జాతీయం

Apple Business Strategy: కస్టమర్లను పిండేస్తున్న యాపిల్.. ఐఫోన్ 18 ప్రోపై బయటపడ్డ దారుణ దోపిడీ!

6 నిమిషాల పఠనం

Apple Business Strategy: ప్రీమియం బ్రాండ్.. స్టేటస్ సింబల్.. ఈ రెండు మాటల మాటున ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ చేస్తున్న వ్యాపార మాయాజాలం మరోసారి బట్టబయలైంది. లేటెస్ట్ ఫీచర్లు, కెమెరా క్వాలిటీ పేరుతో ఇప్పటికే లక్షల్లో ధరలు నిర్ణయిస్తున్న కంపెనీ.. ఇప్పుడు కేవలం 'స్టోరేజ్ అప్‌గ్రేడ్' పేరుతో కస్టమర్ల జేబులను ఏ విధంగా గుల్ల చేస్తోందో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Apple Business Strategy: ప్రీమియం బ్రాండ్.. స్టేటస్ సింబల్.. ఈ రెండు మాటల మాటున ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ చేస్తున్న వ్యాపార మాయాజాలం మరోసారి బట్టబయలైంది. లేటెస్ట్ ఫీచర్లు, కెమెరా క్వాలిటీ పేరుతో ఇప్పటికే లక్షల్లో ధరలు నిర్ణయిస్తున్న కంపెనీ.. ఇప్పుడు కేవలం 'స్టోరేజ్ అప్‌గ్రేడ్' పేరుతో కస్టమర్ల జేబులను ఏ విధంగా గుల్ల చేస్తోందో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 18 ప్రో మోడళ్లలో అదనపు మెమరీ కోసం అయ్యే హార్డ్‌వేర్ ఖర్చుకు, కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్న ప్రీమియానికి అసలు పొంతనే లేదని ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ తన పరిశోధనాత్మక కథనంలో కుండబద్దలు కొట్టింది.

తయారీ ఖర్చు రూ.18 వేలు.. వసూలు చేస్తున్నది రూ.56 వేలు

వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక బయటపెట్టిన లెక్కలు చూస్తే యూజర్స్ నిలువునా మోసపోతున్నారన్న విషయం స్పష్టమవుతోంది. ఐఫోన్ 18 ప్రోలో 256GB నుంచి 1TB స్టోరేజ్‌కు పెంచడానికి కంపెనీకి అయ్యే ఖర్చు కేవలం 192 డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.18 వేలు). కానీ, అదే 1TB వేరియంట్ కావాలంటే కస్టమర్ నుంచి అదనంగా లాగుతున్న మొత్తం ఏకంగా 600 డాలర్లు (దాదాపు రూ.56 వేలు). అంటే ఒక్క 1TB అప్‌గ్రేడ్‌పైనే సుమారు రూ.38 వేలకు పైగా నికర లాభాన్ని యాపిల్ తన ఖాతాలో వేసుకుంటోంది. ఇక 512GB మోడల్ పరిస్థితి కూడా ఇంతే. ఈ అదనపు మెమరీ చిప్ కోసం సంస్థకు అయ్యే వ్యయం కేవలం 66 డాలర్లు కాగా, కస్టమర్ నుంచి 200 డాలర్లు వసూలు చేస్తూ సుమారు 134 డాలర్లను దర్జాగా మార్జిన్‌గా పిండుకుంటోంది.

2TB వేరియంట్‌పై ఏకంగా రూ.70 వేల లాభం

ఇక టాప్-ఎండ్ 2TB మోడల్ విషయంలో సాగుతున్న దోపిడీ మరింత భయంకరంగా ఉంది. 1TB నుంచి 2TBకి వెళ్లాలనుకునే యూజర్ ఏకంగా 1,200 డాలర్ల అదనపు భారాన్ని భరించాల్సి వస్తోంది. అయితే, ఈ అదనపు స్టోరేజ్ అందించడానికి కంపెనీకి అయ్యే అంచనా ఖర్చు కేవలం 450 డాలర్లు మాత్రమే. అంటే ఒక్కో 2TB ఫోన్‌పై దాదాపు 750 డాలర్లు.. మన లెక్కల్లో ఏకంగా రూ.70 వేలకు పైగా లాభాన్ని యాపిల్ ఆర్జిస్తోంది.

భారత్‌లో ఐఫోన్ 18 ప్రో ధరల మోత

భారత మార్కెట్లో స్టోరేజ్ వేరియంట్ల వారీగా కంపెనీ నిర్ణయించిన ధరలు చూస్తే సామాన్యుడికి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. 256GB మోడల్‌కి రూ.1,64,900, 512GB మోడల్ కోసం రూ.1,89,900, 1TB వేరియంట్‌కి రూ.2,39,900, 2TB టాప్-ఎండ్ కోసం రూ.3,14,900 ధరలు నిర్ణయించారు. బేస్ మోడల్ నుంచి కేవలం స్టోరేజ్ పెంచుకుంటూ వెళ్లే కొద్దీ అదనంగా రూ.25 వేల నుంచి ఏకంగా రూ.75 వేల వరకు యూజర్స్ సమర్పించుకోవాల్సి వస్తోంది.

చిప్‌ల ధరల సాకుతో రెట్టింపు బాదుడు

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్ల డిమాండ్ పెరగడంతో మెమరీ చిప్‌ల ధరలు పెరిగిన మాట వాస్తవమే. గతంలో ఐఫోన్ 17 ప్రో 1TB కోసం కంపెనీకి 42 డాలర్లు ఖర్చవగా, ఐఫోన్ 18 ప్రోకి అది 192 డాలర్లకు చేరింది. అయితే, తమకు పెరిగిన ఖర్చును సాకుగా చూపిస్తూ, కస్టమర్ల నుంచి వసూలు చేసే ధరను అంతకు నాలుగు రెట్లు పెంచేసి తన లాభాన్ని మరింత పెంచుకునే జిమ్మిక్కును యాపిల్ అమలు చేస్తోంది. బ్రాండ్ క్రేజ్‌తో గుడ్డిగా కొనేస్తున్న యూజర్స్ బలహీనతను క్యాష్ చేసుకుంటూ.. స్టోరేజ్ పేరుతో సాగిస్తున్న ఈ దోపిడీపై టెక్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

#Apple Business Strategy#Apple#iPhone 18 Pro#iPhone 18 Pro Price#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి