తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన 'మాక్ అసెంబ్లీ'లో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ సాగునీటి నిర్వహణా లోపాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో నీళ్ల విషయంలో తెలంగాణకు దారుణమైన అన్యాయం జరిగిందని, శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ అక్రమంగా నీళ్లను తరలించిందని గుర్తుచేశారు. ఆ చారిత్రక అన్యాయాలను సరిదిద్దుతూ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి, మహబూబ్‌నగర్ మినహా ఉమ్మడి తొమ్మిది జిల్లాలకు కాళేశ్వరం జలాలను పారించారని తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా దాదాపు రెండు కోట్ల ఎకరాలను సాగులోకి తెచ్చిన ఘనత కేసీఆర్‌దేనని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. మిషన్ కాకతీయ ద్వారా ఎండిపోయిన చెరువులను జలకళతో నింపి, మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన మంచినీళ్లు ఇచ్చారని కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు సూర్యాపేట లాంటి పొడి జిల్లాల్లో కూడా పొంగిపొర్లాయని పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాను పీడించిన ఫ్లోరైడ్ రక్కసి కాంగ్రెస్ పాలన ఇచ్చిన శాపమని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే నల్గొండ నుంచి ఫ్లోరైడ్‌ను తన్ని తరిమేశారని వ్యాఖ్యానించారు.
నీటి విడుదలలో కేసీఆర్ అనుసరించిన నిబంధనలను గుర్తుచేస్తూ, బీఆర్‌ఎస్ హయాంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ గేట్లను తెరిచిన తర్వాతే కుడి కాలువ గేట్లను తెరచేవారని వివరించారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఆంధ్రప్రదేశ్‌కు లబ్ధి చేకూరుస్తూ కుడి కాలువ గేట్లు తెరిచిన తర్వాతే ఎడమ కాలువకు నీళ్లు ఇస్తున్నారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు, వెలిగొండ ప్రాజెక్టుల ద్వారా ఏపీ అక్రమంగా నీళ్లను దోచుకుపోతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మౌనప్రేక్షకుడిగా మారిందని ఆరోపించారు.
ప్రభుత్వ నిర్లక్ష్య నిర్వహణ వల్లే కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా వేల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలో కలిశాయని, ఇప్పటికే దాదాపు 150 టీఎంసీల ప్రాణహిత-గోదావరి నీళ్లు సముద్రం పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమృద్ధిగా నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ సర్కార్ చేతగానితనం, సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే రాష్ట్రంలో నేడు కరువు పరిస్థితులు దాపురించాయని జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు.








