మరికొద్ది గంటల్లో మిడ్‌టర్మ్ పోలింగ్..
ఓటు హక్కుపై పోరు, రాష్ట్రాల మధ్య రగడ..
ట్రంప్ భవిష్యత్తును నిర్ణయించనున్న ఎన్నికలు!
50 రాష్ట్రాలు.. 50 ఎన్నికల వ్యవస్థలు!
మరికొద్ది గంటల్లో అమెరికాలో ఎన్నికల సమరం మొదలుకాబోతోంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. కానీ ఈసారి అమెరికా ఎన్నికలు సాధారణ రాజకీయ పోరులా లేవు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇది అత్యంత కీలకమైన పరీక్షగా మారింది.
అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు.. ఎన్నికల నిబంధనల్లో మార్పుల ప్రయత్నాలు.. ఓటర్ల జాబితాలపై వివాదాలు.. రాష్ట్ర ప్రభుత్వాలతో ఘర్షణలు.. ఇలా ఎన్నో పరిణామాల మధ్య అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలు జరుగుతున్నాయి.
అసలు అమెరికాలో ఎన్నికల వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? భారత్‌లో మాదిరిగా ఒకే ఎన్నికల సంఘం ఎందుకు లేదు? ఓటరు గుర్తింపు కార్డు విషయంలోనూ అమెరికాలో ఇంత పెద్ద వివాదం ఎందుకు? ట్రంప్ ఎన్నికల వ్యవస్థపై పట్టు సాధించాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లు ఓడిపోతే ట్రంప్‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలే.
భారత్‌లో ఒకే ఈసీ.. అమెరికాలో 50 రకాల రూల్స్!
భారత్‌లో ఎన్నికలంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఎన్నికల సంఘం. దేశంలో లోక్‌సభ ఎన్నికలైనా, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలైనా, ఎన్నికల నిర్వహణ బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘానిదే. ఓటర్ల జాబితాల తయారీ, ఎన్నికల షెడ్యూల్, పోలింగ్, ఓట్ల లెక్కింపు.. ఇలా కీలక బాధ్యతలను ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది.
కానీ అమెరికా పరిస్థితి పూర్తిగా భిన్నం. అక్కడ దేశవ్యాప్తంగా ఎన్నికలను నిర్వహించే భారత తరహా కేంద్ర ఎన్నికల సంఘం లేదు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఎన్నికల నిర్వహణలో ప్రధాన బాధ్యత రాష్ట్రాలదే. మొత్తం 50 రాష్ట్రాలు తమ ఎన్నికల నిబంధనలను తామే రూపొందించుకుంటాయి.
ఎవరు ఓటరుగా నమోదు చేసుకోవాలి? గుర్తింపునకు ఏ పత్రాలు చూపించాలి? పోస్టల్ బ్యాలెట్లను ఎలా లెక్కించాలి? నియోజకవర్గాల సరిహద్దులు ఎలా నిర్ణయించాలి? ఇలాంటి అంశాలపై రాష్ట్రాల మధ్యే తేడాలుంటాయి. అంటే మరి కొద్ది గంటల్లో అమెరికన్లు ఒకే ఎన్నికలో పాల్గొంటున్నట్లు కనిపించినా.. వాస్తవానికి 50 రాష్ట్రాల్లో 50 రకాల ఎన్నికల నిబంధనల మధ్య ఓటు వేయబోతున్నారు. ఇక్కడే అసలు రాజకీయ వివాదం మొదలైంది.
ట్రంప్ పట్టు.. ఓటర్ల జాబితాలపై ఎందుకీ యుద్ధం?
అమెరికాలో ఓటు వేయాలంటే పౌరసత్వం ఉండాల్సిందే. అయితే ఓటరు పౌరసత్వాన్ని ఎలా నిర్ధారించాలి? దానికి ఎలాంటి పత్రాలు తప్పనిసరి చేయాలి? అన్నదే ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది.
2025 మార్చిలో ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఓటరు నమోదు సమయంలో పాస్‌పోర్ట్ లేదా బర్త్ సర్టిఫికెట్ ద్వారా పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని ప్రతిపాదించారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలోనూ కఠినమైన నిబంధనలు తీసుకురావాలని చూశారు. రాష్ట్రాల ఓటర్ల జాబితాలపై ఫెడరల్ ప్రభుత్వానికి మరింత ప్రాధాన్యత ఉండాలని ఆదేశించారు.
ట్రంప్ వాదన ఏంటంటే.. అమెరికా ఎన్నికల్లో అక్రమ ఓటింగ్‌ను అరికట్టాలి. ఓటర్ల జాబితాల్లో అర్హత లేని వారి పేర్లు ఉండకూడదు. ఎన్నికల పారదర్శకత పెరగాలి.
నో.. వే అంటున్న డెమోక్రాట్లు...
ఇక్కడ.. డెమోక్రాట్ల వాదన మరోలా ఉంది. ఈ నిబంధనల వల్ల నిజమైన అమెరికా పౌరులు కూడా ఓటు వేయలేని పరిస్థితి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పేదలు, యువత, మైనారిటీలకు అవసరమైన డాక్యుమెంట్లు సేకరించడం కష్టమవుతుందని చెబుతున్నారు.
ఈ వివాదంపై కోర్టులు కూడా జోక్యం చేసుకున్నాయి. అధ్యక్షుడికి రాష్ట్రాలు, కాంగ్రెస్ పరిధిలో ఉన్న ఎన్నికల నిబంధనలను ఏకపక్షంగా మార్చే అధికారం లేదని పలు న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. అయినా ట్రంప్ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఎన్నికల నిర్వహణపై ఫెడరల్ ప్రభుత్వ పాత్ర పెరగాలన్న ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
కాలిఫోర్నియా వర్సెస్ ట్రంప్.. కోర్టులకెక్కిన ఎన్నికల యుద్ధం!
ఈ మొత్తం వివాదంలో కాలిఫోర్నియా రాష్ట్రం ప్రత్యేకంగా నిలుస్తోంది. అక్కడి డెమోక్రటిక్ గవర్నర్ గావిన్ న్యూసమ్.. ట్రంప్ నిర్ణయాలను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. ఓటర్ల వ్యక్తిగత వివరాలు, ఎన్నికల రికార్డులపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల వ్యవస్థను రక్షించుకోవడానికి ప్రత్యేక చట్టాలు కూడా తీసుకొచ్చారు.
ఇటీవల కాలిఫోర్నియాలో నమోదైన 20 వేల మందికి పైగా ఓటర్ల ఓట్లను లెక్కించకూడదంటూ ట్రంప్ ప్రభుత్వ న్యాయశాఖ కోర్టును ఆశ్రయించింది. వీరు పౌరసత్వ అర్హత లేని ఓటర్లు కావచ్చన్నది ప్రభుత్వ వాదన. కానీ కాలిఫోర్నియా అధికారులు ఆ జాబితాలోని వివరాల విశ్వసనీయతను ప్రశ్నించారు.
అక్టోబర్ 28న ఫెడరల్ జిల్లా కోర్టు ఈ ఓట్లను పక్కనపెట్టాలన్న ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకుంది. అక్టోబర్ 30న అప్పీల్స్ కోర్టు కూడా ట్రంప్ ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది. అంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూడా ట్రంప్ ప్రభుత్వం, కాలిఫోర్నియా మధ్య న్యాయపోరాటం కొనసాగుతూనే ఉందన్నమాట. ఇది కేవలం రెండు రాజకీయ పార్టీల మధ్య వివాదం కాదు. అమెరికాలో ఎన్నికలను నియంత్రించే అధికారం ఎవరిది? రాష్ట్రాలదా? కేంద్ర ప్రభుత్వానిదా? అన్న రాజ్యాంగపరమైన ప్రశ్నగా మారింది.
నవంబర్ 3.. ట్రంప్ భవిష్యత్తుకు అసలైన పరీక్ష!
ఇప్పుడు అందరి చూపు ఎన్నికలపైనే ఉంది. అమెరికాలో మిడ్‌టర్మ్ ఎన్నికలు అంటే అధ్యక్ష ఎన్నికలు జరిగిన రెండేళ్ల తర్వాత జరిగే మధ్యంతర ఎన్నికలు. ఈ ఎన్నికల్లో అమెరికా ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, సెనేట్‌లోని 100 స్థానాల్లో దాదాపు మూడో వంతు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రాల వారీగా ఇతర పదవులకు కూడా ఓటింగ్ ఉంటుంది.
ఈసారి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుంటే.. డెమోక్రాట్లు కాంగ్రెస్‌పై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు మెజారిటీ సాధిస్తే ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలపై దర్యాప్తులు, విచారణలు పెరిగే అవకాశం ఉంటుంది. అధ్యక్షుడి విధానాలకు పార్లమెంటరీ స్థాయిలో అడ్డంకులు ఎదురుకావచ్చు.
మరోవైపు రిపబ్లికన్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తే ట్రంప్‌కు మిగిలిన రెండేళ్ల పాలనలో మరింత స్వేచ్ఛ లభిస్తుంది. అందుకే ఈ ఎన్నికలు కేవలం కాంగ్రెస్‌లో ఎవరు మెజారిటీ సాధిస్తారన్న దానికే పరిమితం కావడం లేదు. ట్రంప్ రెండో విడత పాలనకు ప్రజలు ఇస్తున్న తీర్పుగా కూడా మారాయి.
అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. అమెరికాలో ఎన్నికలు పూర్తయిన వెంటనే ఫలితాలు తెలియవు. పోస్టల్ బ్యాలెట్లు, ఓట్ల లెక్కింపు, న్యాయపరమైన అభ్యంతరాలు, ఫలితాల ధ్రువీకరణ వంటి ప్రక్రియలు ఎన్నో ఉంటాయి. ఈసారి ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై వివాదాలు నడుస్తుండటంతో పోలింగ్ తర్వాత కూడా రాజకీయ ఉత్కంఠ కొనసాగే అవకాశముంది.
భారత్‌లో ఎన్నికల సంఘం ఒకే వ్యవస్థగా దేశవ్యాప్తంగా ఎన్నికలను నిర్వహిస్తుంటే.. అమెరికాలో మాత్రం రాష్ట్రాల వారీగా నిబంధనలు, కోర్టుల జోక్యాలు, రాజకీయ ఘర్షణల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తానికి మరికొద్ది గంటల్లో అమెరికా ఓటర్లు తమ తీర్పును ఇవ్వబోతున్నారు. ఆ తీర్పు ట్రంప్ రాజకీయ భవిష్యత్తును మాత్రమే కాదు.. అమెరికా కాంగ్రెస్‌లో అధికార సమీకరణాలను, రాబోయే రెండేళ్ల దేశ రాజకీయ దిశను కూడా నిర్ణయించబోతోంది. ఇక్కడ అసలు ప్రశ్న ఒక్కటే.. ట్రంప్ తన రాజకీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటారా? లేక అమెరికా ఓటర్లు ఆయనకు గట్టి షాక్ ఇస్తారా? ఇది తేలాల్సి ఉంది.


