తెలంగాణ పోలీస్ శాఖ శాంతిభద్రతల పరిరక్షణ, పౌర సేవలందించడంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుడుతోంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా పూర్తిస్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆధారిత పోలీస్ స్టేషన్‌ను హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఏర్పాటు చేసేందుకు విస్తృత సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు.
డిసెంబర్ మొదటి వారంలో ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాజెక్టు) ఈ అధునాతన సేవలను ప్రారంభించేందుకు ఉన్నతాధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు సన్నాహాలను స్వయంగా పరిశీలించేందుకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏఐ సాంకేతికత సహాయంతో అందుబాటులోకి రానున్న నూతన పౌర సేవల పనితీరును అడిగి తెలుసుకోవడంతో పాటు, స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను ఆలకించారు.
క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సాంకేతిక సవాళ్లను అధిగమించి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని సిబ్బందికి కీలక సూచనలు చేశారు. నూతన విధానంలో భాగంగా పోలీస్ స్టేషన్‌లో జరిగే దాదాపు అన్ని కీలక కార్యకలాపాలకు ఏఐ సాంకేతికతను సమగ్రంగా అనుసంధానించనున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణతో మొదలై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు, కేసు డైరీ నిర్వహణ, దర్యాప్తు నివేదికలు, కోర్టుకు సమర్పించే ఛార్జ్‌షీట్ తయారీ వరకు ప్రతి దశలోనూ ఏఐ సేవలను వినియోగించనున్నారు.
అంతేకాకుండా దాదాపు 10 విభిన్న భాషల్లో ఫిర్యాదులు స్వీకరించేలా ప్రత్యేకంగా 'సేతు' (Setu) యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. ఇతర భాషల్లో వచ్చే ఫిర్యాదులను ఏఐ ద్వారా క్షణాల్లో స్థానిక భాషలోకి అనువదించి, సంబంధిత అధికారులకు పంపించే సదుపాయం కల్పించనున్నారు. ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించేందుకు గాను పోలీస్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు.
పంజాగుట్టలో ప్రారంభం కానున్న ఈ పైలట్ ప్రాజెక్టు పనితీరు, ఫలితాలను క్షుణ్ణంగా సమీక్షించిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలోనూ ఈ ఏఐ విధానాన్ని దశలవారీగా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ వినూత్న ప్రయోగం విజయవంతమైతే పోలీస్ వ్యవస్థలో వేగం, పారదర్శకతతో పాటు సామాన్యులకు జవాబుదారీతనం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


