విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో రెండో రోజుకు చేరుకున్నాయి. మొదటి రోజున లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, సోమవారం నాడు రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా శ్రీ కనకదుర్గమ్మ తల్లి సకల వేద స్వరూపిణి అయిన గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థాన అధికారులు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వేద పండితులు గాయత్రీ దేవి విశిష్టతను వివరిస్తూ ఈ అమ్మవారు సకల మంత్రాలకు, విద్యలకు మూలశక్తి అని తెలిపారు. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో, చేతిలో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి అమ్మవారు భక్తులను కరుణిస్తున్నారని వెల్లడించారు.
మరోవైపు, నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోనూ దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారు బ్రహ్మచారిణి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తూ పరవశింపజేస్తున్నారు. అమ్మవారి దివ్యరూపాన్ని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తడంతో శ్రీశైల క్షేత్రం కిటకిటలాడింది. భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు, వసతి ఏర్పాట్లను పర్యవేషిస్తున్నారు. శ్రీశైల పురవీధులలో అమ్మవారి గ్రామోత్సవం అత్యంత కనులపండువగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇటు తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం సరస్వతి అమ్మవారు భక్తులకు విశేషంగా గాయత్రీ దేవి అలంకారంలో దర్శనమిస్తూ జ్ఞాన ప్రదాయినిగా భక్తుల పూజలందుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు, అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించేందుకు విచ్చేసిన తల్లిదండ్రులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.


