ఈ ర్యాలీని మరో కోణంలో చూసింది. ఓట్ల చోరీని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు చొరబాటుదారులను కాపాడేందుకు రోడ్లపైకి వచ్చాయని ఎదురుదాడి చేసింది.

అక్కడితో ఆగలేదు. కాంగ్రెస్ ర్యాలీకి కౌంటర్‌గా బీజేపీ కూడా రంగంలోకి దిగింది. నవంబర్ 2న హైదరాబాద్‌లో అమిత్ షా నేతృత్వంలో సేవ్ డెమోక్రసీ, రిమూవ్ అనార్కీ పేరుతో పాదయాత్ర నిర్వహించింది.

ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ విసిరిన సవాల్‌కు హైదరాబాద్ వేదికగా సమాధానం చెప్పాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపించింది. కానీ అమిత్ షా హైదరాబాద్‌లో చేసిన వ్యాఖ్యలు కేవలం కాంగ్రెస్ ర్యాలీకి కౌంటర్‌గా మిగిలిపోలేదు. నేరుగా రాహుల్ గాంధీనే టార్గెట్ చేశాయి.

ట్రంప్ మాటకు మోదీ తలూపుతున్నారా?

ఇక రాహుల్ గాంధీ విమర్శల్లో అత్యంత కీలకమైన అంశం డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడి ఒత్తిడికి మోదీ లొంగిపోతున్నారని రాహుల్ ఆరోపిస్తున్నారు. ట్రంప్ చెప్పినట్టే భారత ప్రధాని వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం, రైతుల ప్రయోజనాలు, చిన్న వ్యాపారాలు, భారత్‌పై అమెరికా ఒత్తిడి.. ఇలా అనేక అంశాలను ప్రస్తావిస్తున్నారు. ట్రంప్ భారత్‌పై ఆధిపత్యం చెలాయిస్తున్నారని, మోదీ మాత్రం గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారని అంటున్నారు.

అంతేకాదు.. అమెరికా, అదానీ వ్యవహారాలను కూడా ముడిపెడుతూ మోదీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ట్రంప్ భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానంటూ పదేపదే చెబుతున్నా మోదీ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నిస్తున్నారు. రాహుల్ విమర్శల వెనుక ఉన్న అసలు రాజకీయ లక్ష్యం ఒక్కటే. మోదీని దేశ ప్రయోజనాలను కాపాడలేని నాయకుడిగా ప్రజల ముందు నిలబెట్టడం.

5 నిమిషాల్లో నిరూపిస్తానంటూ రాహుల్ సవాల్!

నవంబర్ 4న పంజాబ్‌లోని సంగ్రూర్‌లో జరిగిన ఇన్సాఫ్ ర్యాలీలో రాహుల్ గాంధీ దూకుడు మరింత పెంచారు. మోదీతో ఎక్కడైనా, ఎప్పుడైనా ఫేస్ టు ఫేస్ చర్చకు సిద్ధమని ప్రకటించారు. చర్చకు వేదిక మోదీనే ఎంచుకోవచ్చని, న్యాయనిర్ణేతగా ఎవరిని నియమించుకున్నా తనకు అభ్యంతరం లేదని చెప్పారు. 5 నిమిషాల్లోనే మోదీ దేశద్రోహి అని నిరూపిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు విసిరారు.

ఇది సాధారణ రాజకీయ విమర్శ కాదు. ప్రధాని మోదీపై రాహుల్ విసిరిన అత్యంత తీవ్రమైన రాజకీయ సవాల్. పైగా తన ఆరోపణలకు ట్రంప్‌తో మోదీ సంబంధాలు, అమెరికా ఒత్తిళ్లను ప్రధాన ఆధారాలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాహుల్ ఆరోపణలకు బీజేపీ అంగీకరించడం లేదు. వాటిని రాజకీయ ప్రచారంగా కొట్టిపారేస్తోంది.

హైదరాబాద్‌లో షా వార్నింగ్.. రాహుల్‌కు డైరెక్ట్ ఛాలెంజ్!

రాహుల్ ఆరోపణలకు అమిత్ షా హైదరాబాద్ నుంచే గట్టిగా సమాధానమిచ్చారు. ఓట్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ఢిల్లీ ర్యాలీ ఓట్లను కాపాడేందుకు కాదని, చొరబాటుదారులను కాపాడేందుకు నిర్వహించిన సభ అంటూ విమర్శించారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకున్నంత మాత్రాన దాన్ని గౌరవించినట్లు కాదని రాహుల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

అసలు రగడకు కేంద్రబిందువైన సవాల్ కూడా ఇక్కడే విసిరారు. ఈవీఎంలు, ఎస్ఐఆర్, చొరబాటుదారుల అంశాలపై చర్చించేందుకు కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. రాహుల్‌కు నిజంగా ధైర్యం ఉంటే సభకు వచ్చి చర్చించాలని సవాల్ చేశారు. ఇక రాహుల్ ప్రధాని కావాలన్న ఆకాంక్షపైనా సెటైర్లు వేశారు. మాక్ పార్లమెంట్‌లో మాత్రమే రాహుల్ ప్రధాని కాగలరని ఎద్దేవా చేశారు.

కర్నాల్‌లోనూ అదే దూకుడు.. రాహుల్‌కు మరో సవాల్!

హైదరాబాద్ తర్వాత అమిత్ షా తన దాడిని హర్యానాకు తీసుకెళ్లారు. నవంబర్ 5న కర్నాల్‌లో జరిగిన బీజేపీ కార్యక్రమంలో మరోసారి రాహుల్‌ను టార్గెట్ చేశారు. పార్లమెంట్‌ను సజావుగా సాగనివ్వకుండా అడ్డుకోవడం, సభను బహిష్కరించడం కాంగ్రెస్ సంస్కృతిగా మారిందని విమర్శించారు. SIR పై నిజంగా చర్చ కావాలంటే ప్రధాని మోదీకి లేఖ రాయాలని సూచించారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరోసారి స్పష్టం చేశారు.

అంతేకాదు.. పార్లమెంట్‌లోనే కాదు, హర్యానాలోని ఏ కూడలిలోనైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. చొరబాటుదారులను ఓటర్ల జాబితాల నుంచి తొలగించడం బీజేపీ లక్ష్యమని ప్రకటించారు. ఇలా రాహుల్ మోదీని చర్చకు ఆహ్వానిస్తుంటే.. అమిత్ షా రాహుల్‌ను పార్లమెంట్‌కు ఆహ్వానిస్తున్నారు. ఇద్దరి మధ్య చర్చ జరగకముందే సవాళ్ల మీద సవాళ్లు కొనసాగుతున్నాయి.

షా సవాల్‌కు రాహుల్ కౌంటర్.. అసలు చర్చ ఎక్కడ?

ఈ మాటల యుద్ధం నవంబర్ 6న మరో మలుపు తిరిగింది. అమిత్ షా వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ నేరుగా స్పందించారు. మోదీని కన్ఫ్యూజ్ చేయొద్దని, తనతో బహిరంగ చర్చకు రావడానికి ప్రధానిని ఒప్పించాలని అమిత్ షాకు సూచించారు. ఏ వేదికైనా, ఏ సమయమైనా తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. డరో మత్ అంటూ సవాల్ విసిరారు.

అంటే రాహుల్ పార్లమెంట్‌లో ఎస్ఐఆర్‌పై చర్చకు బదులుగా మోదీతో నేరుగా బహిరంగ చర్చ కావాలని పట్టుబడుతున్నారు. మరోవైపు బీజేపీ మాత్రం పార్లమెంట్‌నే చర్చకు సరైన వేదికగా చూపిస్తోంది. ఇక్కడే అసలు రాజకీయ పేచీ మొదలైంది. ఒకరు ఓపెన్ డిబేట్ అంటుంటే.. మరొకరు పార్లమెంట్ డిబేట్ అంటున్నారు. ఇద్దరూ చర్చకు సిద్ధమంటున్నారు. కానీ చర్చ ఎక్కడ జరగాలన్న దగ్గరే పంతం పట్టారు.

ఇది మాటల యుద్ధం కాదు.. రాజకీయ ఆధిపత్య పోరు!

ఈ పరిణామాలన్నీ చూస్తే బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు కొత్త దశకు చేరినట్లు కనిపిస్తోంది. రాహుల్ గాంధీ మోదీ నాయకత్వాన్ని నేరుగా ప్రశ్నిస్తూ తన రాజకీయ దూకుడును పెంచుతున్నారు. బీజేపీ మాత్రం రాహుల్‌ను బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా వ్యవహరించడం లేదంటూ కార్నర్ చేసే ప్రయత్నం చేస్తోంది.

ఒకవైపు ట్రంప్, అమెరికా ఒత్తిళ్లు, అదానీ వ్యవహారాలతో మోదీని ఇరుకున పెట్టాలనేది కాంగ్రెస్ వ్యూహం. మరోవైపు ఓట్ల చోరీ ఆరోపణలు, ఎస్ఐఆర్, చొరబాటుదారుల అంశాలతో కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలోకి నెట్టాలనేది బీజేపీ ఎత్తుగడ.

అయితే ఈ పోరులో ప్రజలకు కావాల్సింది ఎవరు ఎవరిని తిట్టారన్నది కాదు. ఎవరి ఆరోపణల్లో వాస్తవం ఉంది? ఎవరు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు? దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఎవరు స్పష్టత ఇస్తారు? అన్నదే కీలకం.

#Rahul Gandhi#Narendra Modi#Amit Shah#Mallikarjun Kharge#BJP vs Congress#Congress vs BJP#Indian Politics#Political War#Delhi Rally#Hyderabad Rally#Donald Trump#Rahul Gandhi Speech#Amit Shah Speech#Modi Government#Telangana Politics#Political News#Latest Political News#Words War#Indian Political News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి