హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను లెక్క చేయకుండా కూల్చివేతలకు పాల్పడినందుకు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో సమాధానం చెప్పాలని కోరింది. ఈ విషయంలో రంగనాథ్ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరై సమాధానం చెప్పాలని ఆదేశించింది. మరోసారి రంగనాథ్ మీద కోర్టు ధిక్కరణ చర్యలకు సంబంధించిన పిటిషన్ దాఖలు కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకివెళితే.. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 173 (పార్ట్), 175 (పార్ట్) తదితర సర్వే నంబర్లలోని 36.37 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులకు చెందిందని, అందులో కూల్చివేతలు చేపట్టకూడదని 2024లో తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కోర్టు ఉత్తర్వులు లెక్కచేయకుండా కూల్చివేతలు చేపట్టడమే కాకుండా, ప్రభుత్వ భూమిని కాపాడినట్టు హైడ్రా తప్పుడు ప్రచారం చేసుకుంటుందని బాధిత వ్యక్తి న్యాయస్థానంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌ను విచారణ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. మీపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని, ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కావాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి టీకే. శ్రీదేవి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.ముఖ్యంగా హైడ్రాకు మరోసారి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయడంతో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇదిలాఉండగా, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యతిరేకంగా ఇప్పటివరకు 63కి పైగా కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. కోర్టులు గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులు, స్టేటస్ కో ఆదేశాలను బేఖాతరు చేస్తూ హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారంటూ బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ విషయంలోనే గతంలో సింగిల్ బెంచ్ ఆయన్ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తొలగించాలని తీర్పు ఇవ్వగా.. డివిజన్ బెంచ్ ఆ తీర్పు మీద స్టేటస్ కో ఇచ్చింది.రీసెంట్గా ఈ తీర్పును వచ్చే ఏడాది జనవరి 20వరకు పొడగిస్తూ డివిజన్ బెంచ్ మరోసారి తీర్పు వెలువరించింది.


