అధికార కాంగ్రెస్ పార్టీలో మరోసారి నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనే స్థాయిలో సీనియర్, జూనియర్ లీడర్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. విషయం బయటకు రాకుండా సీనియర్లు జాగ్రత్త పడితే జూనియర్లు మాత్రం చేయని తప్పుకు తామేందుకు శిక్ష అనుభవించాలని అసలు విషయాన్ని బయట పెట్టినట్టు తెలిసింది. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చి మూడేండ్లు పూర్తయింది. అయినప్పటికీ నేతల మధ్య వివాదాలు మాత్రం సద్దుమణగడం లేదు. పదవులు, హోదాల కోసం, పార్టీలో పైచేయి సాధించేందుకు కొందరు జూనియర్లు ప్రయత్నిస్తుంటే సీనియర్లు అడ్డుపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
సీఎం, పీసీసీ చీఫ్ చెప్పిన మారని తీరు..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని.. అందుకు సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా కలిసి పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఇప్పటికే పలుమార్లు నేతలకు దిశానిర్దేశం చేశారు. అయినప్పటికీ వారిలో ఏ మాత్రం కనిపించడం లేదని చర్చ జరుగుతోంది. కొందరు ఎమ్మెల్యేలు మంత్రి పదవి రాలేదని, నిధులు ఇవ్వడం లేదని ఏకంగా అధిష్టానాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్కు ప్లస్ అయ్యేలా వారి స్టేట్మెంట్స్ ఉంటున్నాయి. ఇటీవల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులిస్తారా? లేక చావామంటారా? అని ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక నిన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తానని సీఎం రేవంత్ మోసం చేశారని..ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధులన్నీ తన నియోజకవర్గానికి తీసుకుని పోతున్నారని.. ఆయన కేవలం తన నియోజకవర్గానికే మంత్రి కాదని.. రాష్ట్రం మొత్తానికి అని గుర్తుంచుకోవాలని బహిరంగంగా విమర్శించారు.
శ్రీధర్ బాబు వర్సెస్ ఎంపీ గడ్డం వంశీ..
ఇక తొలిసారి ఎంపీగా గెలిచిన గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ శ్రీధర్ బాబు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు సమాచారం. మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గం మంథని.. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోకి రావడంతో స్థానికంగా వివిధ లావాదేవీల విషయంలో ఎంపీ, మంత్రికి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎంపీ వంశీ.. మంత్రి శ్రీధర్ బాబుకు ఓ లేఖ రాసినట్టు తెలిసింది. అందులో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సహకారం ముసుగులో సొంత పార్టీ నేతలపై ఎంపీ సంధించిన ఈ వ్యంగ్యాస్త్రాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
నవంబర్ 2న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు పెద్దపల్లి ఎంపీ ఒక అధికారిక లేఖ రాశారు. నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలనే లక్ష్యంతో నిర్వహించిన కీలక సభకు మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ హాజరుకాలేదని ఆయన అందులో ఎత్తిచూపారు. ఇంతటి ముఖ్యమైన సభను పక్కనపెట్టి, మంథనిలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ నిర్వహించిన ప్రైవేట్ ఆధ్యాత్మిక కార్యక్రమానికి రూ.3 కోట్లకుపైగా ఖర్చుతో వారు హాజరయ్యారని ఎంపీ ఆరోపించారు.

ఇటీవల కొయ్యూరులో కాకా (వెంకటస్వామి చారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేసిన కార్యక్రమంలో పాల్గొన్నందుకు, ఒక గిరిజన మహిళా ప్రజాప్రతినిధితో సహా కాంగ్రెస్ కార్యకర్తలను కనీస షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేయడాన్ని ఎంపీ తీవ్రంగా తప్పుబట్టారు. సొంత పార్టీ ఎంపీతో కలిసి పేదలకు సాయం చేయడం క్రమశిక్షణా రాహిత్యం ఎలా అవుతుందని, రాహుల్ గాంధీ సభకు డుమ్మా కొట్టడం అంతకంటే పెద్ద తప్పు ఎందుకు కాదో ఆలోచించాలని మంత్రి శ్రీధర్ బాబును ఎంపీ నిలదీశారు.
సహజ న్యాయ సూత్రాలకు కట్టుబడి ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్, విజయరమణారావులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వారిని సస్పెన్షన్ నుంచి మినహాయించాలని వ్యంగ్యంగా కోరుతూనే.. పార్టీలో మంత్రి నుంచి గిరిజన వార్డు సభ్యురాలి వరకు అందరికీ ఒకే న్యాయం, ఒకే నియమం వర్తించాలని వంశీకృష్ణ స్పష్టం చేశారు. పెద్దపల్లి ఎంపీకి తన పార్లెమెంటు పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలు సహకారం అందించడం లేదని ఈ సందర్బంగా బయటపెట్టారు.
ఎమ్మెల్యేను బూతులు తిట్టిన మంత్రి!
ఇదిలాఉండగా, డీసీసీ నియామకాలపై సీనియర్ మంత్రి, జూనియర్ ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం నెలకొన్నట్టు సమాచారం.ఢిల్లీలోని ప్రఖ్యాత శాంగ్రిలా హోటల్లో మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. డీసీసీ (జిల్లా కాంగ్రెస్ కమిటీ) పదవుల నియామకాల విషయంలో ఇరువురి మధ్య తలెత్తిన భేదాభిప్రాయాలే ఈ ఘర్షణకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
హోటల్ లాబీలో మంత్రి దామోదర రాజనర్సింహ సహనం కోల్పోయి "నిన్ను గదిలో వేసి కొడతా.. అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు?" అంటూ ఎమ్మెల్యేపై తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడినట్లు సమాచారం. ఇరువురు నేతలు వ్యక్తిగత దూషణలకు దిగి ఒకరిపై ఒకరు భౌతికంగా దాడి చేసుకునేంత వరకు పరిస్థితి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ టైంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో పాటు ఓ దినపత్రికకు చెందిన ఓ సీనియర్ జర్నలిస్ట్ కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నట్లు తెలిసింది.
తోటి ఎమ్మెల్యేల ముందే మంత్రి తనను అసభ్య పదజాలంతో దూషించి, తీవ్రంగా అవమానించారని ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఇప్పటికే పీసీసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ అవమానంపై త్వరలోనే ఢిల్లీలోని పార్టీ అధిష్ఠానానికి సైతం అధికారికంగా ఫిర్యాదు చేసే యోచనలో ఆయన ఉన్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.రాష్ట్రంలో తీవ్రమైన కరువు, కరెంటు సమస్యలు ఉండగా వాటి మీద ఫోకస్ పెట్టాల్సిన ప్రజాప్రతినిధులు ఇలా గొడవ పడటంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ గొడవలకు పార్టీ అధిష్టానం త్వరగా పరిష్కారం చూపించాలని పార్టీ నేతలు కోరుతున్నారు.


