Telangana: దేశంలోనే అతిపెద్ద భూస్వామి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. ఈ నాలుగింటికి సంబంధించి భూమి వైశాల్యం దగ్గర దగ్గర 6లక్షల 80వేల పైచిలుకు ఎకరాలు ఉందన్నారు. ఈ మొత్తానికి గుత్తేదారు రేవంత్ రెడ్డి అని చెప్పారు. మున్సిపల్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి.. 7లక్షల ఎకరాలకు గుత్తేదారు అని వెల్లడించారు.
ఎక్కడపడితే అక్కడ భూకబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు
ముఖ్యమంత్రివా? రియల్ ఎస్టేట్ బ్రోకర్ వా? అంటూ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు దాసోజు శ్రవణ్. ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ ఏరియాలో దుర్మార్గానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. దురదృష్టం ఏంటంటే మీడియా దాన్ని చూపించడం లేదన్నారు. మా భూములను అప్పనంగా కొట్టేస్తున్నారని, కబ్జా చేస్తున్నారని చెప్పినా.. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేసినా.. పోలీసులు పట్టించుకోవడం లేదని దాసోజు శ్రవణ్ తెలిపారు. ''7 లక్షల ఎకరాలలో ఎక్కడపడితే అక్కడ కబ్జాలు చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ అదిరించి బెదిరించి ల్యాండ్ సెటిల్ మెంట్లు చేస్తున్నారు. వాళ్ళ పేరు మీద టైటిల్స్ ట్రాన్స్ ఫర్ చేసుకుంటున్నారు. దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి'' అని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
ఆ భూములు అమ్ముకోవద్దు.. పేదలకు పట్టాలిద్దాం
మియాపూర్ ల్యాండ్ స్టోరీ అయిపోయిందన్న దాసోజు శ్రవణ్.. ఆ భూములను అమ్ముకునే ప్రయత్నం చేయొద్దని సీఎం రేవంత్ ను కోరారు. ఆ భూములు పేదలకు వాడుదాం.. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడదాం.. లేదా పేదోళ్ళకు పట్టాలు ఇద్దాం. లేదా భవిష్యత్ ప్రజల అవసరాల కోసం ప్రభుత్వ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కడదాం అని ముఖ్యమంత్రి రేవంత్ కు సూచించారు. అప్పనంగా సొమ్ము వచ్చింది కదా అమ్ముకుంటాం అంటే మాత్రం అంతకంటే నయవంచన, మోసం ఇంకోటి ఉండదన్నారు. ఇటువంటి అడ్డమైన పనులు చేయడం కోసమే మళ్లీ కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు.
బట్ట కాల్చి కేసీఆర్ పైన వేయడం తగదు
ఫ్యూచర్ సిటీ ఏరియా, మియాపూర్ ఏరియాలో మీరు చేస్తున్న కబ్జాలు, మోసాలు ఎవరికీ తెలియదన్నట్లుగా శుద్దపూస లెక్క మాట్లాడొద్దు అంటూ రేవంత్ రెడ్డికి హితవు పలికారు. మీరు, మీ అనుచరులు చేస్తున్న దందాలు, భూకబ్జాలు అన్నీ తెలిశాక కూడా.. బట్ట కాల్చి కేసీఆర్ పైన వేయడం రేవంత్ రెడ్డికి తగదన్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలి
''రేవంత్ రెడ్డి ఒక పెద్ద గుత్తేదారు. 7లక్షల ఎకరాల గుత్తేదారు. అసైన్డ్ భూములను కబ్జా చేస్తున్నారు. ఆయన, ఆయన తమ్ముళ్లు, అనుచరులు అంతా కలిసి కబ్జాలు చేస్తున్నారు. దానికి చరమగీతం పాడాలంటే గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోండి. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కర్రు కాల్చి వాళ్ళకి వాత పెట్టండి'' అని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు దాసోజు శ్రవణ్.


