ఆలయాలు ఆథ్యాత్మిక కేంద్రాలు.. కానీ వాటిని వ్యాపార కేంద్రాలుగా మలిచారనే ఆరోపణలు ఉన్నాయి.. కొన్ని దేవాలయాలలో అయితే కొందరి పెత్తనాలు ఒక రేంజ్ లో ఉండటం తెలిసిందే. అలాగే ఇక్కడ నిర్వహించే ప్రతి క్రతువుకు ఒక రేట్ ఫిక్స్ అయ్యి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా దేవాదాయశాఖ అధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. దేవాలయాల్లో ప్రైవేటు పెత్తనాన్ని సహించేది లేదని తెలిపారు.
భగవంతుడి పేరు చెప్పి ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడిదే సహించేది లేదంటున్నారు. దేవాదాయశాఖ అనుమతి పొందకుండా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా చూడాలని కార్యనిర్వహణ అధికారులను ఆదేశించారు. వరంగల్‌లోని బాలానగర శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఇటీవల దేవాదాయశాఖ అధికారులు నిర్వహించిన తనిఖీలు చర్చనీయాంశంగా మారాయి.
ఈ సందర్భంగా ఆలయంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సేవా సమితి ప్రతినిధులను అధికారులు పలు అంశాలపై వివరణ కోరినట్లు సమాచారం. దాతల నుంచి ఇప్పటివరకు ఎంత మొత్తంలో విరాళాలు సేకరించారో, ఆ నిధులను ఏయే కార్యక్రమాలకు వినియోగించారో పూర్తి వివరాలు సమర్పించాలని అధికారులు సూచించినట్లు తెలిసింది. అలాగే ఆలయ ఉత్సవాలు, పర్వదినాలు, అభిషేకాలు, ప్రత్యేక పూజల పేరుతో భక్తుల నుంచి ఎలాంటి అనధికార విరాళాల సేకరణ చేపట్టకూడదని స్పష్టం చేసినట్లు సమాచారం.
అదేవిధంగా, విరాళాల సేకరణ కోసం క్యూఆర్ కోడ్ లేదా స్కానర్‌లను ఏర్పాటు చేయరాదని కూడా అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సేవా సమితి భక్తులకు అందిస్తున్న ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంతో సేవా సమితి ప్రతినిధులు, దేవాదాయశాఖ అధికారుల మధ్య విభేదాలు వెలుగుచూశాయి.
భక్తుల సహకారంతో చేపడుతున్న సేవా కార్యక్రమాలను నిలువరించడం సరైన చర్య కాదని సేవా సమితి ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ఆలయాల్లో ఆర్థిక వ్యవహారాలు నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకున్నామని దేవాదాయశాఖ వర్గాలు పేర్కొంటున్నట్లు సమాచారం.
మరోవైపు దేవాదాయ శాఖ ఉమ్మడి వరంగల్ జిల్లా సహాయ కమిషనర్ సునీత ఈవోగా ఉన్న భద్రకాళి ఆలయంలో ప్రైవేటు వ్యక్తుల పెత్తనం సంగతేమిటనే ప్రశ్నలు స్థానికంగా తలెత్తుతున్నాయి. కల్యాణ బ్రహ్మోత్సవాలు, శాకంబరి ఉత్సవాలు, వసంత నవరాత్రులు, శ్రీదేవి శరన్నవరాత్రుల పేరుతో దాతల నుంచి విరాళాలు తీసుకుంటున్నారు. ఈ అంశం రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. దీనిపై శాఖ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.












