రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి స్మగ్లర్లు పెరిగిపోతున్నారు. గుట్టుగా సాగుచేయడం, వాటిని హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాలకు మూడో కంటికి తెలియకుండా సప్లయ్ చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా ద్వారా సీక్రెట్ కోడ్స్ పెట్టుకుని మరీ విద్యార్థులు, ఉద్యోగులకు సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈగల్ బృందాలు ఎప్పటికప్పుడు గంజాయి, డ్రగ్స్ ముఠాల ఆట కటిస్తున్నా కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు ఇలా అక్రమంగా గంజాయి పండించడంతో పాటు సప్లయ్ చేస్తున్నట్టు సమాచారం.
గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారిని పట్టుకునేందుకు వెళ్లితే కొందరు దాడులకు తెగబడుతున్నారు. ఈ మధ్యకాలంలో నగరంలో కొందరు గుట్టుగా ఓ గదిలో గంజాయి సాగు చేస్తూ దానిని విక్రయిస్తుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేయగా వారి మీదే ఆయుధాలతో దుండుగులు దాడులకు యత్నించారు.నిందితులతో పోలీసులకు కూడా సత్సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు కూడా వచ్చాయి. బాలానగర్ పీఎస్ పరిధిలో ఈ ఘటన వెలుగుచూసింది.
తాజాగా ఇలాంటి ఘటనే మరోకటి వెలుగుచూసింది. గంజాయి కేసు విచారణకు వెళ్లిన పోలీసులపై మూకుమ్మడి దాడి జరిగింది.ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం వాయిపేట్‌లో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. సీఐ, ఏఎస్ఐ సహా నలుగురు పోలీసులకు గాయాలు అయ్యాయి. వివరాల్లోకివెళితే..ఓ వ్యక్తి తన పెరట్లో గుట్టుగా గంజాయి సాగు చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.కేసు తదుపరి విచారణ కోసం పోలీసు బృందం ఆ గ్రామానికి వెళ్లగా.. గంజాయి సమాచారం ఎవరిచ్చారంటూ పోలీసులనే గ్రామస్తులు నిలదీశారు.
మహిళలతో కలిసి రాళ్లు, కర్రలతో దాడి చేసినట్టు తెలుస్తోంది.పోలీసు వాహనంతో పాటు వారి ఫోన్లు ధ్వంసమయ్యాయి.అయితే, పోలీసులే కులం పేరుతో తమను దూషించారంటూ ఆదివాసీల ఆరోపిస్తున్నారు. గాయపడిన పోలీసులకు ఆదిలాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు జిల్లా పోలీసులు తెలిపారు.


