అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాసమస్యలపై ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా కావాలనే టాపిక్ డైవర్ట్ చేసి తమను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 22 ఏ, ఫీజు రీయింబర్స్ మెంట్, జీవో 97 (పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థుల అంశం).. రైతు సమస్యలు, సాగు నీరు, కృష్ణా గోదావరి అంశాలపై ఎటువంటి చర్చ జరగకూడదనే రేవంత్ సర్కార్ రాష్ట్రంలో గందరగోళం సృష్టించిందని ఆరోపించారు. కావాలనే పోలీసులతో తమను సభలోకి రాకుండా చేయడం, కాంగ్రెస్ నేతలను ఎర్రవల్లికి పంపించి ప్రజల అటెన్షన్ మొత్తం డైవర్ట్ చేయించారని అన్నారు.
దీనికి తోడు AI సాయంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫొటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని ఆరోపించారు.రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చావును కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారని, కేసీఆర్ చావు కోరుకున్న ఎమ్మెల్యేలను సభలో పెట్టుకున్నారని చెప్పారు. కేసీఆర్ చావు కోరుకున్న ఎమ్మెల్యేను సస్పెండ్ చేయలేదు కానీ, సభలో లేని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ను సస్పెండ్ చేయడం ఏంటని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ అనంతరం అసెంబ్లీ నుంచి బయటకు వచ్చాక మీడియాతో మాజీ మంత్రి తలసాని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రులు సభలో ప్లకార్డ్స్ ప్రదర్శిస్తున్నారని, మరి మమ్మల్ని ఎందుకు పట్టుకుని రాకుండా అడ్డుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో చర్చించాల్సిన అనేక అంశాలు ఉన్నాయని కానీ, శాసనసభను అభాసుపాలు చేస్తున్నారని మండిపడ్డారు.
మొదటి రోజు అసెంబ్లీ గేటు బయట కావాలనే గొడవపెట్టించారని, రెండో రోజూ కేసీఆర్ నివాసం వద్ద చావుడప్పు పేరిట కాంగ్రెస్ దళిత నేతల ద్వారా డ్రామా నడిపించారని విమర్శించారు. ఫలితంగా 22 A అంశం, జీవో 97 చర్చకు రాకుండా డైవర్ట్ చేశారని.. అవి చర్చకు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం పరువు ఎక్కడ పోతుందోనని ఈ కుట్రకు తెరలేపారన్నారు. స్పీకర్ అంటే బీఆర్ఎస్ పార్టీకి గౌరవం ఉందని, కానీ దళిత స్పీకర్ అంటూ కాంగ్రెస్ పార్టీనే ఆయనను అవమానిస్తోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు.











