తెలంగాణ

Bodhan: నకిలీలకు అడ్డాగా మారిన మీసేవ కేంద్రాలు!..

రచన: Venu5 నిమిషాల పఠనం

హైదరాబాద్‌ మీ సేవ కేంద్రాల ద్వారా వేలాది నకిలీ జనన, మరణ ధ్రువపత్రాలు జారీ అయినట్లు 2023లో జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ విచారణలో బయటపడింది. 2022లో కూడా హైదరాబాద్‌లో మీ సేవ కేంద్రం నిర్వాహకుడితో పాటు పలువురిని నకిలీ జనన ధ్రువపత్రాల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి ముంగిటకు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన మీ సేవ కేంద్రాలు..కొందరి అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ప్రజలకు సులభంగా సర్టిఫికెట్లు అందించాల్సిన కేంద్రాల్లోనే.. నకిలీ పత్రాల దందా కొనసాగుతుందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. తాజాగా బోధన్‌లో ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం అధికారుల పర్యవేక్షణలో ఉన్న లోపాలను బయట పెడుతుంది..

నిజామాబాద్ జిల్లా బోధన్ రాకాసిపేట్‌లోని సహారా మీ సేవ కేంద్రంలో నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు, టీసీలు, బోనఫైడ్ సర్టిఫికెట్ల తయారీ వ్యవహారం పోలీసుల తనిఖీల్లో బయటపడింది. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు భారీగా నకిలీ పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ దందా రెండేళ్లుగా కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఒక్కో సర్టిఫికెట్‌కు సుమారుగా ఐదు వేల నుంచి పది వేల రూపాయల వరకు వసూలు చేసినట్లు తేలింది. అంతేకాదు.. 38 ఖాళీ మీ సేవ ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా పోలీసుల చేతికి చిక్కాయి. ఇక ఈ దందా బోధన్‌కు మాత్రమే పరిమితమైందా ఇంకా ఈ నకిలీల సామ్రాజ్యం ఎక్కడి వరకు విస్తరించింది అనే విషయాలు తెలియాలంటే కఠినమైన నిఘా ఉండాలని ఈ ఘటనతో పాటు గత సంఘటనలు కూడా గుర్తు చేస్తున్నాయి..

మరోవైపు హైదరాబాద్‌ మీ సేవ కేంద్రాల ద్వారా వేలాది నకిలీ జనన, మరణ ధ్రువపత్రాలు జారీ అయినట్లు 2023లో జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ విచారణలో బయటపడింది. 2022లో కూడా హైదరాబాద్‌లో మీ సేవ కేంద్రం నిర్వాహకుడితో పాటు పలువురిని నకిలీ జనన ధ్రువపత్రాల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. 2025లో సంగారెడ్డిలో నకిలీ జనన ధ్రువపత్రాల ఆరోపణలపై ఓ మీ సేవ కేంద్రాన్ని అధికారులు సీజ్ చేశారు.

ఇక 2026లో ఏసీబీ నిర్వహించిన తనిఖీల్లో కూడా పలు మీ సేవ కేంద్రాల్లో ఖాళీ సర్టిఫికెట్లు, అనధికారిక పత్రాలు, మధ్యవర్తుల ప్రమేయం, అధిక వసూళ్లు వంటి అక్రమాలు బయటపడ్డాయి. అయితే ఈ నకిలీ సర్టిఫికెట్ల వల్ల నష్టపోయేది కొన్ని సార్లు నిజమైన లబ్ధిదారుడే. ఒకరి నకిలీ జనన ధ్రువీకరణ పత్రం ఆధారంగా ప్రభుత్వ రికార్డులో తప్పు వివరాలు నమోదైతే.. అదే పేరుతో ఉన్న నిజమైన వ్యక్తి సర్టిఫికెట్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

అలాగే విద్యార్థులకు టీసీ, బోనఫైడ్ వంటి పత్రాలు అవసరమైనప్పుడు.. నకిలీ సర్టిఫికెట్ల కారణంగా వారి అసలైన పత్రాలపై కూడా అనుమానాలు తలెత్తే పరిస్థితి రావచ్చు. అంతేకాదు.. షాదీ ముబారక్ వంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నకిలీ పత్రాలు ఉపయోగించి ఎవరైనా అక్రమంగా లబ్ధి పొందితే.. అర్హత ఉన్న పేద కుటుంబానికి దక్కాల్సిన ప్రయోజనం దారి మళ్లే ప్రమాదం ఉంది.

అందుకే బోధన్ ఘటనలో పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరితో దర్యాప్తును ముగించకుండా.. ఈ నకిలీ సర్టిఫికెట్లు ఎవరెవరు తయారు చేయించుకున్నారు..? వాటిని ఎక్కడ ఉపయోగించారు..? వాటి ఆధారంగా ఎవరైనా ప్రభుత్వ పథకాల లబ్ధి పొందారా..? ఈ దందాకు సహకరించిన మధ్యవర్తులు ఎవరైనా ఉన్నారా..? అనే కోణాల్లో లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో.. మీ సేవ కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ నిరంతరం అమలు చేయవలసిన అవసరం ఉందని అంటున్నారు.. మరి ఇప్పటికైనా ప్రభుత్వం.. అధికారులు స్పందించి తగిన చర్యలు చేపడతారా లేదా చూడాలి..

#Telangana#Bodhan#Mee-Seva centers#fakes#certificates
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి