Tollywood: టాలీవుడ్ బాక్సాఫీస్ పీఠం కోసం దశాబ్దాలుగా సాగుతున్న లెక్కలు ఇప్పుడు పూర్తిగా తలకిందులవుతున్నాయి. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఏ నిర్ణయమైనా, ఏ సినిమా రిలీజ్ డేటాలైనా ఒకే ఒక పేరు చుట్టూ తిరిగేవి.. ఆయనే ప్రొడ్యూసర్ దిల్ రాజు. కానీ కాలం మారింది, కాలంతో పాటు టాలీవుడ్ సమీకరణాలు కూడా వేగంగా మారిపోయాయి. ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ ను శాసించే శక్తిగా మైత్రీ మూవీ మేకర్స్ దూసుకువచ్చింది.
నిజానికి దిల్ రాజు అంటేనే పక్కా ప్లానింగ్, బిజినెస్ గ్రిప్, ఏరియాల వారీగా డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌పై పూర్తి పట్టు. ఏ సినిమా ఎప్పుడు రావాలి, థియేటర్ల సర్దుబాటు ఎలా ఉండాలనే విషయంలో ఆయన మాటే శాసనంగా ఉండేది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా మైత్రీ మూవీ మేకర్స్ అవలంబిస్తున్న వ్యూహం పూర్తిగా భిన్నంగా ఉంది. కేవలం ఒకరిద్దరు స్టార్ హీరోలనే కాకుండా, యంగ్ హీరోల నుంచి పాన్ ఇండియా స్టార్ల వరకు అందరితోనూ ఏకకాలంలో భారీ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెడుతున్నారు మైత్రీ నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్. భారీ బడ్జెట్‌లను సైతం లెక్కచేయకుండా వారు వేస్తున్న అడుగులు టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కు తెరలేపాయి.
అలాగే ఒకప్పుడు ఏరియావారీగా థియేటర్లను కంట్రోల్ చేయడం ద్వారా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఎదురులేకుండా దూసుకెళ్లారు దిల్ రాజు. కానీ మైత్రీ మూవీ మేకర్స్ కేవలం ప్రొడక్షన్‌తో ఆగిపోకుండా, సొంతంగా భారీ స్థాయి రిలీజ్‌లు, మార్కెటింగ్ వ్యూహాలతో నేరుగా పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేసింది. పుష్ప లాంటి సిరీస్‌లతో గ్లోబల్ స్థాయిలో తమ సత్తా చాటుతూ, టాలీవుడ్ లోనే అత్యధిక ప్రాజెక్ట్‌లు చేస్తున్న నిర్మాణ సంస్థగా మైత్రీ అవతరించింది. దీంతో ట్రేడ్ పండితులు సైతం తమ అంచనాలను మార్చుకోవాల్సి వస్తోంది.
అలా అని మైత్రీ దెబ్బకు దిల్ రాజు పూర్తిగా డౌన్ అయిపోయారని చెప్పడం తొందరపాటే అవుతుంది. ఎందుకంటే దిల్ రాజు కేవలం ఒక నిర్మాత మాత్రమే కాదు, డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడిగా, ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా అనేక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. భారీ సినిమాలతో పాటు చిన్న, మీడియం రేంజ్ సినిమాలతో నిలకడగా విజయాలు సాధించడం ఆయన ప్రత్యేకత. మైత్రీ దూకుడు ఒకవైపు సంచలనం సృష్టిస్తున్నప్పటికీ, ఎప్పటికప్పుడు మారే ట్రెండ్‌కు తగ్గట్టు దిల్ రాజు కూడా తన వ్యూహాలను మార్చుకుంటూనే ఉన్నారు. కానీ, టాలీవుడ్‌లో పాత శకం ఆధిపత్యానికి, కొత్త తరం దూకుడుకు మధ్య ఒక సైలెంట్ వార్ నడుస్తోందనేది సుస్పష్టం. ఇక ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ పోటీ టాలీవుడ్ స్థాయిని మరింత పెంచుతుందనడంలోనూ ఎలాంటి సందేహం లేదు.












