విద్యార్థి కార్యకర్త నేహా బోరా ఇటీవల చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘బ్రాహ్మణీయ వ్యవస్థ’ నుంచి మహిళలకు రక్షణ కల్పించాలని, ఆలయాల్లో పూజారులు లైంగికదాడులకు పాల్పడుతున్నారంటూ నేహా బోరా చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ(BJP) తమకు అనుకూలంగా మార్చుకుని రాజకీయం చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నేహా బోరా వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ చేసిన విమర్శలు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. హిందూ మతాన్ని అపనిందలు వేసేలా ఆమె మాట్లాడారని, కాంగ్రెస్ పార్టీ ‘హిందూ వ్యతిరేక విమర్శలను’ ఈ వ్యాఖ్యలు ప్రతిధ్వనిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనా విధానం నుంచే ప్రేరణ పొందాయని భండారీ విమర్శించారు.
గతంలో రాహుల్ గాంధీ సైతం దేవాలయాలకు వెళ్లేవారే నేరాలకు పాల్పడుతున్నారనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారని ఆయన గుర్తుచేశారు. అంతేకాకుండా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)పై రాహుల్ గాంధీ చేసిన విమర్శలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. గూఢచారి వ్యవస్థలు, అంతర్గత భద్రతా అంశాలపై కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలు ఆ పార్టీ యొక్క హిందూ వ్యతిరేక వైఖరిని బట్టబయలు చేస్తున్నాయని మండిపడ్డారు.
‘హిందూ ఉగ్రవాదం వంటి పదజాలం ఉపయోగించింది కాంగ్రెస్ పార్టీనే’ అని విమర్శించిన ప్రదీప్ భండారీ.. నేహా బోరా బంగ్లాదేశ్‌లోని ఇస్లామిస్టుల నుంచి ప్రేరణ పొందారని ఆరోపించారు. సనాతన ధర్మాన్ని లక్ష్యంగా చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న సైద్ధాంతిక ప్రచారం దేశ ఐక్యతకు, సమగ్రతకు పూర్తిగా విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏనే హిందూ వ్యతిరేక, సనాతన వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలతో కూడుకున్నదని ప్రదీప్ భండారీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ వివాదం ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కేంద్ర బిందువుగా మారింది. ఒకవైపు భావప్రకటన స్వేచ్ఛ, మహిళా భద్రతపై చర్చ జరగాల్సిన తరుణంలో, ఈ అంశం రాజకీయ రంగు పులుముకోవడం దేశంలో పెరుగుతున్న సైద్ధాంతిక ధ్రువీకరణకు అద్దం పడుతోంది. రాబోయే ఎన్నికలు, రాజకీయ సమీకరణాల దృష్ట్యా, ఇలాంటి సున్నితమైన అంశాలను ప్రధాన పార్టీలు ఏ విధంగా తమ రాజకీయ అస్త్రాలుగా మలుచుకుంటున్నాయో ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.


