కెనడాలోని సూర్రే (Surrey) నగరంలో భారత సంతతికి చెందిన ఒక ఇంటి యజమానురాలు (మహిళ), తన ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తితో తీవ్ర వాగ్వాదానికి దిగి చివరకు పోలీసుల చేతిలో అరెస్టయింది. అద్దెదారుడు తన స్నేహితుడితో కలిసి ఇంటి బయట బార్‌బెక్యూ (BBQ)లో బీఫ్ (గోమాంసం) వండుకోవడం చూసి సదరు మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన ఆస్తి పాడవుతోందంటూ రాద్ధాంతం చేస్తూ వంట గ్రిల్‌లోని ఆహారాన్ని తొలగించేందుకు యత్నించింది.
అద్దెదారుడు ఆమెను వెళ్ళిపోమని చెప్పడంతో వివాదం మరింత తీవ్రమైంది. సదరు మహిళ అంతటితో ఆగకుండా, అద్దెకు ఇచ్చిన పోర్షన్‌లోకి అక్రమంగా చొరబడి అతడిపై రాయి, దాడికి ఉపయోగపడే వస్తువులతో దాడికి ప్రయత్నించింది. అంతేకాకుండా ఇంటి తలుపులు తొలగించడం, లాక్‌లు మార్చడం వంటి చర్యలకు పాల్పడినట్లు అద్దెదారుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోల్లో పేర్కొన్నాడు.
తానే స్వయంగా పోలీసులను పిలిపించి బుద్ధి చెప్తానని మహిళ హెచ్చరించినప్పటికీ, ఘటనా స్థలానికి చేరుకున్న కెనడా (RCMP) పోలీసులు అద్దెదారుడి పట్ల అక్రమంగా చొరబడి, దాడికి పాల్పడినందుకు ఆ యజమానురాలినే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనతో కెనడాలోని అద్దెదారుల హక్కులు, యజమానుల పరిమితులపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
కెనడా చట్టాల ప్రకారం అద్దెకు ఇచ్చిన తర్వాత యజమానికి ప్రాపర్టీపై పూర్తి హక్కులు ఉండవని, తగిన నోటీసు లేకుండా లోపలికి రావడం లేదా అద్దెదారుల వ్యక్తిగత ఆహార అలవాట్లలో జోక్యం చేసుకోవడం చట్టరీత్యా నేరమని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తమ ఆచారాలు, నమ్మకాలను ఇతరులపై రుద్దేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ సంఘటన స్పష్టం చేస్తోందని అభిప్రాయపడుతున్నారు సదరు మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.










