ఉపగ్రహాలకే చుక్కలు చూపిస్తున్న రైతులు
పంట వ్యర్థాలను తగలబెట్టడంలో కొత్త వ్యూహం
ఉపగ్రహాల నిఘా ఉండని సమయంలో వ్యర్థాలకు నిప్పులు
రైతుల తెలివిని చూసి షాకవుతున్న అధికారులు
పోఖ్రాన్‌లో అబ్దుల్ కలాం చూపిన వ్యూహం గుర్తుందా? ఇప్పుడు పంజాబ్ రైతులదీ అదే స్టైల్.. శాటిలైట్ల నిఘాను అర్థం చేసుకుని కొత్త ఎత్తుగడ! ఇంతకీ రైతులు ఏం చేస్తున్నారో తెలుసా..? అది తెలిస్తే మీరు షాకవుతారు.
ఆకాశంలో శాటిలైట్లు తిరుగుతున్నాయి. భూమిపై ప్రతి కదలికను గమనిస్తున్నాయి. ఎక్కడ మంటలు చెలరేగినా వెంటనే అలర్ట్ ఇచ్చేస్తున్నాయి. కానీ పంజాబ్, హర్యానా రైతుల దగ్గర మాత్రం వీటికి ఓ కొత్త సవాల్ ఎదురవుతోంది. ఉపగ్రహాలు తమ పొలాల మీదుగా ఎప్పుడు వెళ్తాయి? ఎప్పుడు నిఘా ఉండదు? అన్న విషయాన్ని అర్థం చేసుకుంటున్నారట! ఉపగ్రహాల పరిశీలన సమయాల మధ్యలోనే పంట వ్యర్థాలను తగలబెడుతున్నారన్న చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఒకప్పుడు అమెరికా అత్యాధునిక స్పై.. శాటిలైట్ల కళ్లుగప్పి భారత్ అణు పరీక్షలు నిర్వహించింది. ఇప్పుడు అదే తరహా ఉపగ్రహ నిఘా వ్యూహం రైతుల విషయంలో చర్చకు వస్తోంది. మరి నిజంగానే రైతులు శాటిలైట్లను బురిడీ కొట్టిస్తున్నారా? వారి తెలివి వెనుక ఉన్న అసలు కథేంటి?
పోఖ్రాన్ వ్యూహం గుర్తుందా?
1998 మే నెల. రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఎడారిలో భారత్ ఐదు అణు పరీక్షలు నిర్వహించింది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సహా భారత శాస్త్రవేత్తల బృందం అత్యంత రహస్యంగా ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేసింది.
అప్పట్లో అమెరికా గూఢచారి ఉపగ్రహాల కళ్లు కప్పడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. శాటిలైట్లు ఎప్పుడు పరిశీలిస్తాయి? వాటి నిఘా పరిధి ఏమిటి? అన్న అంశాలను అర్థం చేసుకుని భారత శాస్త్రవేత్తలు వ్యూహాలు రచించారు.
ఇప్పుడు పంజాబ్, హర్యానా రైతుల విషయంలోనూ అలాంటి ఆసక్తికరమైన చర్చే జరుగుతోంది. అయితే ఇక్కడ అణు పరీక్షలు లేవు. యుద్ధ వ్యూహాలు లేవు. పొలాల్లో మిగిలిపోయిన పంట వ్యర్థాలే అసలు విషయం!
శాటిలైట్ ఎప్పుడు వస్తుందో రైతులకు తెలుసా?
వరి కోతల తర్వాత పొలాల్లో మిగిలిపోయే గడ్డిని తొలగించడం రైతులకు పెద్ద సవాల్. తదుపరి పంట వేయడానికి పొలాన్ని త్వరగా సిద్ధం చేయాలి. అందుకు సమయం తక్కువగా ఉంటుంది. యంత్రాలతో పంట వ్యర్థాలను తొలగించాలంటే ఖర్చు కూడా ఎక్కువే. దీంతో కొందరు రైతులు వాటిని తగలబెడుతున్నారు.
ఈ మంటలను గుర్తించేందుకు నాసాకు చెందిన టెర్రా, ఆక్వా, Suomi NPP, NOAA-20 వంటి ఉపగ్రహాల సమాచారాన్ని ఉపయోగిస్తున్నారు. వీటిలోని MODIS, VIIRS సెన్సర్లు మంటలను గుర్తించి అలర్ట్‌లు పంపిస్తాయి. కానీ ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ ఉపగ్రహాలు రోజంతా ఒకే ప్రాంతాన్ని గమనించవు. నిర్ణీత సమయాల్లో మాత్రమే ఆ ప్రాంతం మీదుగా వెళ్తాయి.
ఈ విషయాన్ని రైతులు కూడా అర్థం చేసుకుంటున్నారన్నది నిపుణుల ఆందోళన. ఉపగ్రహాల నిఘా లేని సమయంలో మంటలు పెడితే వాటి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని కొందరు భావిస్తున్నారట.
అంటే ఒకప్పుడు అంతరిక్ష శాస్త్రవేత్తలకు మాత్రమే తెలిసిన ఉపగ్రహాల పనితీరుపై ఇప్పుడు క్షేత్రస్థాయిలో రైతుల్లోనూ అవగాహన పెరుగుతోందన్నమాట!
80 వేల నుంచి 6 వేలకు.. నిజంగా మంటలు తగ్గాయా?
అధికారిక గణాంకాల ప్రకారం 2021లో దాదాపు 80 వేల వరకు నమోదైన పంట వ్యర్థాల దహనం ఘటనలు 2025 నాటికి సుమారు 6 వేలకు తగ్గాయి. ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు, యంత్రాలపై సబ్సిడీలు, జరిమానాలు, అవగాహన కార్యక్రమాలు ఈ తగ్గుదలకు కారణమయ్యాయి. అయితే ఉపగ్రహాలు గుర్తించిన మంటల సంఖ్య తగ్గిందంటే వాస్తవంగా కాలిపోయిన పొలాల విస్తీర్ణం కూడా అదే స్థాయిలో తగ్గిందని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఒక పొలంలో మంటలు కనిపించకపోయినా, ఆ తర్వాత కాలిన భూమిని పరిశీలిస్తే అసలు పరిస్థితి తెలుస్తుంది.
రైతుల ఎత్తుగడలకు చెక్ పెట్టేందుకు ఫైర్ వాచ్!
ఈ సమస్యను మరింత కచ్చితంగా గుర్తించేందుకు పర్యావరణ సంస్థ iFOREST 'ఫైర్ వాచ్' పేరుతో కొత్త మల్టీ శాటిలైట్ మానిటరింగ్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించింది.
ఇది కేవలం మంటలను లెక్కించడమే కాదు. ఎక్కడ మంటలు వచ్చాయి? ఏ సమయంలో ఎక్కువగా వచ్చాయి? ఎంత వ్యవసాయ భూమి కాలిపోయింది? అన్న వివరాలను కూడా విశ్లేషిస్తుంది.
దీనికోసం MODIS, VIIRS ఉపగ్రహాలతో పాటు Meteosat-8, Meteosat-9 ఉపగ్రహాల సమాచారాన్ని ఉపయోగిస్తున్నారు. వీటిలోని సెవిరి సెన్సర్లు దాదాపు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఫోటోలను అందిస్తాయి.
ఇక సెంటినెల్-2 శాటిలైట్ చిత్రాలతో పంట వ్యర్థాలు కాలకముందు, కాలిన తర్వాత భూమిలో వచ్చిన మార్పులను పోల్చి కాలిపోయిన విస్తీర్ణాన్ని అంచనా వేస్తారు. అంటే మంటలు ఎప్పుడు పెట్టారో గుర్తించలేకపోయినా, వాటి ఆనవాళ్లను మాత్రం గుర్తించే అవకాశం ఉంటుంది.
భారత్ దగ్గరే ఉంది మరో అద్భుతమైన టెక్నాలజీ!
ఈ విషయంలో భారత్ కూడా వెనుకబడలేదు. EOS-05గా పిలిచే GISAT-1A ఉపగ్రహం ద్వారా నిరంతర భూ పరిశీలనకు అవకాశం ఉంది. ఎంపిక చేసిన ప్రాంతాలను ప్రతి ఐదు నిమిషాలకు, మేఘాలు అడ్డంకి కాని పరిస్థితుల్లో మొత్తం భారత భూభాగాన్ని ప్రతి 30 నిమిషాలకు పరిశీలించే సామర్థ్యంతో దీన్ని రూపొందించారు.
అంతరిక్షంలో ఒక భారీ సీసీటీవీ కెమెరా పెట్టినట్టే! అయితే ఈ ఉపగ్రహం ఇంకా పరీక్షలు, కమిషనింగ్ దశలోనే ఉంది. దీని సమాచారాన్ని పర్యావరణ నిఘా కోసం ఎలా ఉపయోగిస్తారన్నది కీలకం.
రైతుల తెలివికి సలాం.. కానీ సమస్యకు పరిష్కారం ఏది?
ఇక్కడ రైతుల తెలివిని తక్కువగా చూడలేం. ఒకప్పుడు ఉపగ్రహాల పనితీరు గురించి సామాన్యులకు పెద్దగా అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు వ్యవసాయం చేసే రైతులు కూడా అంతరిక్ష నిఘా సమయాలు, టెక్నాలజీ పరిమితుల గురించి తెలుసుకుంటున్నారంటే మారుతున్న కాలానికి ఇది ఒక ఉదాహరణ.
అయితే పంట వ్యర్థాలను కాల్చే సమస్యను కేవలం నిఘాతో పరిష్కరించలేం. పంట కోత తర్వాత పొలాలను సిద్ధం చేసుకోవడానికి రైతులకు తగిన సమయం, అందుబాటు ధరల్లో యంత్రాలు, ప్రభుత్వ సహాయం అవసరం. పంట వ్యర్థాలను ఉపయోగపడే వనరులుగా మార్చే మార్గాలపైనా దృష్టి పెట్టాలి.
ఒకవైపు ఉపగ్రహాల టెక్నాలజీ పెరుగుతోంది. మరోవైపు రైతులకూ ఆ టెక్నాలజీపై అవగాహన పెరుగుతోంది. అంతరిక్షంలో శాటిలైట్లు.. భూమిపై రైతులు.. మధ్యలో సాగుతున్న ఈ ఆసక్తికరమైన పోటీ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.


