రాష్ట్రంలో అవినీతి అధికారులు ఆగడాలు మితిమీరుతున్నాయి. ప్రభుత్వం ఉద్యోగం చేస్తూ జీతం తీసుకుంటూనే అక్రమార్జనకు ఎగబడ్డారు. బిల్లుల కోసం వచ్చే వారిని లంచం ఇవ్వాలని తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు సమాచారం.ఇవ్వకపోతే వారి బిల్లులు పెండింగులో పెడుతూ ఇవాళ రేపు అంటూ కాలయాపన చేస్తున్నట్టు పెద్దఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలి కాలంలో అధికారుల తీరుతో విసిగిపోయిన కొందరు నేరుగా ఏసీబీని ఆశ్రయిస్తున్నారు.
ఏసీబీ సాయంతో అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. బాధితుడి పక్షాన నిలిచిన ఏసీబీ.. సకాలంలో లంచాధికారుల తిక్క కుదురుస్తోంది. డబ్బులు తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని వారిని కటకటాల పాలు చేస్తోంది. తాజాగా ఏసీబీ అధికారులు ఇద్దరు అవినీతి అధికారుల ఆట కట్టించారు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లాలో వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.. భూపాలపల్లి జిల్లాలో ఇద్దరు పీఎంకేఎస్‌వై అధికారులు సతీశ్ రెడ్డి, రాజు ఏసీబీకి చిక్కారు. వారు కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేసేందుకు 25 శాతం కమీషన్ డిమాండ్ చేసినట్టు తెలిసింది. మొత్తంగా రూ.1.62 కోట్ల పనుల బిల్లుల వ్యవహారంలో లంచం డిమాండ్ చేయగా.. కాంట్రాక్టర్ నుంచి రూ.39 లక్షలు అడిగారు.
అయితే, బాధిత కాంట్రాక్టర్ ఇప్పటికే పలుమార్లు ఆన్‌లైన్‌లో నిందితుల ఖాతాలకు నగదు బదిలీ చేశాడు. తాజాగా మరో రూ.1.34 లక్షల బిల్లులోనూ అవినీతి అధికారులు కమీషన్ డిమాండ్ చేశారు. వారి తీరుతో విసిగిపోయిన కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. పీఎంకేఎస్‌వై కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. బంధువుల పేరిట ఉన్న సుమారు 40 ఫోన్‌పే ఖాతాల్లోకి ఇద్దరు అధికారులు నగదు బదిలీ చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు వెల్లడించారు.


