* మెదక్ ఎమ్మెల్యేలతో రహస్య మంతనాలు.. కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం
* అటు గుంపుమేస్త్రీ, ఇటు బీజేపీతో దోస్తానా?
* మంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రా వ్యక్తుల వ్యాపార సంస్థలతో వేల కోట్ల రూపాయల పాల వ్యాపారం
* గుంటనక్క, గుంపు మేస్త్రీ మధ్య లండన్ లో లలూచీ
* లండన్ మీటింగ్ వివరాలు ఒక్కొక్కటిగా టీఆర్ఎస్ బయటపెడుతుంది
* ముఖ్యమంత్రి పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు ఆంధ్రా రేవంత్ రెడ్డి
* తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడుతూ ఆంధ్రా ఏజెంట్ గా పనిచేస్తున్నాడు
* తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు టార్గెట్ గా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. అవినీతిపరుడు, వెన్నుపోటుదారుడు అంటూ హరీశ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకుని కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచే రాజకీయం చేస్తున్నారని హరీశ్ రావుపై మండిపడ్డారు కవిత.
మెదక్ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టుకున్న హరీశ్ రావు.. మెదక్ లో అన్ని సీట్లు గెలిస్తే నేను బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకోగలుగుతానని, అందుకు బీజేపీ సపోర్ట్ చేస్తుందని ఓపెన్ గా చెప్పారని, ఇది వాస్తవం అని కవిత అన్నారు. బీఆర్ఎస్ పైనా కవిత విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పూర్తిగా కాంప్రమైజ్ అయిపోయిందని, విలువలు వదిలేసిందని ధ్వజమెత్తారు.
లండన్ లాలూచీ కారణంగానే బీఆర్ఎస్ మౌనం?
తెలంగాణ ప్రయోజనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాకట్టు పెడుతున్నా బీఆర్ఎస్ మాట్లాడటం లేదని కవిత మండిపడ్డారు. అధికార కాంగ్రెస్ తో బీఆర్ఎస్ పూర్తిగా కాంప్రమైజ్ అయిపోయిందని ధ్వజమెత్తారు. ఒడిశా అమ్మాయి చనిపోయినా, తెలంగాణకు అన్యాయం జరిగినా మాట్లాడటం లేదన్నారు. లండన్ లాలూచీ కారణంగానే బీఆర్ఎస్ మాట్లాడటం లేదా? అని కవిత నిలదీశారు.
కొన్నిరోజుల క్రితమే లండన్ లో గుంపు మేస్త్రీ, గుంటనక్క మధ్య మీటింగ్ జరిగిందన్నారు. గుంటనక్కకు చాలా వ్యాపార సంబంధాలు ఉండటం కారణంగానే మాట్లాడటం లేదన్నారు. ఇక ఆంధ్రా వాళ్లతో కేటీఆర్ కు వ్యాపార సంబంధాలు, దోస్తులు ఉండటంతో ఆయన కూడా మాట్లాడటం లేదని విమర్శించారు. నిజంగా లండన్ లో గుంటనక్కతో లాలూచీ లేకపోతే ఆయన మీద క్విడ్ ప్రో కో కేసు నమోదు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ ను డిమాండ్ చేశారు కవిత.
నారాయణ, చైతన్యతో రూ.960కోట్ల పాల వ్యాపారం
''ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో హరీశ్ రావు కార్పొరేట్ సంస్థలకు పెద్దఎత్తున పాలు పోసి వ్యాపారం చేశారు. ఒక నారాయణ, చైతన్య కాలేజీలకే నెలకు 5 కోట్ల చొప్పున 8 ఏళ్లుగా 960 కోట్ల వ్యాపారం చేశారు. ఇంకా కార్పొరేట్ హాస్పిటల్స్ కిమ్, కామినేని, యశోద వంటి హాస్పిటల్స్ కు కూడా ఆయన పాలు పోశారు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటూ ఇలా ఆంధ్రా వాళ్ల పాల వ్యాపారం చేయటం క్విడ్ ప్రో కో కాదా? గుంటనక్కతో ముఖ్యమంత్రికి లాలూచీ లేకపోతే.. లండన్ లో అగ్రిమెంట్ జరగకపోతే ఆయనపై క్విడ్ ప్రో కో కేసు నమోదు చేయాలి. అదే విధంగా కరీంనగర్ డైయిరీ, ముల్కనూరు డెయిరీ, మదర్ డెయిరీ, విజయ డైయిరీ లాంటి వాళ్లకు 5మంది పైగా విద్యార్థులు ఉన్న చోట పాలు వాళ్లే పోసేలా జీవో ఇవ్వాలి.
అవినీతికి పాల్పడిన పార్టీని మళ్లీ అధికారంలోకి తెద్దామా?
ప్రభుత్వంతో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కాంప్రమైజ్ అయ్యింది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ వ్యవస్థీకృత అవినీతికి పాల్పడింది. పాల వ్యాపారం ఒకరికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒకరికి, ఇసుక వ్యాపారం ఒకరికి అన్నట్లు పంచుకుని వ్యవస్థీకృత అవినీతి చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ఫెయిల్ అయ్యిందంటూ మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. వ్యవస్థీకృతమైన అవినీతికి పాల్పడిన పార్టీని మళ్లీ అధికారంలోకి తెద్దామా? జవాబుదారీతనంతో, అవినీతి లేకుండా, కొత్త వాళ్లకు అవకాశం కల్పించేందుకు మేము పార్టీ పెట్టాం. మా లాంటి పార్టీకి అవకాశం కల్పించండి'' అని కవిత అన్నారు.
మెదక్ ఎమ్మెల్యేలతో మీటింగ్
''ఇటీవలే మెదక్ ఎమ్మెల్యేలతో హరీశ్ రావు మీటింగ్ పెట్టారు. కేసీఆర్ ఎన్టీఆర్ లా పెద్ద మనిషి. కానీ ఆయన కొడుక్కి వారసత్వం ఇవ్వటం సరికాదంటూ ఆయన వారితో అన్నారు. అందులో ఉన్న ఒక ఎమ్మెల్యేనే నాకు ఈ విషయాలు చెప్పారు. ఎన్టీఆర్ పేరు తీసుకున్నారంటే గుంటనక్క వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమైందన్న మాట. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకొని ఆ తర్వాత బీజేపీ సపోర్ట్ తీసుకోవాలని ఆయన కుట్ర చేస్తున్నారు.
ఆర్ఎస్ఎస్ ప్రముఖుడితో మంచి సంబంధాలు
బీజేపీ తో మిలాఖత్ ఉందని నేను చెప్పటానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. రాజ్ పుష్ప ఓపెన్ స్కై విల్లాస్ లో ఒక ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు వచ్చినప్పుడల్లా ఆయనకు పసుపు, మిరియాలు కలిపిన పాలు వెళ్తుంటాయి. ఆ రోజు హరీష్ రావు పూర్తిగా తన కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆయనతో మీటింగ్ పెడతారు. నేనిప్పుడు బీఆర్ఎస్ లో లేను. ఆ పార్టీ ఎలా పోయినా నాకు సంబంధం లేదు. కానీ తిన్నింటి వాసాలు లెక్కపెట్టే గుంటనక్క గురించి తెలియాలని చెబుతున్నా.
ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసులు ఏమయ్యాయి?
ఇప్పుడున్న ముఖ్యమంత్రితో కచ్చితంగా ఆయనకు లాలూచీ ఉంది. లేదంటే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసులు ఏమయ్యాయి? హరీశ్ రావు అనే వ్యక్తి పచ్చి బీసీ వ్యతిరేకి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాకుండా చేసిన వ్యక్తిని ఆయన పార్టీలో పెట్టుకున్నాడు. ఆయన మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో సీటు ఇస్తే మేము వ్యతిరేకించాము. బీసీలు ఆయనను ఓడించారు. అయినా బీఆర్ఎస్ పార్టీ అలాంటి వ్యక్తిని పార్టీలో పెట్టుకుంది.
ఆంధ్రా రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు ఆంధ్రా రేవంత్ రెడ్డి. బ్రాహ్మణ పరిషత్ లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు ఆంధ్రా వాళ్లకు ఇచ్చారు. అంటే తెలంగాణలో బ్రాహ్మణ మేధావులు లేరా? పొలిటికల్ పదవులు కచ్చితంగా తెలంగాణ వాళ్లకే ఇవ్వాలి. ఇప్పుడున్న బ్రాహ్మణ పరిషత్ ఛైర్మన్ బసవరాజు శ్రీనివాసరావు పచ్చి తెలంగాణ వ్యతిరేకి. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ వాదులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. పేద బ్రాహ్మణులకు మేలు చేయాల్సిన తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ఆంధ్రా రౌడీలకు అడ్డాగా మారింది. దళిత మహిళలను, తెలంగాణ వాళ్లను బసవరాజు శ్రీనివాసరావు ఇష్టమొచ్చినట్లు తిట్టారు. వెంటనే ఆంధ్రా వాళ్లకు ఇచ్చిన ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను తొలగించి తెలంగాణ వాళ్లకు ఇవ్వాలి.
ఇనార్బిట్ మాల్ వద్ద ఓ ఆంధ్రా ఎంపీ కొడుకు 6 కోట్ల కారుతో ఒడిశాకు చెందిన 25 ఏళ్ల అమ్మాయిని గుద్ది చంపాడు. ఆ అమ్మాయి ఇంట్లో పని చేసి సంపాదించే ఆమెను చంపితే పోలీసులు రాసిన ఎఫ్ఐఆర్ లో తండ్రి పేరు లేదు. ఈ కేసులో ఆల్కహాల్ కంటెంట్ లేదని క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఎఫ్ఐఆర్ లో అన్నీ ఖాళీలే ఉన్నాయి. వేరే కేసులో కూడా ఇలాగే ఎఫ్ఐఆర్ వేస్తారా? ఇలా ఎఫ్ఐఆర్ రాసినందుకు పోలీసులు సిగ్గుపడాలి.
మొత్తం ఆంధ్రోళ్ల పెత్తనమే
తన విదేశీ పర్యటనను అడ్డుకుంటే 48 నిమిషాలు ప్రెస్ మీట్ పెడతాడు ముఖ్యమంత్రి. కానీ ఒక్క క్షణం కూడా ఎంపీ కొడుకు చేసిన యాక్సిడెంట్ గురించి మాట్లాడడు. ఆయన విదేశీ పర్యటనను అడ్డుకుంటే ముఖ్యమంత్రికి తెలంగాణ గుర్తు వచ్చింది. కానీ రెడ్ కో ఛైర్మన్, ప్రిన్సిపల్ సెక్రటరీ సహా ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ లో ఆంధ్రా వాళ్ల పెత్తనమే కదా ఉన్నది. తెలంగాణ భక్తుల పెసలతో కట్టిన యాదాద్రి గుడిలో మెంబర్ గా ఆంధ్రా హీరో భార్యకు అవకాశం కల్పించారు. తిరుపతి బోర్డులో మన వాళ్లకు అవకాశం కల్పించటమంటే అక్కడ మన వాళ్ల పైసలు కూడా ఉంటాయి. బయోకాన్ లో తెలుగు మాట్లాడినందుకు 200 మందిని తీసేస్తే ముఖ్యమంత్రి మాట్లాడడు.
ఆంధ్రా వాళ్ల ఏజెంట్ గా ముఖ్యమంత్రి
ఆంధ్రా వాళ్లు సహా ఇతర కంపెనీలలో బాత్ రూమ్ లు కడిగే వాళ్లను కూడా తెలంగాణ వాళ్లను పెట్టుకోవటం లేదు. నారాయణ కాలేజీలో సంవత్సరం మధ్యలో చాలా మందిని తొలగించారు. వారికిప్పుడు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఆంధ్రా వాళ్ల ఏజెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తెలంగాణలో పాలన నడుస్తోంది. అందుకే ఈ ముఖ్యమంత్రి తెలంగాణ వాళ్లకు అన్యాయం జరిగితే మాట్లాడటం లేదు. ఈ ముఖ్యమంత్రికి ఇప్పటికైనా తెలంగాణ సోయి రావాలి. లేదంటే ఆయన ఎప్పుడు కనిపించినా సరే ఆంధ్రా రేవంత్ రెడ్డి అనే పిలుస్తా.
ఈ ముఖ్యమంత్రికి బీజేపీ, ఆంధ్రా వాళ్లతో లాలూచీ ఉంది. అందుకే తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోవటం లేదు. కృష్ణా నీళ్లను ఆంధ్రా వాళ్లు పట్టుకుపోయినా పట్టించుకోవటం లేదు. నిజంగా ఆయనకు తెలంగాణ సోయి ఉంటే బ్రాహ్మణ పరిషత్ లో ఆంధ్రా వాళ్లను తొలగించాలి. యాదాద్రి గుడి బోర్డులో కూడా ఆంధ్రా వాళ్లను తొలగించాలి'' అని కవిత డిమాండ్ చేశారు.












