National

క్షిపణి మనదే.. ప్రపంచ మార్కెట్‌ మనదే.. భారత్‌ కొత్త వ్యూహం!

రచన: Kashi••12 నిమిషాల పఠనం

ఒకప్పుడు యుద్ధ విమానం కావాలన్నా.. క్షిపణి కావాలన్నా.. ఆధునిక రక్షణ పరికరం కావాలన్నా భారత్‌ విదేశాల వైపు చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సీన్‌ మారుతోంది. భారత్‌ తయారు చేసిన ఆయుధాలే ఇతర దేశాల రక్షణ వ్యవస్థల్లోకి అడుగుపెడుతున్నాయి.

ఆకాశ్‌ క్షిపణికి మధ్య ఆసియాలో కొత్త మార్కెట్‌..

బ్రహ్మోస్‌ నుంచి తేజస్‌ వరకు పెరుగుతున్న అవకాశాలు

రక్షణ ఎగుమతుల్లో దూసుకెళ్తున్న భారత్‌

ఇప్పుడు ఎదురవుతున్న అసలు సవాల్‌ ఏంటి?

ఒకప్పుడు యుద్ధ విమానం కావాలన్నా.. క్షిపణి కావాలన్నా.. ఆధునిక రక్షణ పరికరం కావాలన్నా భారత్‌ విదేశాల వైపు చూడాల్సి వచ్చేది. ఆయుధాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు సీన్‌ మారుతోంది. భారత్‌ తయారు చేసిన ఆయుధాలే ఇతర దేశాల రక్షణ వ్యవస్థల్లోకి అడుగుపెడుతున్నాయి. మన దేశంలో తయారైన ఆకాశ్‌ క్షిపణి వ్యవస్థకు తజికిస్థాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌ వంటి మధ్య ఆసియా దేశాలు కస్టమర్లుగా మారాయి.

ఇది కేవలం కొన్ని క్షిపణుల అమ్మకం మాత్రమే కాదు. ఒకప్పుడు విదేశీ ఆయుధాల కోసం భారీగా ఖర్చు చేసిన భారత్‌.. ఇప్పుడు తన సొంత రక్షణ సాంకేతికతతో అంతర్జాతీయ మార్కెట్‌లో స్థానం సంపాదించుకోవడానికి చేస్తున్న ప్రయత్నానికి ఇది మరో ఉదాహరణ.

ఆకాశ్‌ క్షిపణి.. మధ్య ఆసియాలో భారత్‌కు కొత్త దారి!

తజికిస్థాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌ వంటి దేశాలకు ఈ అమ్మకాల ప్రాధాన్యం ఏంటి? అసలు మధ్య ఆసియాలో భారత్‌కు అవకాశాలు ఎందుకు పెరుగుతున్నాయి?

దీనికి ప్రధాన కారణం ఆయుధ సరఫరాదారులను మార్చుకోవాలనే కొన్ని దేశాల ఆసక్తి. ఈ ప్రాంతంలోని అనేక దేశాలు చాలా కాలంగా రష్యా ఆయుధాలపై ఆధారపడ్డాయి. అయితే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో రష్యా రక్షణ ఎగుమతుల సామర్థ్యంపై ఒత్తిడి పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయ సరఫరాదారుల కోసం వెతుకుతున్న దేశాలకు భారత్‌ ఒక అవకాశంగా కనిపిస్తోంది.

ఆకాశ్‌ అనేది గాల్లోకి దూసుకొచ్చే విమానాలు, ఇతర వైమానిక లక్ష్యాలను ఎదుర్కోవడానికి రూపొందించిన భూ ఆధారిత గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ రూపొందించిన ఈ వ్యవస్థ దేశీయ సాంకేతిక సామర్థ్యానికి ఒక ఉదాహరణ.

ఇప్పటికే అర్మేనియా వంటి దేశాలకు ఆకాశ్‌ వ్యవస్థ ఎగుమతుల ద్వారా భారత్‌ అంతర్జాతీయ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు మధ్య ఆసియాలో కొత్త అవకాశాలు కనిపించడం వల్ల భారత రక్షణ ఉత్పత్తులకు మరిన్ని మార్కెట్లు తెరుచుకునే అవకాశం ఉంది.

రూ.686 కోట్ల నుంచి రూ.38,424 కోట్లకు.. ఇదీ రక్షణ ఎగుమతుల ప్రయాణం!

భారత్‌ రక్షణ రంగంలో వస్తున్న మార్పును అర్థం చేసుకోవాలంటే ఈ లెక్కలు చూడాలి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ ఎగుమతుల విలువ కేవలం రూ.686 కోట్లు. 2025-26 నాటికి ఆ విలువ రూ.38,424 కోట్లకు చేరింది. అంటే పన్నెండేళ్లలో ఎగుమతులు 56 రెట్లకు పైగా పెరిగాయి. భారత రక్షణ ఉత్పత్తులు ఇప్పుడు 80కి పైగా దేశాలకు చేరుతున్నాయి. ఈ వివరాలను రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇదే సమయంలో దేశీయ రక్షణ ఉత్పత్తి విలువ కూడా 2014-15లో రూ.46,429 కోట్ల నుంచి 2025-26లో రూ.1.78 లక్షల కోట్లకు పెరిగింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఉంది. భారత్‌ ఇప్పుడు విడిభాగాలు, చిన్న పరికరాలు మాత్రమే కాకుండా.. పూర్తిస్థాయి ఆయుధ వ్యవస్థలను కూడా ఎగుమతి చేసే దిశగా అడుగులు వేస్తోంది.

2029 నాటికి రక్షణ ఉత్పత్తి విలువను రూ.3 లక్షల కోట్లకు, రక్షణ ఎగుమతులను రూ.50,000 కోట్లకు తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే ఉత్పత్తి పెంచడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో దీర్ఘకాలిక సంబంధాలు నిర్మించుకోవాల్సి ఉంటుంది.

బ్రహ్మోస్‌ నుంచి తేజస్‌ వరకు..

ఆకాశ్‌ ఒక్కటే కాదు.. భారత రక్షణ రంగంలో అంతర్జాతీయ మార్కెట్‌కు ఉపయోగపడే అనేక ఉత్పత్తులు ఉన్నాయి. బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి ఇప్పటికే భారత రక్షణ ఎగుమతుల్లో కీలకమైన పేరుగా నిలుస్తోంది. ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్‌ క్షిపణుల సరఫరా భారత రక్షణ ఎగుమతుల సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆకాశ్‌తో పాటు అస్త్ర గగనతల క్షిపణి, రాడార్లు, ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ పరికరాలు, డ్రోన్లను ఎదుర్కొనే వ్యవస్థలు, ఫిరంగి వ్యవస్థలు కూడా అవకాశాలున్న రంగాలు.

తేజస్‌ యుద్ధ విమానాలు, భారతదేశంలో తయారవుతున్న నౌకాదళ ప్లాట్‌ఫామ్‌లకు కూడా భవిష్యత్తులో అంతర్జాతీయ మార్కెట్‌లో అవకాశాలు ఉండవచ్చు. అయితే వీటి ఎగుమతులు పెరగాలంటే సాంకేతిక సామర్థ్యం మాత్రమే సరిపోదు. ఉత్పత్తి స్థిరత్వం, నిర్వహణ, విడిభాగాల సరఫరా, కొనుగోలుదారులకు దీర్ఘకాలిక మద్దతు కూడా అవసరం.

ముఖ్యంగా యుద్ధనౌకల విషయంలో భారత్‌ తన సామర్థ్యాన్ని మరింత విస్తృతంగా మార్కెట్‌ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కార్వెట్లు, ఫ్రిగేట్లు, డిస్ట్రాయర్లు వంటి ఆధునిక నౌకలను నిర్మించగల సామర్థ్యం ఉన్నప్పటికీ.. వాటిని అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీపడే స్థాయిలో అందించడానికి ధర, డెలివరీ సమయం కీలకం.

ఆయుధాలు తయారు చేయడం ఒక ఎత్తు.. అమ్మడం మరో ఎత్తు!

ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒక సంస్థ అత్యాధునిక క్షిపణిని తయారు చేసిందనుకుందాం. వేరే దేశం దానిపై ఆసక్తి చూపించింది. చర్చలు జరిగాయి. పరీక్షలు పూర్తయ్యాయి. చివరకు ఆర్డర్‌ కూడా వచ్చింది. కానీ ఆ ఆర్డర్‌ను అమలు చేయడానికి అవసరమైన డబ్బు సకాలంలో అందకపోతే ఏం జరుగుతుంది? ప్రొడక్షన్ ఆలస్యమవుతుంది. సప్లై షెడ్యూల్‌ దెబ్బతింటుంది. అంతర్జాతీయ కొనుగోలుదారుడి నమ్మకం తగ్గే ప్రమాదం ఉంటుంది.

రక్షణ రంగంలో ఒక ఆర్డర్‌ రావడానికి సంవత్సరాల సమయం పట్టవచ్చు. ఉత్పత్తిని కొనుగోలు చేసే దేశం ప్రత్యేక మార్పులు కోరవచ్చు. సాంకేతిక పరీక్షలు, క్షేత్రస్థాయి ప్రయోగాలు, ధ్రువీకరణ, భద్రతా అనుమతులు, ఫైనల్ అగ్రిమెంట్ ప్రాసెస్ పూర్తయ్యే వరకు భారీ ఖర్చులు కొనసాగుతుంటాయి.

సాధారణ వ్యాపారంలో వస్తువును తయారు చేసి అమ్మిన వెంటనే ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రక్షణ రంగంలో పెట్టుబడి పెట్టినప్పటి నుంచి ఫైనల్ పేమెంట్ వచ్చే వరకు చాలా కాలం పట్టొచ్చు.

ఈ పరిస్థితి పెద్ద సంస్థలతో పాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మరింత కష్టంగా మారుతుంది. ఎందుకంటే క్షిపణి లేదా రాడార్‌ తయారీలో ప్రధాన సంస్థలతో పాటు వందలాది సరఫరాదారులు, విడిభాగాల తయారీదారులు, సాంకేతిక సంస్థలు పనిచేస్తుంటాయి. వీళ్లకు సకాలంలో నిధులు అందకపోతే మొత్తం ఉత్పత్తి వ్యవస్థపైనే ప్రభావం పడుతుంది.

అగ్రిమెంట్ ఉంది.. కానీ ఫైనాన్స్‌ ఎక్కడ?

భారత రక్షణ ఎగుమతులకు సంబంధించి పరిశ్రమలు ప్రస్తావిస్తున్న కీలక సమస్యల్లో ఒకటి ఎక్స్ పోర్ట్ ఫైనాన్సింగ్‌. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక ఆయుధ వ్యవస్థను అమ్మాలంటే.. నాణ్యతతో పాటు కొనుగోలుదారుడికి ఆర్థికపరమైన సౌలభ్యం కల్పించడం కూడా పోటీలో కీలకంగా మారుతుంది. కొన్ని దేశాలు ఆయుధాలను కొనుగోలు చేసేటప్పుడు రుణ సదుపాయాలు, చెల్లింపు గడువులు, ప్రభుత్వ మద్దతుతో ఆర్థిక ఏర్పాట్లను కూడా పరిశీలిస్తాయి.

భారత ఎగుమతిదారులకు ఎక్స్ పోర్ట్ అగ్రిమెంట్ వచ్చిన తర్వాత కూడా నిధులు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే విదేశీ ఆర్డర్‌ సాధించిన సంస్థలు మళ్లీ అదనపు పత్రాలు, టెండర్ల ప్రక్రియలను ఎదుర్కోవాల్సి వస్తే అమలు ఆలస్యం కావచ్చన్నది వారి వాదన.

ఎక్స్ పోర్ట్.. ఇంపోర్ట్ బ్యాంకు ద్వారా అందించే రుణ సదుపాయాలు, ప్రభుత్వ హామీలు, ఇన్సూరెన్స్ వంటి వ్యవస్థలను మరింత సమర్థంగా ఉపయోగించుకోవాలనే డిమాండ్‌ అందుకే వస్తోంది.

అయితే ఇక్కడ ఆర్థిక క్రమశిక్షణను పక్కన పెట్టడం పరిష్కారం కాదు. ఒప్పందం నిజమైనదా? కొనుగోలుదారుడి విశ్వసనీయత ఎంత? చెల్లింపుల ప్రమాదం ఉందా? ఉత్పత్తి సరఫరా సాధ్యమా? వంటి అంశాలను పరిశీలిస్తూనే, అర్హత ఉన్న సంస్థలకు సకాలంలో నిధులు అందేలా పరిస్థితులను మెరుగుపరచాల్సి ఉంటుంది.

భారత్‌ ఆయుధ ఎగుమతుల తదుపరి లక్ష్యం ఏంటి?

భారత్‌ రక్షణ రంగం ముందున్న అసలు పరీక్ష కేవలం ఎక్కువ ఆయుధాలను తయారు చేయడం కాదు. వాటిని ప్రపంచ మార్కెట్‌లో పోటీపడే ధరకు, నిర్ణీత సమయంలో, నాణ్యతతో అందించగలగడం.

దీనికోసం ప్రత్యేక రక్షణ ఎగుమతి ఫైనాన్సింగ్‌ విధానం, ఒప్పందాలకు అనుసంధానించిన వర్కింగ్‌ క్యాపిటల్‌, వేగవంతమైన అనుమతులు, బీమా, చిన్న పరిశ్రమలకు రుణ సదుపాయాలు అవసరమని పరిశ్రమ వర్గాలు సూచిస్తున్నాయి. రక్షణ మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఎగ్జిమ్ బ్యాంకు మధ్య సమన్వయం కూడా కీలకం.

ఆకాశ్‌ క్షిపణి వ్యవస్థకు కొత్త అంతర్జాతీయ మార్కెట్లు తెరుచుకోవడం భారత్‌కు ఒక అవకాశాన్ని చూపిస్తోంది. కానీ ఆ అవకాశాన్ని దీర్ఘకాలిక విజయంగా మార్చాలంటే పరిశోధన, ఆధునికీకరణ, భారీ ఉత్పత్తి, ఆర్థిక సహకారం అన్నీ ఒకేసారి ముందుకు సాగాలి.

#Akash Missile#India Defence Exports#Indian Defence Industry#Akash Air Defence System#Indian Missiles#Defence News India#Made in India Weapons#Indian Army#DRDO#BrahMos Missile#Tejas Fighter Jet#India Arms Exports#Global Arms Market#Indian Military Technology#Defence Manufacturing India#India Military News#Akash Missile Export#Indian Defence News#Atmanirbhar Bharat#India Defence Production
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి