తెలంగాణ

TG: సర్కారు బడులకు ఎసరు.. టీపీఎస్ పేరుతో వేలాది పాఠశాలల విలీనం!

5 నిమిషాల పఠనం

TG: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా విద్యాశాఖ తీసుకున్న తాజా నిర్ణయం తీవ్ర దుమారం రేపుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 26 వేల బడులను 4 వేలకు కుదిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన మాటల దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

TG: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా విద్యాశాఖ తీసుకున్న తాజా నిర్ణయం తీవ్ర దుమారం రేపుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 26 వేల బడులను 4 వేలకు కుదిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన మాటల దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (టీపీఎస్) పేరుతో సర్కారు బడులను విలీనం చేసి, పరోక్షంగా వేలాది పాఠశాలలకు తాళాలు వేసే కుట్ర జరుగుతోందన్న ఆందోళన ఉపాధ్యాయ, ప్రజా సంఘాల్లో వ్యక్తమవుతోంది.

విలీనం ఉండబోదన్నారు.. ఇప్పుడు జీవోలు ఇచ్చేశారు!

ప్రభుత్వం కొత్తగా 134 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను మంజూరు చేస్తూ, 2027-28 నాటికి వాటిని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. అయితే కేవలం కొత్త భవనాలు నిర్మించడంతో ఆగకుండా.. ఈ టీపీఎస్‌లకు సమీపంలో ఉన్న మండల పరిషత్, జిల్లా పరిషత్ స్కూళ్లు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకులాలు, జూనియర్ కాలేజీలను సైతం అందులో విలీనం చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గతంలో అసెంబ్లీ వేదికగా పాఠశాలల విలీనం ఉండదని నమ్మబలికిన సర్కారు.. ఇప్పుడు జీవోలు విడుదల చేసి మాట తప్పిందంటూ విద్యావేత్తలు మండిపడుతున్నారు.

చిన్న బడుల పాలిట మరణశాసనం

రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తొలి టీపీఎస్ స్కూల్ ప్రారంభం కాగా, ఇప్పటికే మరో 80 చోట్ల పనులు వేగంగా సాగుతున్నాయి. ఒక్కో క్యాంపస్‌కు రూ.10-12 కోట్లు వెచ్చించి, సుమారు 1,500 మంది విద్యార్థులకు నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకేచోట చదువు చెప్పించాలన్నది ప్రణాళిక. చుట్టుపక్కల ఊళ్ల నుంచి బస్సులేసి పిల్లలను తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా మారనుంది. బస్సుల పేరుతో పిల్లలందరినీ టీపీఎస్‌లకు తరలిస్తే, పల్లెల్లో 10-20 మంది విద్యార్థులతో నడిచే ప్రాథమిక పాఠశాలల్లో హాజరు పూర్తిగా పడిపోతుంది. దీంతో విద్యార్థులు లేరన్న నెపంతో గ్రామీణ పాఠశాలలను మూసివేయడం ఖాయం. పేద పిల్లలకు నడక దూరంలో బడి లేకుండా చేసి, చదువుకే దూరం చేసే ప్రమాదం పొంచి ఉందని ఉపాధ్యాయ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

ప్రత్యేక వ్యవస్థలకు ముగింపు.. పర్యవేక్షణ గల్లంతు

ఒకే గొడుగు కిందకు తేవడం వల్ల అణగారిన వర్గాల కోసం ప్రత్యేక లక్ష్యాలతో ఏర్పడిన సోషల్ వెల్ఫేర్ గురుకులాలు, ఆడపిల్లల కోసం తెచ్చిన కేజీబీవీల ఉనికి పూర్తిగా కనుమరుగైపోనుంది. నర్సరీ చదివే పసిపిల్లల నుంచి యుక్తవయసులో ఉండే ఇంటర్ విద్యార్థుల వరకు వేలాది మందిని ఒకే ప్రాంగణంలో ఉంచితే పర్యవేక్షణ లోపాలు, క్రమశిక్షణా రాహిత్యం పెరిగే అవకాశముందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. చిన్న పిల్లలు రోజూ కిలోమీటర్ల కొద్దీ బస్సుల్లో ప్రయాణించడం ఎంతవరకు శ్రేయస్కరమని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. సర్కారు బడులకు నిధులు కేటాయించి, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి విద్యావ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి.. కార్పొరేట్ మోడల్ పేరిట ఉన్న బడులను తుడిచిపెట్టే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

#Telangana Education#Telangana Government#Telangana Public Schools#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి