Aadarsha Kutumbam: టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. గతంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాల విజయమే దీనికి కారణం. ఇక, తాజాగా వీరిద్దరి కలయికలో వచ్చిన ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నంబర్ 47’ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, ఈ సినిమా విడుదలైన తర్వాత డివైడ్ టాక్ రావడం, మరోవైపు భారీ బడ్జెట్ వార్తలు బయటకు రావడంతో ఇప్పుడు ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ఆర్థిక లెక్కలపై చర్చ మొదలైంది. బడ్జెట్ ఫెల్యూవర్ గా పరిగణిస్తున్నారు.
వాస్తవానికి ‘ఆదర్శ కుటుంబం’ సినిమాకు బడ్జెట్ విషయంలో కాస్త కంట్రోల్ ఉండి ఉంటే నిర్మాతలకు మంచి లాభాలు వచ్చేవనే అభిప్రాయాలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్నాయి. 60 కోట్లలో పూర్తి చేయాలనుకున్న సినిమాకి ఏకంగా 130 కోట్ల వరకూ బడ్జెట్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా.. నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు త్రివిక్రమ్ రెమ్యునరేషన్ కాకుండా సుమారు రూ.110 కోట్ల బడ్జెట్ అయినట్లుగా సమాచారం. దీనికి అదనంగా ప్రమోషనల్ ఖర్చుల బడ్జెట్ 18 కోట్ల వరకూ కలుపుకుంటే రూ.128 కోట్ల వరకు ఉండొచ్చనే అంచనాలు కూడా వచ్చాయి.
ఆదర్శ కుటుంబం సినిమాకు ఓటీటీ, శాటిలైట్, మ్యూజికల్ రైట్స్, ఇతర హక్కుల ద్వారా సుమారు రూ.70 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం. థియేట్రికల్ హక్కుల రూపంలో సుమారు రూ.65 కోట్లుగా ప్రచారం జరిగింది. ఈ లెక్కల ప్రకారం సినిమా మొత్తం బిజినెస్, నిర్మాణ వ్యయం మధ్య బ్యాలెన్స్ కావడం లేదంటున్నారు. వెంకీ-త్రివిక్రమ్ వంటి క్రేజీ కాంబోకి కూడా ఇంత దారుణమైన నష్టాలంటే ఇక, సినిమా చేసే ధైర్యం చేఏదెవరు..అనే మాట వినిపిస్తోంది.
అప్పుడు అతడు..ఇప్పుడు ఆదర్శకుటుంబం:
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రిష జంటగా అతడు సినిమా వచ్చింది. ఈ సినిమా మేకింగ్ చాలా నెలలు సమయం తీసుకున్నారు. అంతేకాదు, దాదాపు 6 గంటల రష్ ఉన్నట్టుగా ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది. అనవసరంగా చాలా రోజులు షూటింగ్ చేసి అందులో, సగానికి పైగా ఫుటేజ్ ఉపయిగించలేదట. అతడు బడ్జెట్ ఫెల్యూర్ అని నిర్మాత మురళీమోహన్ కూడా పలు అందర్భాలలో వెల్లడించారు. చూస్తుంటే, ఇప్పుడు ఆదర్శకుటుంబం కి కూడా ఇదే రిపీటవుతోంది. అంటే, ముమ్మాటికి ఇది త్రివిక్రమ్ తప్పిదమే అనుకోవాలి.


