Trisha Krishnan: తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. సినీ గ్లామర్, రాజకీయ అధికారం కలిసిన రాష్ట్రం కాబట్టే అందరిలోనూ ఇంత ఆసక్తి ఉంటుంది. ఈ మధ్యనే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి రావడం, మొట్ట మొదటి పోటీలోనే గెలిచి, ముఖ్యమంత్రిగా అధికారం దక్కించుకోవడం తమిళనాట రాజకీయాలలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలిత పాత్రలో త్రిష కనిపించబోతుందట.
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా త్రిషకి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. విజయ్ సీఎం అయిన సమయంలో ఈమె పేరు కూడా పొలిటికల్ సర్కిల్స్‌లో భారీగా చక్కర్లు కొట్టింది. త్రిషకి పదవి కూడా ఇస్తున్నట్టుగా అంతటా వార్తలు వచ్చి వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు కోలీవుడ్‌లో అంతకుమించిన మరో సెన్సేషనల్ న్యూస్ మీడియా వర్గాలలో వైరల్ అవుతోంది. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రజలు అమ్మ అని పిలుచుకునే లెజెండరీ నాయకురాలు, సినీ నటి జయలలిత పాత్రలో త్రిష నటించబోతోందని తాజా సమాచారం.
తమిళ రాజకీయాలను, చిత్ర పరిశ్రమను శాసించిన మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ జీవితకథ ఆధారంగా ప్రస్తుతం ‘పురచ్చి తలైవర్ ఎంజీఆర్’ పేరుతో ఓ బయోపిక్ మూవీ తెరకెక్కుతోంది. ఎంజీఆర్ సినీ ప్రస్థానం నుంచి మొదలుకొని ఆయన రాజకీయ ప్రయాణం వరకు.. జీవితంలో అత్యంత కీలకమైన వ్యక్తి జయలలిత. వీరిద్దరూ వెండితెరపై సూపర్ హిట్ జోడీగానూ వెలిగారు. కాబట్టే, ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలిత పాత్ర ఎంతో కీలకం అవనుంది. అందుకే, మేకర్స్ ఈ పాత్రకి క్రేజీ హీరోయిన్ త్రిషను సంప్రదించారట. జయలలిత పాత్ర అంటే ఎంతో పట్టుదలతో చేసి మెప్పించాలి. అందుకు, సిద్ధపడే త్రిష కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
కంగనా కంటే త్రిష గొప్పగా నటిస్తుందా?
జయలలిత బయోపిక్ రావడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ 'తలైవి' పేరుతో జయలలిత పాత్రలో నటించింది. కంగనా తన నటనతో ప్రశంసలు అందుకుంది. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. సినిమాగా కాకుండా డాక్యుమెంటరీగా తీయాల్సింది అన్న విమర్శలు బాగా వచ్చాయి. మరి, ఇప్పుడు జయలలిత పాత్రలో త్రిష నటించేదే నిజమైతే కంగనా కంటే అద్భుతంగా నటించి మెప్పిస్తేనే ప్రశంసలు అందుకుంటుంది. లేదంటే, కంగనాలా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.


