హైదరాబాద్ మహానగర పరిధిలో స్థిరాస్తుల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన మార్పులను తీసుకువచ్చింది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో ఏదైనా నివాస, వాణిజ్య ఆస్తి లేదా ఖాళీ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇకపై తప్పనిసరిగా ఆస్తి పన్ను గుర్తింపు నంబర్ (PTIN) లేదా ఖాళీ స్థలాల పన్ను గుర్తింపు నంబర్ (VLTIN) ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ గుర్తింపు నంబర్ లేకపోతే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవడం కూడా సాధ్యం కాదని తేల్చిచెప్పింది.
ఈ మేరకు స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ (IG) బుధవారం అధికారికంగా ఒక కీలక మెమోను జారీ చేశారు. ఈ నూతన విధానం ప్రకారం, సబ్-రిజిస్ట్రార్లు ఆస్తి రిజిస్ట్రేషన్ నిర్వహించే సమయంలో మూడు ప్రధాన అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌తో పాటే ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ (Mutation) ప్రక్రియ పూర్తికావడం, రిజిస్ట్రేషన్‌కు ముందే సదరు ఆస్తి పన్ను నంబర్‌ను నిర్ధారించుకోవడం ఇందులో అత్యంత ముఖ్యమైనవి.
పన్ను బకాయిలు పెండింగ్ ఉన్నా స్లాట్ బుకింగ్
స్లాట్ బుకింగ్ సమయంలోనే దరఖాస్తుదారులు పీటీఐఎన్(ITIN) లేదా వీఎల్టీఐఎన్(VLTIN) నంబర్‌ను తప్పనిసరిగా నమోదు చేయాలి. ఒకవేళ పీటీఐఎన్ నంబర్ ఉండి పన్ను బకాయిలు ఉన్నప్పటికీ స్లాట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే ఆ బకాయిల వివరాలతో దరఖాస్తుదారుడితో పాటు సంబంధిత మున్సిపల్ అధికారులకు ఎస్సెమ్మెస్ రూపంలో సమాచారం అందుతుంది. దీనివల్ల రిజిస్ట్రేషన్ ఆగకపోయినా, బకాయిల వసూలుకు మున్సిపల్ యంత్రాంగం తదుపరి చర్యలు తీసుకుంటుంది.
ఆస్తిపన్ను లేకుంటే ప్రత్యామ్నాయ మార్గాలు
ఆస్తి పన్ను నంబర్ లేని దరఖాస్తుదారుల కోసం ప్రభుత్వం రెండు ప్రత్యేక ప్రత్యామ్నాయ మార్గాలను సూచించింది. మొదటి విధానంలో దరఖాస్తు చేసుకున్న 48 గంటల తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది; ఈ గడువు లోపు మున్సిపల్ అధికారులు పన్ను మదింపు (Tax Assessment) పూర్తిచేసి గుర్తింపు నంబర్‌ను కేటాయించాలి. రెండో ప్రత్యామ్నాయం కింద 'పెండింగ్ రిజిస్ట్రేషన్' విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీని ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ తక్షణమే పూర్తయినప్పటికీ, పన్ను మదింపు జరిగి బకాయిలు చెల్లించే వరకు ఒరిజినల్ డాక్యుమెంట్‌ను రిజిస్ట్రార్ కార్యాలయంలోనే పెండింగ్‌లో ఉంచుతారు. పన్ను చెల్లింపు ప్రక్రియ పూర్తయ్యాకే డాక్యుమెంట్‌ను కొనుగోలుదారులకు అందజేస్తారు.
రియల్, నిర్మాణ రంగాల్లో ఆందోళనలు
మరోవైపు ప్రభుత్వ తీసుకువచ్చిన ఈ కొత్త నిబంధనపై రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగ వర్గాల్లో పలు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నిర్మాణ దశలో (Under Construction) ఉన్న అపార్ట్మెంట్లను బిల్డర్లు విక్రయించినప్పుడు వాటికి ముందస్తు పన్ను మదింపు ఉండదు. ఇప్పుడు పీటీఐఎన్ తప్పనిసరి చేయడంతో వాటి రిజిస్ట్రేషన్లు ఏ విధంగా సాగుతాయనే దానిపై గందరగోళం నెలకొంది. నిర్దేశిత 48గంటల్లోగా మున్సిపల్ సిబ్బంది పన్ను మదింపు పూర్తి చేయకపోతే సామాన్య కొనుగోలుదారులకు ఇబ్బందులు ఎదురవుతాయని, దీనిపై ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వాలని నిర్మాణ రంగ నిపుణులు కోరుతున్నారు.


