ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో పదో తరగతి విద్యార్థినులపై రంపంతో అత్యంత భయానక దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘోర ఉదంతంపై తీవ్రంగా స్పందించిన అనంతపురం జిల్లా పోలీసులు నిందితుడిపై చట్టంలోని అత్యంత కఠినమైన క్రిమినల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దాడి నుంచి తన స్నేహితురాలిని కాపాడేందుకు ప్రయత్నించి తీవ్రంగా గాయపడిన మరో విద్యార్థిని లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు హత్యాయత్నం సహా అనేక కీలక సెక్షన్లను ఎఫ్ఐఆర్ (FIR) లో చేర్చారు.
నమోదైన కేసుల తీవ్రతను బట్టి నిందితుడు హేమంత్‌కు కోర్టు ద్వారా జీవిత ఖైదు లేదా పదేళ్ల పైబడి కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. పోలీసులు వెల్లడించిన అధికారిక వివరాల ప్రకారం.. నిందితుడు హేమంత్పై నూతన భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టంలోని సెక్షన్ 109(1) కింద హత్యాయత్నం (Attempt to Murder), సెక్షన్ 118(1) కింద అత్యంత ప్రమాదకరమైన ఆయుధమైన రంపంతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినందుకు కేసులు నమోదు చేశారు.
వీటితో పాటు బడి వేళల్లో దారుణమైన ఆయుధంతో పాఠశాల ప్రాంగణంలోకి అక్రమంగా చొరబడినందుకు బీఎన్ఎస్ సెక్షన్ 333ను కూడా జోడించారు. అలాగే, ప్రధాన బాధిత విద్యార్థిని గోపిక ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం (SC/ST Act) లోని కఠినమైన సెక్షన్ 3(2)(V) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ దాడిలో గొంతు వద్ద తీవ్రంగా గాయపడిన విద్యార్థిని గోపిక ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని వైద్యులు తెలిపారు.
మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రీన్ కారిడార్ ద్వారా కర్ణాటక రాజధాని బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించబడిన ఆమె, ప్రస్తుతం వైద్యుల నిరంతర పర్యవేక్షణలో కోలుకుంటోంది. మరోవైపు, ఘటన తర్వాత పోలీసులపై దాడికి యత్నించిన సమయంలో పోలీసుల ఆత్మరక్షణ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిందితుడు హేమంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే కాల్పుల వల్ల అతడి కాలు తీవ్రంగా దెబ్బతిన్నందున, ఇన్ఫెక్షన్ ఇతర భాగాలకు పాకకుండా ఉండేందుకు వైద్యులు హేమంత్ కాలును శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సి రావచ్చని వెల్లడించడం గమనార్హం.


