ఏపీలో జరిగిన స్థానిక ఎన్నికల్లో కూటమి సర్కార్ హవా కొనసాగుతోంది. మొత్తం 13 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను అధికారులు లెక్కించారు. అయితే, మొత్తం పదమూడింటిలో 8 కార్పొరేషన్లలో కూటమి అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. విశాఖ, విజయనగరం, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, కడప కార్పొరేషన్లలో కూటమి క్యాండిడేట్స్ ముందంజలో ఉండగా.. 6 స్థానాల్లో టీడీపీ, 2 స్థానాల్లో జనసేన ఆధిక్యంలో ఉన్నాయి.
మరో రెండు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు పుంగనూరు మున్సిపాలిటీలో టీడీపీ జయకేతనం ఎగురవేసింది.మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించగా.. జనసేన 2, బీజేపీ 2 స్థానాల్లో, సీపీఐ 1, ఇతరులు ఒక చోట విజయం సాధించారు. మొత్తం 36 వార్డుల్లో 32 ఏకగ్రీవం అవ్వగా.. 4 వార్డులకు పోలింగ్ జరిగింది. కాగా, పోలింగ్ జరిగిన స్థానాల్లోనూ టీడీపీ నేతలు ఆధిక్యంలో ఉన్నట్టు సమాచారం.
ఇదిలాఉండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత అసెంబ్లీ నియోజకవర్గం కుప్పంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కుప్పం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుంచి తమను బలవంతంగా బయటకు పంపారని వైసీపీ అభ్యర్థుల ఆందోళనకు దిగారు.1, 3, 7, 8 కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు వచ్చిన వైసీపీ శ్రేణులు నిరసనకు దిగారు. తాము మెజారిటీతో లీడింగ్‌లో ఉన్నా బయటకు పంపించారని 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మనోహర్, వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం సొంత నియోజకవర్గంలో టీడీపీ ఇలా దౌర్జన్యంగా గెలవాలని అనుకోవడం బాధాకరమని, ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? అని వైసీపీ నేతలు నిలదీశారు. కాగా, టీడీపీ నేతలు మాత్రం మరో విధింగా చెబుతున్నారు. ఓటమి భయంతోనే కౌంటింగ్ కేంద్రం వద్ద గందరగోళం నిర్వహించాలని వైసీపీ నేతలు ముందస్తు ప్లాన్ చేశారని ఆరోపిస్తున్నారు. పోలీసులు రంగం ప్రవేశం చేసి నిరసన తెలుపుతున్న వైసీపీ శ్రేణులను అక్కడి నుంచి చెదరగొట్టారు.


