నేడు తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురాసు’ తుఫాను ఒంగోలు వద్ద తీరం దాటిన విషయం తెలిసిందే. ఈ తుఫాను ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై స్పష్టంగా కనిపిస్తోంది. ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో నేటి సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం.
మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 120 నుంచి 150 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నట్లు వెదర్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేశారు. మరోవైపు నల్గొండ, యాదాద్రి-భువనగిరి, నాగర్‌కర్నూల్, జనగాం, వరంగల్, హన్మకొండ, ములుగు జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.
మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడొచ్చని తెలుస్తోంది. ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆకాశం మేఘావృతమై పొడిగా, చిరుజల్లులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మధ్యాహ్నం తర్వాత పలుచోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ వెల్లడించారు. వర్ష సూచన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.ఇదిలాఉండగా, రాష్ట్రంలో ఇప్పుడే పంటలు కోతకు రావడంతో పాటు పలు చోట్ల ధాన్యాన్ని రైతులు ఎండబెట్టారు. ఈ సమయంలో వర్షాలు కురిస్తే అన్నదాతలు ఆగం అవుతారని తెలుస్తోంది. ఆరబెట్టిన ధాన్యాన్ని టార్పాలిన్ కవర్లు ఏర్పాటు చేసి కాపాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


