తెరపై హీరోలు ఒకరితో ఒకరు పోరాడతారు. రకరకాల పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో బాక్సాఫీస్ వద్ద ప్రత్యర్థులుగా నిలుస్తారు. అభిమానులు మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో యుద్ధం చేస్తుంటారు.
కానీ... కెమెరా 'కట్' అన్న తర్వాత మొదలయ్యేది మరో కథ.
అక్కడ హీరోలు ఉండరు... స్టార్‌డమ్ ఉండదు... కోట్ల రూపాయల కలెక్షన్లు ఉండవు. అక్కడ ఉండేది ఒక్కటే... అదే.. స్నేహం.
విజయం వచ్చినప్పుడు భుజం తట్టే చేయి... అపజయం ఎదురైనప్పుడు "పర్లేదు... మళ్లీ మొదలుపెడదాం" అని ధైర్యం చెప్పే గొంతు... సంవత్సరాలు గడిచినా మారని అనుబంధం... అదే నిజమైన ఫ్రెండ్‌షిప్.
తెలుగు సినీ పరిశ్రమను బయట నుంచి చూసేవాళ్లకు అది కేవలం గ్లామర్ ప్రపంచంలా కనిపించొచ్చు. కానీ ఆ మెరుపుల వెనుక... కష్టాల్లో పుట్టి, కాలంతో మరింత బలపడిన కొన్ని అపురూపమైన స్నేహాలు ఉన్నాయి. ఇవి కేవలం హీరో-హీరోల మధ్య మాత్రమే కాదు... హీరో-డైరెక్టర్, హీరో-నటుడు, రచయిత-నటుడు... ఇలా ఎన్నో రూపాల్లో కనిపిస్తాయి.
ఈ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా... టాలీవుడ్‌లో అభిమానులు ఇప్పటికీ ప్రేమగా చెప్పుకునే ఓ.. ఐదు అపురూపమైన స్నేహాల గురించి తెలుసుకుందాం. స్టార్‌డమ్ కంటే బంధానికి విలువ ఇచ్చిన... హిట్లు, ఫ్లాపులు, కాలం... ఏదీ చెదరగొట్టలేకపోయిన ఆ స్నేహాల కథల్లోకి వెళ్దాం. టాలీవుడ్‌లో ఉన్న ఎన్నో ఫ్రెండ్స్ కథల్లో ఇవి కొన్ని మాత్రమే.
చిరంజీవి – నాగార్జున
తెలుగు సినిమా చరిత్రలో అగ్రస్థానంలో నిలిచిన ఇద్దరు హీరోలు చిరంజీవి, నాగర్జున. బాక్సాఫీస్ వద్ద పోటీ పడినా... వ్యక్తిగతంగా మాత్రం ఒకరిపై ఒకరు గౌరవాన్ని ఎప్పుడూ తగ్గించుకోలేదు. ఏ కుటుంబ వేడుకైనా... ఏ సినీ కార్యక్రమమైనా... ఇద్దరూ కలిస్తే కనిపించే ఆప్యాయత అభిమానులను ఆకట్టుకుంటుంది. స్టార్‌డమ్ ఎంత పెరిగినా... బంధం మాత్రం అలాగే కొనసాగించవచ్చని వీరి స్నేహాన్ని చూస్తే అర్థమవుతుంది.
రామ్ చరణ్ – రానా దగ్గుబాటి
చెర్రీ, రానా దగ్గుబాటి చిన్ననాటి బెంచ్‌మేట్స్, నేటి స్టార్ ఫ్రెండ్స్. కొన్ని స్నేహాలు సినిమా సెట్లో పుడతాయి. కొన్ని మాత్రం స్కూల్ బెంచ్‌ల మీదే మొదలవుతాయి. రామ్ చరణ్, రానా దగ్గుబాటి అలాంటి స్నేహితులే. చిన్నప్పటి నుంచే ఒకే వాతావరణంలో పెరిగారు. తర్వాత ఇద్దరూ తెలుగు సినీ పరిశ్రమలో అగ్రతారలుగా ఎదిగినా... చిన్ననాటి అనుబంధాన్ని అలాగే కొనసాగించారు. పబ్లిక్ ఈవెంట్లలో ఒకరిని ఒకరు ఆటపట్టించుకోవడం, ఇంటర్వ్యూల్లో చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకోవడం, కుటుంబ వేడుకల్లో కలిసి కనిపించడం... వీరి స్నేహాన్ని అభిమానులకు మరింత దగ్గర చేసింది. రానా చుట్టూ టాలీవుడ్‌లో పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఉందని చాలామంది చెబుతారు.
ప్రభాస్ – గోపీచంద్
వర్షం సినిమాతో మొదలైన ప్రభాస్, గోపీచంద్ బంధం.. నేటికీ చెక్కు చెదర్లేదు. వర్షం మూవీలో.. వీరిలో ఒకరు హీరో, మరొకరు విలన్‌గా నటించి మెప్పించారు. స్క్రీన్‌పై శత్రువుల్లా కనిపించిన ప్రభాస్, గోపీచంద్... నిజ జీవితంలో మాత్రం అత్యంత సన్నిహిత మిత్రులు. వర్షం సినిమా తర్వాత వీరి అనుబంధం మరింత బలపడింది. సినిమా ఫంక్షన్లు, వ్యక్తిగత వేడుకలు, ప్రత్యేక సందర్భాలు... ఒకరి జీవితంలో మరొకరు కనిపించడం అభిమానులకు కొత్త విషయం కాదు. అన్‌స్టాపబుల్ వంటి కార్యక్రమాల్లో కూడా వీరి మధ్య ఉన్న సహజమైన చనువు ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్టార్‌డమ్ ఎంత పెరిగినా... ఫ్రెండ్ కోసం సమయం కేటాయించే మనసు వీరిద్దరిలో కనిపిస్తుందని సినీ వర్గాలు తరచూ చెబుతుంటాయి.
జూనియర్ ఎన్టీఆర్ – రాజీవ్ కనకాల
సెట్లో మొదలై జీవితాంతం నిలిచిన అనుబంధం జూనియర్ ఎన్టీయార్, రాజీవ్ కనకాలది. స్టూడెంట్ నెం.1 సినిమా కేవలం ఎన్టీఆర్ కెరీర్‌కు మలుపు మాత్రమే కాదు... ఒక అందమైన స్నేహానికి కూడా ఆరంభం. షూటింగ్ సమయంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా... అవే తర్వాత పరస్పర అవగాహనగా మారాయని రాజీవ్ కనకాల స్వయంగా చెప్పాడు. కాలక్రమంలో ఇద్దరూ కుటుంబ సభ్యుల్లా కలిసిపోయారు. ఇంటర్వ్యూల్లోనూ రాజీవ్, ఎన్టీఆర్ గురించి ఎంతో ఆప్యాయంగా మాట్లాడడం అభిమానులు ఎన్నోసార్లు చూశారు. ఈ స్నేహానికి దర్శకుడు రాజమౌళి కూడా ఒక ముఖ్యమైన అనుసంధానంగా నిలిచాడని పలువురు చెబుతుంటారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ – సునీల్
ఆకలిని కూడా కలిసి పంచుకున్న స్నేహం త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ సొంతం. టాలీవుడ్‌లో స్నేహానికి నిర్వచనం చెప్పాలంటే మొదట గుర్తొచ్చే పేర్లు ఇవే. ఈ ఇద్దరి పరిచయం స్టార్‌డమ్ వచ్చిన తర్వాత మొదలైంది కాదు. సినిమా అవకాశాల కోసం హైదరాబాద్‌లో చిన్న గదుల్లో ఉండి, ఒకే కలతో పోరాడిన రోజుల నుంచే వీరి ప్రయాణం మొదలైంది. డబ్బులు లేని రోజుల్లో ఒక ప్లేట్ భోజనం ఇద్దరూ పంచుకున్న సందర్భాలను పలుమార్లు గుర్తు చేసుకున్నారు. త్రివిక్రమ్ రచయితగా, దర్శకుడిగా ఎదిగినా... సునీల్ స్టార్ కమెడియన్‌గా, తర్వాత హీరోగా మారినా... వారి స్నేహంలో మాత్రం మార్పు రాలేదు. త్రివిక్రమ్ సినిమాల్లో సునీల్‌కు ప్రత్యేక స్థానం ఉండటానికి కారణం కేవలం టాలెంట్ మాత్రమే కాదు... ఆ నమ్మకం, ఆ అనుబంధం కూడా.
స్నేహం... హిట్ సినిమాల కంటే పెద్దది. సినిమాలు వస్తాయి... పోతాయి. రికార్డులు బద్దలవుతాయి... కొత్త రికార్డులు పుడతాయి. కానీ ఒక మంచి స్నేహం మాత్రం కాలంతో పాటు మరింత బలపడుతుంది. అందుకే ఈ హీరోలంటే ప్రాణమిస్తారు అభిమానులు. ఇలాంటి వారు టాలీవుడ్‌లో చాలా మందే కనిపిస్తారు.
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్లు ఉండొచ్చు. కానీ అర్థరాత్రి ఒక ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నావ్... వస్తున్నా అని చెప్పే మనిషి ఉంటే... అదే అసలైన సంపద.
ఈ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా... ఒక చిన్న సజెషన్.
ఏళ్లుగా మాట్లాడని మీ స్కూల్ ఫ్రెండ్‌కు ఒక మెసేజ్ పంపండి. కాలేజీ రోజుల్లో మీతో నవ్విన స్నేహితుడికి ఒక ఫోన్ చేయండి.
ఎందుకంటే... డబ్బు మళ్లీ సంపాదించవచ్చు... పేరు మళ్లీ తెచ్చుకోవచ్చు... కానీ ఒక నిజమైన స్నేహితుడిని కోల్పోతే... ఆ ఖాళీని ఎవరూ భర్తీ చేయలేరు. అందుకే... జీవితంలో కాపాడుకోవాల్సిన గొప్ప బంధం ఏదైనా ఉంటే... అది స్నేహం మాత్రమే.












