సోనియా ఆత్మకథపై పొలిటికల్ ఫైట్
తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర పరిణామాలు
సోనియా పుస్తకంలో తెలంగాణ ప్రస్తావనే లేదా..?
బీఆర్ఎస్ నేతల విమర్శలు
కొందరు నాయకుల జీవితాల్లో కొన్ని నిర్ణయాలు వ్యక్తిగతమైనవి. మరికొన్ని నిర్ణయాలు చరిత్రను మార్చేస్తాయి. సోనియా గాంధీ రాజకీయ జీవితంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అలాంటి కీలక ఘట్టం. కానీ ఇప్పుడు ఆమె రాసిన ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన లేదన్న అంశం కొత్త రాజకీయ చర్చకు తెరలేపింది.
సోనియా గాంధీ రచించిన Belonging: A Journey of Love పుస్తకం నవంబర్ 10న విడుదలైంది. 544 పేజీల ఈ పుస్తకంలో ఇటలీలో బాల్యం, రాజీవ్ గాంధీతో పరిచయం, వివాహం, గాంధీ కుటుంబంలోకి అడుగుపెట్టిన తర్వాత ఎదురైన అనుభవాలు, వ్యక్తిగత విషాదాలు, రాజకీయ జీవితంలోని కీలక మలుపుల గురించి ఆమె వివరించారు.
ఇది రాజకీయ గ్రంథం కాదని, తన కుటుంబం, వ్యక్తిగత జీవితం గురించి రాసిన పుస్తకమని సోనియా ముందే చెప్పారు. అయితే పుస్తకం మార్కెట్‌లోకి వచ్చిన వెంటనే రాజకీయ చర్చ మొదలైంది. ముఖ్యంగా తెలంగాణ ప్రస్తావన లేదన్న అంశం ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ ఉద్యమం మరిచిపోయారా?
సోనియా ఆత్మకథలో తెలంగాణ ఉద్యమం గురించి కనీసం ఒక్క ప్రస్తావన కూడా లేదని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో సోనియా గాంధీ కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తుచేశారు. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, యూపీఏ ఛైర్‌పర్సన్‌గా ప్రజల ఆకాంక్షలను గుర్తించి రాష్ట్ర ఏర్పాటు దిశగా రాజకీయ నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు.
ఏళ్ల తరబడి సాగిన ఉద్యమం, నిరసనలు, సమ్మెలు, విద్యార్థులు, ఉద్యమకారుల త్యాగాలు తెలంగాణ చరిత్రలో విడదీయలేని భాగమని వినోద్ కుమార్ అన్నారు. ఉద్యమంలో 1,200 మందికి పైగా విద్యార్థులు, కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని ఆయన ప్రస్తావించారు. అలాంటి చారిత్రక ఉద్యమం తన పాత్రతో ముడిపడి ఉన్నప్పటికీ, ఆత్మకథలో తెలంగాణ అనే పదమే లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ప్రస్తావన లేకపోవడానికి కారణాలు సోనియాకే తెలియాలని వ్యాఖ్యానించారు.
ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక నిర్ణయం తీసుకున్న నాయకురాలి వ్యక్తిగత జ్ఞాపకాల్లో ఆ ఘట్టానికి చోటు ఎందుకు దక్కలేదు? ఇది ఉద్దేశపూర్వకంగా వదిలేశారా? లేక పుస్తకాన్ని వ్యక్తిగత జీవితానికే పరిమితం చేయాలన్న నిర్ణయంలో భాగమా? ఇదే నిజమైతే.. జాతీయ స్థాయిలో చోటు చేసుకున్న ఎమర్జెన్సీ, ఆపరేషన్ బ్లూ స్టార్, తాను ప్రధాని పదవిని తిరస్కరించడం లాంటి అంశాలను ఎందుకు ప్రస్తావించారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ విమర్శలపై స్పందిల్సింది కాంగ్రెస్ నాయకులే.
ఆంధ్రప్రదేశ్‌లో షర్మిలకు ప్రత్యేక గౌరవం
తెలంగాణలో ఈ ప్రశ్నలు వినిపిస్తుంటే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఈ పుస్తకం మరో కారణంతో వార్తల్లో నిలిచింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు సోనియా గాంధీ స్వయంగా సంతకం చేసిన పుస్తక ప్రతిని పంపించారు. తొలి ఆటోగ్రాఫ్ కాపీల్లో ఒకటి అందుకోవడం తనకు ఎంతో గౌరవంగా, ఆనందంగా ఉందని షర్మిల పేర్కొన్నారు.
ఇది కేవలం ఒక పుస్తకం అందుకోవడం మాత్రమే కాదని, తనకు స్ఫూర్తినిచ్చిన నాయకురాలి జీవిత ప్రయాణాన్ని మరింత దగ్గరగా తెలుసుకునే అవకాశం అని ఆమె అభిప్రాయపడ్డారు. సోనియా జీవితంలోని అనుభవాలు, భావాలు, నిర్ణయాలను చదవాలని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
పుస్తకం నుంచి సినిమా వరకు.. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ప్రయత్నం
ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా తెలుగులో సినిమా నిర్మిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి ప్రకటించారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన, ఈ సినిమాకు సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే నిర్మాతలుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్టు కోసం నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్ జులకంటి ఆంజనేయులు రెండు కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు.
సినిమా నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు 50 మందితో కమిటీ ఏర్పాటు చేయాలని జగ్గారెడ్డి ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సమక్షంలో షూటింగ్ ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
సోనియా కుటుంబ జీవితం, రాజీవ్ గాంధీతో వివాహం, ఇందిరా గాంధీ కుటుంబంలోకి అడుగుపెట్టిన తర్వాత ఎదురైన అనుభవాలు, రాజకీయ ప్రయాణం వంటి అంశాలను సినిమాలో చూపించాలన్నది ఆయన ఆలోచన.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. ఒకవైపు తెలంగాణ ఉద్యమం సోనియా ఆత్మకథలో లేదని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. మరోవైపు అదే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు సోనియా జీవితాన్ని సినిమా రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పుస్తకంపై రాజకీయ చర్చకు ఇది మరో కొత్త కోణాన్ని జోడిస్తోంది.
తెలంగాణకు సోనియా పాత్ర.. రాజకీయంగా ఇప్పటికీ కీలకమే!
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఒకే ఒక్క నాయకుడి నిర్ణయంతో జరిగిన పరిణామం కాదు. దశాబ్దాల ఉద్యమం, విద్యార్థుల పోరాటం, ప్రజా సంఘాల కృషి, వివిధ రాజకీయ పార్టీల ఒత్తిడి, చివరకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు కలిసి రాష్ట్ర ఆవిర్భావానికి దారితీశాయి.
2009 డిసెంబర్ 9న అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, కేంద్ర మంత్రుల బృందం పరిశీలన, పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం.. చివరకు 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది.
ఈ మొత్తం ప్రక్రియలో అప్పటి టీఆర్ఎస్ పోరాటం, కేసీఆర్ వ్యూహాలు, కాంగ్రెస్ అధిష్ఠానం, సోనియా గాంధీ పాత్ర రాజకీయ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయాయి. అందుకే ఆమె ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన లేదన్న విమర్శ ప్రాధాన్యం సంతరించుకుంది. ఐతే ఇంతటి ప్రాధాన్యం కలిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఒక్క సందర్భంలోనైనా సోనియా ప్రస్తావించాల్సిందని చాలా మంది తెలంగాణ వాదులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి సోనియా ఆత్మకథపై ఢిల్లీ నుంచి తెలంగాణ దాకా.. రకరకాల స్పందనలు వస్తున్నాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా మాటల యుద్ధం సాగుతుంటే.. తెలంగాణలో బీఆర్ఎస్ విమర్శల డోస్ పెంచుతోంది.


