Telangana Politics: శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత కేసీఆర్, ఆయన కుటుంబ భూ చిట్టాలు విప్పారు. అనంతరం మీడియా ముందుకొచ్చిన మాజీ మంత్రి హరీశ్‌రావు సీఎం ఆస్తుల లెక్కలు బయటపెట్టి ఎదురుదాడికి దిగారు. మైకుల ముందు నడిచిన ఈ హైవోల్టేజ్ ఆరోపణల యుద్ధం రాజకీయ వర్గాల్లో కాకరేపింది నిజమే కానీ ఈ పోరులో సామాన్య జనం ఎదుర్కొంటున్న అసలు సిసలు కష్టం మరుగున పడిపోయిందన్నది మాత్రం వాస్తవం.
నాయకులు వందల ఎకరాల ఆక్రమణలపై వాదులాడుకుంటుంటే.. తమకున్న రెండెకరాలు, ఓ గుంట జాగ అమ్ముకోలేక, కొనుక్కోలేక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న సామాన్యుడి గోడును పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
రాజకీయ రగడ వెనుక దాగిన అసలు సంక్షోభం
ప్రస్తుతం తెలంగాణలో 22A నిషేధిత భూముల వ్యవహారం ఒక పెను సంక్షోభంగా మారింది. అసలు ఈ సమస్యపై సమగ్ర చర్చ జరిగి బాధితులకు ఊరట దక్కుతుందని ప్రజలు ఆశించారు. కానీ ప్రజా సమస్యలను తీర్చాల్సిన చట్టసభ వేదిక.. ఇరుపార్టీల నేతల భూ బాగోతాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లకు వేదికగా మారిపోయింది.
ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు, మీడియా ముందు పెడుతున్న లెక్కలు టీవీల్లో హెడ్‌లైన్లుగా మారుతున్నాయే తప్ప, క్షేత్రస్థాయిలో సమస్యను పరిష్కరించడం లేదన్నది వాస్తవం. అసెంబ్లీలో నడిచిన ఈ రాజకీయ డ్రామాతో అసలు ఎజెండా ఎప్పుడో పక్కదారి పట్టిందని ప్రజా క్షేత్రంలో వినిపిస్తున్న విమర్శ.
రిజిస్ట్రేషన్ల కోసం ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు
రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది పేదలు, మధ్యతరగతి ప్రజలు 22A కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సొంత భూమి, పూర్వీకుల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి అని తెలిసినా.. ధరణి, రెవెన్యూ రికార్డుల్లో తప్పుడు ఎంట్రీల వల్ల ఆ భూములు 22A నిషేధిత జాబితాలోకి చేరిపోయాయి.
పిల్లల పెళ్లిళ్లు, అత్యవసర వైద్య ఖర్చులు, చదువుల ఫీజుల కోసం ఉన్న కాస్త భూమినో, ప్లాటునో అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో రెడ్ మార్క్ పడుతోంది. తహశీల్దార్ ఆఫీసులు, కలెక్టరేట్ల చుట్టూ దరఖాస్తులు పట్టుకుని నెలల తరబడి తిరుగుతున్నా అధికారుల నుంచి కనికరం దక్కడం లేదు. ఏళ్ల తరబడి కాగితాలు కదలక, ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియక మధ్యతరగతి జనం నిస్సహాయంగా రోదిస్తున్నారు.
నాయకులది వందల ఎకరాల లెక్క.. పేదోడికి గుంట జాగా చిక్కు
రాజకీయ నాయకులకు సంబంధించిన భూములు అధికార బలంతో సునాయాసంగా సమస్యల నుంచి విముక్తి పొందుతుంటే, సామాన్యుడి చిన్న సమస్య మాత్రం ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోవడం లేదు. అధికార ప్రతిపక్షాలు పరస్పరం విమర్శించుకోవడంలో చూపించిన ఆసక్తిని.. క్షేత్రస్థాయిలో 22A గందరగోళాన్ని తొలగించడంలో ఎందుకు చూపించడం లేదన్న ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి.
వందల ఎకరాల పంచాయితీలు ఎలా ఉన్నా.. ముందుగా తమ భూములకు విముక్తి కల్పించాలని తెలంగాణ ప్రజానీకం వేడుకుంటోంది. లీడర్ల భూముల గొడవలతో రాజకీయ ప్రయోజనాలు నెరవేరుతాయేమో కానీ, ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్న సామాన్యుడి కన్నీళ్లు తుడవకపోతే మాత్రం పాలకులకు ప్రజాక్షేత్రంలో గట్టి ఎదురుదెబ్బ తప్పదనే నిజం గుర్తుంచుకోవాలని జనం హెచ్చరిస్తున్నారు.









