రాష్ట్రంలోని కొత్త ఓటర్లకు బిగ్ షాక్ తగిలింది. కొత్తగా ఓటు కోసం నమోదు చేసుకున్న వారిలో చాలా వరకు దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్టు తెలుస్తోంది. తెలంగాణలో 2.55 లక్షల మంది కొత్త ఓటర్ల దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 10.92 లక్షల ఫామ్-6 దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 7,16,436 దరఖాస్తులకు ఆమోదం లభించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఏకంగా 2,55,421 దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్టు తెలుస్తోంది.
మరో 1,20,963 దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నట్టు సమాచారం. దరఖాస్తు చేసుకున్న ప్రతి పది మందిలో దాదాపు నలుగురికి ఓటు హక్కు ఇంకా ఖరారు కాని పరిస్థితి నెలకొంది. యువతలో ఓటు వేసేందుకు ఆసక్తి పెరుగుతున్నా రాష్ట్ర ఎన్నికల సంఘం దరఖాస్తులను తిరస్కరించడంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఏ కారణాలతో దరఖాస్తులు తిరస్కరించారంటూ యువ ఓటర్ల ప్రశ్నిస్తున్నారు. పత్రాల్లో లోపాలు, అర్హత లేకపోవడం, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదు వంటి కారణాలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే, తమ దరఖాస్తులు తిరస్కరణకు గురవ్వడానికి గల కారణాలు వెల్లడించాలని యువ ఓటర్లు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.అర్హులైన వారికి అప్పీల్ చేసుకోవడానికి, సవరణకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. నవంబర్ 30న తుది ఓటరు జాబితా ప్రచురణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధం అయినట్టు తెలుస్తోంది. దీంతో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం అధికారులపై ఎన్నికల కమిషన్ ఒత్తిడి పెంచుతున్నట్టు సమాచారం.
అయితే, రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ సైతం ఇంకా కొనసాగుతోంది. ఓటు డిలీట్ అయిన వారికి మరోసారి నమోదుకు చాన్స్ ఇస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు, అడ్రస్ పర్మినెంట్ మారిన వారి ఓట్లు తొలగించినట్టు ఎన్నికల సంఘం చెబుతోంది. అయితే, కావాలనే తమకు అనుకూలంగా ఉన్న వారి ఓట్లు తొలగిస్తున్నారని రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. కాగా,18 సంవత్సరాలు నిండిన యువ ఓటర్లు ఓటర్ ఐడీ కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో వివరాలు సరిగా ఇవ్వాలని, డబుల్ ఎంట్రీ కాకుండా చూసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.


