సాధారణంగా ఉద్యోగం అనగానే రోజువారీ ఆఫీస్ పనులు, కష్టపడి చెమటోడ్చడాలే గుర్తొస్తాయి. అయితే కేవలం హాయిగా నిద్రపోతూ లక్షల రూపాయల సంపాదనను సొంతం చేసుకోవచ్చని ముంబైకి చెందిన జినియా ఛటర్జీ అనే మహిళ నిరూపించింది. ప్రముఖ నిద్ర పరికరాల ఉత్పత్తుల తయారీ సంస్థ 'వేక్‌ఫిట్' (Wakefit) వినూత్నంగా నిర్వహించిన 60రోజుల 'స్లీప్ ఇంటర్న్‌షిప్' (Wakefit Sleep Internship) పోటీ ఐదో సీజన్లో ఆమె విజేతగా నిలిచారు. సుదీర్ఘంగా రెండు నెలల పాటు రోజువారీ నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకుంటూ ఈ సవాలును విజయవంతంగా పూర్తి చేసినందుకు గానూ ఆమె ఏకంగా రూ.9.6 లక్షల భారీ నగదు బహుమతిని దక్కించుకున్నారు.
దేశవ్యాప్తంగా నిద్ర ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు వేక్‌ఫిట్ సంస్థ ప్రతి ఏటా ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సీజన్-5 పోటీకి దేశ నలుమూలల నుంచి 2 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, సుదీర్ఘ పరిశీలన అనంతరం కేవలం 10 మంది అభ్యర్థులను ఇంటర్న్‌లుగా ఎంపిక చేశారు. ఎంపికైన వారికి 60 రోజుల పాటు క్రమబద్ధమైన నిద్ర విధానం, గాఢ నిద్ర నాణ్యతను పెంచుకోవడం, వారానికో ప్రత్యేక సవాలును అధిగమించడం వంటి అంశాలను కేటాయించారు. ట్రాకర్ల సాయంతో పోటీదారుల రోజువారీ నిద్ర స్కోర్లను నిరంతరం పర్యవేక్షించారు.
ఈ పోటీ కేవలం మంచంపై పడుకుని నిద్రపోవడానికి మాత్రమే పరిమితం కాకుండా అభ్యర్థుల జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, పరిశీలనా సామర్థ్యం, ఒత్తిడి నిర్వహణ వంటి మానసిక విభాగాలను కూడా క్షుణ్ణంగా పరీక్షిస్తారు. అన్ని విభాగాల్లో అత్యధిక స్కోర్‌ను సాధించి ప్రథమ స్థానంలో నిలిచిన జినియా ఛటర్జీకి రూ.9.6లక్షల చెక్‌తో పాటు ఉచిత విదేశీ విహారయాత్ర (Free Trip) ఆఫర్‌ను కంపెనీ ప్రతినిధులు అందజేశారు. పోటీలో గెలవడంపై ఆమె తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు.
2019లో ప్రారంభమైన వేక్‌ఫిట్ స్లీప్ ఇంటర్న్‌షిప్ కార్యక్రమానికి ఇప్పటివరకు వివిధ సీజన్లలో 10 లక్షలకు పైగా దరఖాస్తులు రావడం విశేషం. గత నాలుగు సీజన్లలో ఎంపికైన 65 మంది ఇంటర్న్‌లకు రూ. లక్ష చొప్పున స్టైపెండ్ అందించగా, సీజన్-5లో సవాళ్ల తీవ్రతను పెంచి విజేతకు భారీ బహుమతిని ఖరారు చేశారు. నేటి ఆధునిక ఒత్తిడితో కూడిన జీవనశైలిలో గాఢమైన నిద్రకు ఉన్న ప్రాధాన్యతను చాటిచెప్పేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతోందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.


