తెలంగాణ

Adilabad: సన్నబియ్యం పేరుతో పీడీఎస్ బియ్యం దందా!..

రచన: Venu5 నిమిషాల పఠనం

రేషన్ లబ్ధిదారుల నుంచి బియ్యాన్ని సేకరించి మిల్లులకు తరలించడం.. అక్కడ పాలిష్ చేయడం.. ఆ తర్వాత ఎలాంటి అనుమతులు ఉన్నాయో, లేవో స్పష్టత లేని బ్రాండ్ల పేర్లతో ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి పంపడం జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి.

కొందరు వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారా.. బ్రాండెడ్ పేర్ల ముసుగులో నాసిరకం, కల్తీ బియ్యాన్ని మార్కెట్లోకి తరలిస్తున్నారా.. ప్రస్తుతం సన్నబియ్యం ధరలు మండిపోతున్న వేళ.. తెరపైకి వస్తున్న ఈ ఆరోపణలు వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. గత పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా సన్నబియ్యం ధరలు భారీగా పెరిగాయి. నాలుగు నెలల క్రితం క్వింటాల్‌కు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయల వరకు ఉన్న ధర.. ప్రస్తుతం ఏకంగా ఏడు వేల రెండు వందల రూపాయలకు చేరినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ పరిస్థితిని కొందరు మిల్లర్లు, వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీడీఎస్ ద్వారా లభించే బియ్యాన్ని గ్రామస్థాయిలో ఏజెంట్ల ద్వారా సేకరించి.. మిల్లుల్లో పాలిష్ చేసి.. వివిధ బ్రాండ్ల పేర్లతో కొత్త సంచుల్లో నింపి.. సన్నబియ్యం, సూపర్ ఫైన్ క్వాలిటీ పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ తరహా అక్రమ దందా విస్తరించిందనే విమర్శలు వస్తున్నాయి.

రేషన్ లబ్ధిదారుల నుంచి బియ్యాన్ని సేకరించి మిల్లులకు తరలించడం.. అక్కడ పాలిష్ చేయడం.. ఆ తర్వాత ఎలాంటి అనుమతులు ఉన్నాయో, లేవో స్పష్టత లేని బ్రాండ్ల పేర్లతో ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి పంపడం జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది జూన్‌లో ఆదిలాబాద్ పట్టణంలోని శివాజీ చౌక్ ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో.. సూర్యతేజ, మధురం, గీతాంజలి, గోల్డెన్ సైకిల్, జైశ్రీరామ్ తదితర బ్రాండ్ల బ్యాగుల్లో నింపి ఉన్న సుమారు 80 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. గోదాం నుంచి మరో 320 బస్తాలను స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

అదే నెలలో క్రాంతినగర్‌లో ఓ వ్యక్తి ఇంట్లో వివిధ బ్రాండ్ల పేర్లతో 35 కిలోల చొప్పున నింపిన 35 బస్తాలను కూడా గుర్తించారు. మరోవైపు ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని ఓ దుకాణంలో సుమారు 50 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుబడిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఇలాంటి ఘటనలు బయటపడుతున్నప్పటికీ.. అక్రమ దందా పూర్తిగా అరికట్టేందుకు తనిఖీలు మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వరి సాగు తగ్గడం.. దిగుబడులు పడిపోవడం.. మార్కెట్లో బియ్యానికి డిమాండ్ పెరగడం.. వీటికి తోడు కృత్రిమ కొరత సృష్టిస్తే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే అక్రమ బియ్యం దందాకు మరింత ఊతం లభించే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లు, గోదాములు, మిల్లుల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి.. బియ్యం నాణ్యతను పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు.

ఫిర్యాదు వచ్చిన తర్వాతే స్పందించడం కాకుండా.. ముందస్తు తనిఖీలతో అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన ఆహార పదార్థాల విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా.. కల్తీ, నాసిరకం బియ్యం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

#adilabad#rice-racket#fraud#fine-quality#pds#Asifabad#Kagaznagar
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి