తెలంగాణ

Telangana Politics : తెలంగాణలో కేసులు, ఫిర్యాదుల పర్వం.. ఇక రణరంగమేనా?

రచన: Mahesh6 నిమిషాల పఠనం

Telangana Politics : తెలంగాణ రాజకీయం అసెంబ్లీ గేట్లు దాటి కౌంటర్ కేసులు, పోలీస్ స్టేషన్ల పంచాయితీల వైపు మళ్లాయి. నిన్నటిదాకా మైకుల ముందు మాటల యుద్ధానికే పరిమితమైన నేతలు.. ఇప్పుడు ప్రత్యర్థులపై న్యాయపరంగా ప్రతీకారం తీర్చుకునేందుకు పోలీసుల దగ్గరికి వెళ్తున్నారు.

Telangana Politics : తెలంగాణ రాజకీయం అసెంబ్లీ గేట్లు దాటి కౌంటర్ కేసులు, పోలీస్ స్టేషన్ల పంచాయితీల వైపు మళ్లాయి. నిన్నటిదాకా మైకుల ముందు మాటల యుద్ధానికే పరిమితమైన నేతలు.. ఇప్పుడు ప్రత్యర్థులపై న్యాయపరంగా ప్రతీకారం తీర్చుకునేందుకు పోలీసుల దగ్గరికి వెళ్తున్నారు. "నువ్వు నాపై కంప్లైంట్ ఇస్తే.. నీపై అంతకంటే పెద్ద సెక్షన్లతో కేసు పెట్టిస్తా" అన్నట్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీ ఎఫ్‌ఐఆర్‌లతో రణరంగాన్ని తలపిస్తున్నారు.

అసెంబ్లీ నిరసన.. సైఫాబాద్‌లో కేసుల రచ్చ

శాసనసభ వేదికగా మొదలైన రాజకీయ సెగలు ఇప్పుడు పోలీస్ స్టేషన్లను చుట్టుముట్టాయి. నల్ల చొక్కాలతో నిరసన తెలిపేందుకు సిద్ధమైన గులాబీ దళానికి, అసెంబ్లీ వద్ద మోహరించిన భద్రతా బలగాలకు మధ్య జరిగిన తోపులాటే ఈ కేసుల పర్వానికి తెరలేపింది. విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌పై అనుచితంగా ప్రవర్తించారంటూ కేటీఆర్, హరీష్ రావు సహా కీలక బీఆర్ఎస్ నేతలపై సైఫాబాద్ పోలీసులు నాన్ బెయిలబుల్ స్థాయి ఆరోపణలతో కేసులు నమోదు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.

మరోవైపు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను అగౌరవపరిచారంటూ ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, నవీన్ కుమార్ రెడ్డిలను అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. కోర్టు రిమాండ్ తిరస్కరించి వారిని సొంత పూచీకత్తుపై రిలీజ్ చేసినప్పటికీ, స్పీకర్ అంశాన్ని కాంగ్రెస్ దళిత అస్త్రంగా మార్చి దూకుడు పెంచింది. సీఎం రేవంత్ రెడ్డిని దూషించారంటూ కేటీఆర్‌పై ఎంపీ మల్లు రవి న్యాయపోరాటానికి దిగడంతో కాంగ్రెస్ వ్యూహం స్పష్టమైందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

'ఈటెకు ఈటె.. కేసుకు కేసు'

అధికార పక్షం జోరుకు ఏమాత్రం తగ్గకుండా గులాబీ దళం కూడా దూకుడు పెంచింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా, సిద్దిపేట నుంచి ఖమ్మం దాకా అన్ని జిల్లాల్లో స్థానిక నాయకులు కౌంటర్ కంప్లైంట్లతో విరుచుకుపడ్డారు. బోయినపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడికి కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తన అనుచరులను పురిగొల్పారని ఆరోపిస్తూ మన్నె క్రిశాంక్ నేరుగా పోలీసులకే ఫిర్యాదు చేయడం తాజా పరిణామాల తీవ్రతను పెంచింది.

సోషల్ మీడియా వేదికగా తమ ప్రజాప్రతినిధులపై ఏఐ (AI) మార్ఫింగ్ చిత్రాలతో దాడి చేస్తున్నారని ఏకంగా డీజీపీ కార్యాలయాన్ని ఆశ్రయించింది బీఆర్ఎస్ శాసనసభా పక్షం. దీనికితోడు మహిళా కమిషన్‌ వేదికగా ఇరుపక్షాలు మహిళా సెంటిమెంట్‌ను తెరపైకి తెచ్చి రచ్చకెక్కాయి. మహిళా పోలీసులపై గులాబీ నేతలు దురుసుగా ప్రవర్తించారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొరపెట్టుకుంటే, తమ మహిళా ప్రజాప్రతినిధులనే పోలీసులు అమానుషంగా నెట్టేశారని బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది.

చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కాంగ్రెస్ సర్కార్ హెచ్చరిస్తుంటే.. ప్రజా సమస్యలను ప్రశ్నిస్తున్న గొంతును నొక్కేందుకే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ప్రధాన ప్రతిపక్షం మండిపడుతోంది. సాధారణ ఎన్నికలకు ఇంకా ఏళ్ల సమయం ఉన్నప్పటికీ, గల్లీ స్థాయి ఫిర్యాదుల నుంచి డీజీపీ ఆఫీసు వరకు సాగుతున్న ఈ పోటాపోటీ కేసుల తీరును చూస్తుంటే తెలంగాణలో అప్పుడే ప్రతీకార రాజకీయాల యుద్ధం పరాకాష్టకు చేరినట్లు స్పష్టమవుతోంది.

#Telangana Politics#Telangana Political News#Telangana Congress#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి