ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక ఘర్షణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై అమెరికా యుద్ధాన్ని ప్రారంభించలేదని స్పష్టం చేశారు. 1979 నుంచే తమ దేశంపై ఇరాన్ అప్రకటిత యుద్ధం చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. వర్జీనియాలోని ఆర్లింగ్టన్ జాతీయ శ్మశానవాటికలో బుధవారం నిర్వహించిన 2026 జాతీయ సైనికుల దినోత్సవ (Veterans Day) కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్, సైనికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సమస్యను దశాబ్దాల క్రితమే పరిష్కరించాల్సి ఉండాల్సిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరాన్ దుందుడుకు చర్యలకు గట్టిగా బదులిచ్చామని పేర్కొన్నారు. ఈ సైనిక పోరాటంలో అమెరికా ఇప్పటికే 93 శాతం విజయాన్ని సాధించిందని, అయితే తమకు పాక్షిక విజయం కాకుండా 100 శాతం సంపూర్ణ విజయం (Total Victory) కావాలని ట్రంప్ తేల్చిచెప్పారు.
అమెరికా సైన్యం అత్యంత ధైర్యసాహసాలతో పోరాడి ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన కీలక స్థావరాలపై అధునాతన బీ-2 (B-2) బాంబర్లతో దాడులు నిర్వహించి వాటిని పూర్తిగా నేలమట్టం చేసిందని వెల్లడించారు. తద్వారా ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకోకుండా విజయవంతంగా అడ్డుకున్నామని, అమెరికా ధ్వంసం చేసిన మౌలిక సదుపాయాలను తిరిగి నిర్మించుకోవడానికి ఇరాన్‌కు కనీసం 25ఏళ్ల సమయం పడుతుందని వ్యాఖ్యానించారు.
ఇకపై ఆ దేశంలో మరింత విధ్వంసం సృష్టించాల్సిన అవసరం రాకూడదని ఆశిస్తున్నట్లు తెలిపిన ట్రంప్, ఈ యుద్ధంలో అమెరికా కూడా ప్రాణనష్టాన్ని చవిచూసిందని అంగీకరించారు. ఇరాన్‌తో సాగిన ఈ సుదీర్ఘ పోరాటంలో 18 మంది వీర అమెరికన్ సైనికులను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదని, అమెరికా సార్వభౌమాధికారానికి ముప్పు కలిగించే ఏ శక్తినీ ఉపేక్షించేది లేదని ఆయన పునరుద్ఘాటించారు.


