Gurukul Scam : తెలంగాణలోని సంక్షేమ గురుకులాలు, సర్కారు బడుల్లో చదువుకునే లక్షలాది మంది నిరుపేద విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటమాడుతోందని బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఐపీఎల్ మాదిరిగా గురుకుల కుంభకోణం సీజన్లు నడుస్తున్నాయని, ప్రస్తుతం మొదలైన ‘ఎపిసోడ్ 2’లో విద్యార్థులకు ఏకంగా కల్తీ సరుకులను వండిపెట్టే ఘోరమైన కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు.
రాష్ట్రంలో విద్యార్థుల ప్రాణాలు ఎంత పెద్ద ప్రమాదంలో పడ్డాయో చూపించేందుకే బీఆర్‌ఎస్ తరఫున ప్రత్యక్ష డెమో ఇచ్చేందుకు రెడీ అయ్యామని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. తమ పిల్లలకు మంచి భోజనం అందుతుందని, ప్రోటీన్లు, విటమిన్లు, మంచి పౌష్టికాహారం దొరుకుతుందనే నమ్మకంతోనే పేద తల్లిదండ్రులు గురుకులాలకు తమ పిల్లలను పంపిస్తున్నారని ఆయన గుర్తుచేశారు.
కానీ రేవంత్ రెడ్డి పాలనలో ఆ పిల్లల జీవితాలు పూర్తిగా అగమ్యగోచరంగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరు నెలలుగా రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉందని మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సీఎం.. విద్యాశాఖ, హోంశాఖలను తన చేతుల్లోనే పెట్టుకున్న తర్వాత రాష్ట్రంలో పిల్లల భద్రత గాల్లో దీపంగా మారిందని విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులంతా అప్రమత్తం కావాలని హెచ్చరించారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ నుంచి రాత్రి భోజనం వరకు విద్యార్థుల కంచంలో కల్తీ ఆహారమే దర్శనమిస్తోందని, నిరుపేద పిల్లల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్న ఈ దారుణాలపై తాము పోరాటం ఆపేది లేదని ఆయన తేల్చిచెప్పారు.








