తెలంగాణ

Kcr Farmhouse: ఎర్రవల్లిలో సర్వేయర్లను అడ్డుకున్న రైతులు, గ్రామస్తులు.. రెవెన్యూ అధికారులతో వాగ్వాదం

రచన: NK5 నిమిషాల పఠనం

Kcr Farmhouse: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ పరిసరాల్లో ప్రభుత్వ భూములపై సర్వే చేసేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులను గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. అసలు ఎందుకు సర్వే చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు.

Kcr Farmhouse: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ పరిసరాల్లో ప్రభుత్వ భూములపై సర్వే చేసేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులను గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. అసలు ఎందుకు సర్వే చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. ఎర్రవల్లి సర్వే నెంబర్ 325 భూములకు సంబంధించి ఎలాంటి వివాదం లేదని గ్రామస్తులు తేల్చి చెప్పారు. కేసీఆర్ పట్టా స్థలం మేరకు మాత్రమే ఉన్నారని.. ప్రభుత్వ భూమిలోకి రాలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ పాండవుల చెరువు తవ్వించడంతో వ్యవసాయం చేసుకుంటూ తాము జీవనం సాగిస్తున్నామని గ్రామస్తులు చెప్పారు.

తమకు తెలియకుండా తమ భూముల్లోకి వచ్చి అధికారులు సర్వే నిర్వహించడం ఏంటని ఎర్రవల్లి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 325 భూమిలో ఒక ఇంచు భూమిని కూడా కేసీఆర్ కొనుగోలు చేయలేదని వారు తేల్చి చెప్పారు. కేసీఆర్ ఎర్రవల్లికి వచ్చాకే తమ జీవితాల్లో వెలుగు వచ్చిందన్నారు. ఎర్రవల్లిలోని సర్వే నెంబర్ 325 లోని కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతాన్ని చదును చేయించి వ్యవసాయయోగ్యమైన భూమిగా మార్చి ఇచ్చారని రైతులు చెప్పారు.

అంతేకాదు కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుండి తమ పొలాల్లోకి నీళ్లు తరలించారని పేర్కొన్నారు. పాండవుల చెరువు రిజర్వాయర్ నిర్మించి తమకు నీళ్లు అందుబాటులోకి తెచ్చింది కేసీఆర్ అని రైతులు చెప్పారు. వందల ఏళ్లుగా తాము ఈ భూములను సాగు చేసుకుని జీవిస్తున్నామని, తమ భూములను ఇతరులకు ఇస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని రైతులు అన్నారు. ఇక్కడ ఒక్క ఇంచు భూమి కూడా తీసుకోని కేసీఆర్ పై అభాండాలు మోపడం సరైనది కాదన్నారు. ఇక్కడ వేరే వారికి భూములు ఇస్తే తిరుగుబాటు తప్పదని ఎర్రవల్లి రైతులు హెచ్చరించారు.

''ఇప్పుడు కొత్తగా సర్వే ఎందుకు చేస్తున్నారు? దేనికోసం చేస్తున్నారు? మాకు డౌట్లు ఉన్నాయి. ఈ భూమి వల్ల మీకు ఏం సమస్యలు వచ్చాయి? సర్వే నెంబర్ 325లో ఎవరైనా వచ్చి భూమిని కబ్జా చేశారా? రేవంత్ రెడ్డి చెప్పగానే మీరు వచ్చి సర్వే చేస్తారా? నిన్న మొన్న లేనిది ఈరోజు ఎందుకు సర్వే చేస్తున్నారు? సర్వే నెంబర్ 325 ఎక్కడికీ పోలేదు. ఇక్కడే ఉంది. మా భూములు ఎక్కడికీ పోలేదు. మంచిగానే ఉన్నాయి. మేము పంటలు పండించుకుంటున్నాం. ఇంతకుముందు ఎర్రవల్లి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? మీకు తెలియదా?'' అంటూ గ్రామస్తులు రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు.

కాగా, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. కేసీఆర్ ఫాంహౌస్ భూములపై విచారణ ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసరాల్లో ప్రభుత్వ భూముల వివరాలను రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు. మర్కుక్ మండలం ఎర్రవల్లి శివారులోని 325 సర్వే నెంబర్ భూమిలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. భూ రికార్డులను పరిశీలించారు.

#Kcr Farmhouse#Erravalli#Erravalli Farmers#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి