హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (KPHB) ఫేజ్-15 పరిధిలో ఇళ్ల కొనుగోలుదారులకు 17ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వివాదంలో ఉన్న 101ఫ్లాట్లను ఈనెల 23వ తేదీలోగా సంబంధిత బాధితుల పేరిట తక్షణమే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని తెలంగాణ హౌసింగ్ బోర్డును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లిలతో కూడిన ధర్మాసనం సంచలన తుది ఉత్తర్వులు జారీ చేసింది.
వాయిదాల చెల్లింపుల్లో జాప్యం జరిగిందనే కారణంతో కొనుగోలుదారుల నుంచి 14శాతం వడ్డీ వసూలు చేయాలా? వద్దా? అనే ప్రధాన అంశంపై హైకోర్టు తేల్చే వరకు వేచి చూడాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ వడ్డీ వివాదాన్ని సాకుగా చూపి కొనుగోలుదారులను మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టకూడదని తేల్చిచెప్పింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించిన ధర్మాసనం, హైకోర్టులో వివాదం పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ఈ ఫ్లాట్లను ఇతరులకు విక్రయించడం లేదా బదిలీ చేయడం వంటి చర్యలు చేపట్టరాదని అటు హౌసింగ్ బోర్డుతో పాటు ఇటు కొనుగోలుదారులపై సైతం కఠిన ఆంక్షలు విధించింది.
ఈ వివాదం 2009లో తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్రవేశపెట్టిన 'సంపూర్ణం' వసతి పథకంతో మొదలైంది. ప్రారంభంలో ఒక్కో ఫ్లాట్ ధరను రూ.30.80లక్షలుగా నిర్ణయించిన బోర్డు, ఆ తర్వాత దాన్ని ఏకపక్షంగా రూ.47.85 లక్షలకు పెంచడంతో పాటు నిర్మాణంలో తీవ్ర జాప్యం చేసింది. బోర్డు తీరుపై కొనుగోలుదారులు వినియోగదారుల ఫోరం నుంచి జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(NCDRC) వరకు సుదీర్ఘ న్యాయపోరాటం చేశారు. నిర్మాణ జాప్యం బోర్డు వైపు నుంచే జరిగిందని స్పష్టం చేసిన ఎన్సీడీఆర్సీ, బాధితుల నుంచి 14 శాతం వడ్డీ వసూలు చేయడం అన్యాయమని గతంలో చారిత్రాత్మక తీర్పునిచ్చింది.
ఎన్సీడీఆర్సీ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ హౌసింగ్ బోర్డు తొలుత హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమ వైపు నుంచి జరిగిన ఆలస్యానికి 6 శాతం వడ్డీ చెల్లిస్తామని, కానీ బాధితుల నుంచి 14శాతం వడ్డీ వసూలుకు అనుమతించాలని బోర్డు చేసిన వాదనలను సుప్రీంకోర్టు తీవ్రంగా తోసిపుచ్చింది. బాధితుల 17ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ నవంబర్ 23లోగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని ఆదేశించడంతో కేపీహెచ్బీ కొనుగోలుదారులు తీవ్ర సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


