రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ కార్పొరేటర్ వేధింపులు భరించలేక దివ్యాంగుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. పొలిటికల్ కారణాలకు తనను బాధ్యుడిని చేస్తూ వేధింపులకు గురిచేశాడని,అందుకే చనిపోతున్నట్టు ఆత్మహత్యాయత్నం చేయడానికి ముందు బాధితుడు సెల్ఫీ వీడియోలో మాట్లాడారు.అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వివరాల్లోకివెళితే.. కరీంనగర్ జిల్లాకు చెందిన దివ్యాంగుడు కళ్లేపల్లి శివ కిసాన్‌నగర్‌లో ఉంటున్నాడు. గత కొంతకాలంగా బీజేపీ కార్పొరేటర్ తనను తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ దివ్యాంగుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.దోమలను చంపేందుకు వినియోగించే ‘ఆల్‌అవుట్’ మందు తాగి శివ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసినట్టు సమాచారం.
అనంతరం అక్కడే ఉన్న స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన ఆత్మహత్యాయత్నానికి బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణు కారణమని, అతని మీద చర్యలు తీసుకోవాలని బాధిత దివ్యాంగుడు డిమాండ్ చేశాడు. తన అన్న బీఆర్ఎస్ పార్టీలో ఉండటంతో తమ కుటుంబాన్ని సోమడి వేణు టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. రాజకీయ కారణాలతో తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
ఇల్లు కూల్చివేస్తామంటూ నోటీసులు జారీ చేయడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యానని, కార్పొరేటర్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు యత్నించినట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. తన ఆత్మహత్యతోనైనా కుటుంబానికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశాడు.శివ ఆరోపణలపై విచారణ జరిపి న్యాయం చేయాలని కుటుంబ సభ్యుల సైతం రిక్వెస్టు చేస్తున్నారు.కాగా, దివ్యాంగుడు శివ పరిస్థితి గురించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


