ఇరాన్ చేపడుతున్న అణు కార్యక్రమంపై అత్యంత కీలకమైన, విశ్వసనీయమైన సమాచారాన్ని అందించిన వారికి ఏకంగా 20మిలియన్ డాలర్ల (దాదాపు రూ.166కోట్లు) వరకు భారీ బహుమతిని అందజేస్తామని అమెరికా సైనిక విభాగం యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటించింది. అమెరికా విదేశాంగ శాఖకు చెందిన 'రివార్డ్స్ ఫర్ జస్టిస్' (Rewards for Justice) ప్రత్యేక కార్యక్రమం కింద ఈ సంచలన ఆఫర్‌ను సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా విడుదల చేసింది. సమాచారం అందించిన వ్యక్తులకు ఉదారంగా నజరానాతో పాటు అవసరమైతే వేరే సురక్షిత ప్రాంతాలకు పునరావాసం కూడా కల్పిస్తామని స్పష్టం చేసింది.
ఈ బహుమతి కార్యక్రమంలో భాగంగా ఇరాన్‌లోని అణు పరిశోధనా కేంద్రాలు, అక్కడ ఉపయోగిస్తున్న అత్యాధునిక పరికరాలు, సరఫరా నెట్‌వర్కులు, ఈ ప్రాజెక్టుల్లో భాగస్వాములవుతున్న అణు శాస్త్రవేత్తలు, పరిశోధకుల వివరాలను సేకరిస్తోంది. సిగ్నల్ లేదా టోర్ (Tor) ఆధారిత సురక్షిత చానెళ్ల ద్వారా తమకు వివరాలు పంపవచ్చని అమెరికా సూచించింది. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(IAEA) పర్యవేక్షక నిబంధనలను ఇరాన్ తీవ్రంగా ఉల్లంఘిస్తోందని, దీనివల్ల యురేనియం శుద్ధి చేసే సెంట్రిఫ్యూజ్‌ల నిల్వలపై పర్యవేక్షణ కొరవడిందని అమెరికా విదేశాంగ శాఖ ఆరోపించింది.
ఈ ఆఫర్ ప్రకటన వెలువడటానికి ముందే ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఒకవేళ మనం గనుక ఇరాన్ అణు యత్నాలను అడ్డుకోకపోయి ఉంటే, ఈపాటికి ఇజ్రాయెల్ ఉనికిలోనే ఉండేది కాదు. వారి దగ్గర గనుక అణ్వాయుధాలు ఉండి ఉంటే కచ్చితంగా వాడేసేవారు’ అని వ్యాఖ్యానించారు. సుదీర్ఘ పోరాటాల వల్ల ఇరాన్ ఆర్థికంగా, సైనికంగా బలహీనపడిందని, ప్రస్తుతం ఇరాన్ ఒప్పందం కోసం ఆరాటపడుతోందని అన్నారు. మధ్య ఇరాన్‌లోని ‘పికాక్స్ మౌంటెన్’ వంటి ఒకటి రెండు ప్రాధాన్య ప్రాంతాలపై ఇంకా దృష్టి సారించాల్సి ఉందన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ యంత్రాంగం ప్రతిస్పందిస్తూ 'పికాక్స్ మౌంటెన్' ప్రాంతానికి అణు కార్యకలాపాలతో సంబంధం లేదని తేల్చిచెప్పింది. అదే సమయంలో, తమ దేశం ఎదుర్కొంటున్న ప్రస్తుత సంక్షోభాన్ని శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజేష్కియాన్ పునరుద్ఘాటించారు. యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించిన ఈ రివార్డు ఆఫర్ అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపుతోంది.


