తెలంగాణ

Harish Rao : పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి.. 22-ఏ పై హరీశ్‌రావు ఆవేదన

రచన: Mahesh9 నిమిషాల పఠనం

Harish Rao : తెలంగాణలో 22-ఏ భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత భూమి అనేది ప్రజల హక్కు అనే విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలని అన్నారు.

Harish Rao : తెలంగాణలో 22-ఏ భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత భూమి అనేది ప్రజల హక్కు అనే విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలని అన్నారు. వ్యాపారంలో ఉన్నప్పుడు భూమి ఒక ఆస్తి కావచ్చని.. కానీ ప్రభుత్వంలో భూమి అనేది ప్రజల హక్కు అనే సోయి మరిచి జనాల భూములను నిషేధిత జాబితాలో చేర్చి లక్షలాది మంది జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటుందని విమర్శించారు.

22-ఏ కారణంగా పిల్లల చదువులు, పెళ్లిళ్లు కూడా ఆగిపోతున్నాయని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో ఓ ఆడపిల్ల పెళ్లి ఆగిపోతే ఊరంతా కలిసి ఆ వివాహాన్ని జరిపించిందని చెప్పారు. అయితే ఇంకా ఎన్ని పెళ్లిళ్లు ఇలా ఆగిపోయాయి? ఎన్ని గుండెలు పగిలిపోయాయి? ఎన్ని చదువులు నిలిచిపోయాయో ప్రభుత్వం ఆలోచించాలని అన్నారు.

హెచ్‌సీయూకు సంబంధించిన 400 ఎకరాల భూమిని కాంగ్రెస్ సర్కార్ కబ్జా పెట్టే కుట్ర చేసిందని హరీశ్‌రావు ఆరోపించారు. ఆ 400 ఎకరాలను బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కుదువపెట్టి రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చారని, 9.5 శాతం వడ్డీకి రుణం తీసుకుని బ్రోకర్‌కు రూ.200 కోట్ల లంచం ఇచ్చారని విమర్శించారు.

మేడ్చల్ జిల్లాలో 8 వేల ఎకరాల భూములను బీఎస్ఈలో కుదువపెట్టి మరో రూ.10 వేల కోట్ల అప్పులు తెచ్చారని అన్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన వంద ఎకరాలను తీసుకున్నారని, సీఎం తన అల్లుడికి, తమ్ముళ్లకు వందల ఎకరాలు కట్టబెట్టారని ఆరోపించారు. పాలిటెక్నిక్ కాలేజీల భూములపై కూడా రేవంత్‌రెడ్డి కన్ను పడిందని, ఆ భూముల కోసమే పాలిటెక్నిక్ కాలేజీలపై కత్తి పెట్టారని హరీశ్‌రావు విమర్శించారు.

హిల్ట్ పాలసీ వెనుక కూడా భూమే ఉందని, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక భూమి అంశమే ఉంటోందని ఆరోపించారు. హైడ్రా వెనుక కూడా భూదోపిడీనే ఉందని చెప్పారు. బడాబడా బాబుల ఇళ్లు హైడ్రాకు కనిపించవని విమర్శించారు.

మూసీ సుందరీకరణ పేరుతో అటూ ఇటూ వంద ఎకరాల చొప్పున ఎందుకు తీసుకోవాలని హరీశ్‌రావు ప్రశ్నించారు. మల్లన్నసాగర్ నీటిని తీసుకొచ్చి మూసీలో పోస్తే సరిపోదా? దానికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ వెనుక 3 వేల ఎకరాల భూ వ్యాపారం ఉందని ఆరోపించారు. 280 ఎకరాల భూమి కోసం మెట్రోతో తెగదెంపులు చేసుకున్నారని విమర్శించారు.

22-ఏ వెనుక కూడా భూమే ఉందని హరీశ్‌రావు ఆరోపించారు. ప్రజల వారసత్వ సంపదను 22-ఏలో చేర్చారని అన్నారు. ఊళ్లకు ఊళ్లు, ప్రజల ఆస్తులు, అపార్ట్‌మెంట్లు, కాలనీలను అడ్డగోలుగా నిషేధిత జాబితాలో చేర్చారని విమర్శించారు.

“నిన్నటి వరకు అది నీ భూమి.. పొద్దున నిషేధిత భూమి” అన్నట్టుగా రాష్ట్రంలో పరిస్థితి తయారైందన్నారు. ఒక కలం పోటుతో భూమిని నిషేధిత జాబితాలోకి మార్చేశారని విమర్శించారు. మధ్యతరగతి వాళ్లు పాత ఇల్లు కూలగొట్టుకొని కొత్త ఇల్లు కట్టుకుందామని అనుకునేలోపే రాత్రికి రాత్రి ఆ భూమిని నిషేధిత జాబితాలో చేర్చారని అన్నారు.

ప్రజల చేతిలో పట్టా ఉన్నా వారి భూమికి విలువ లేకుండా పోయిందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. జనాల ఆస్తులపై ప్రభుత్వం అనిశ్చితి కత్తిని వేలాడదీసిందని విమర్శించారు.

రాష్ట్రంలో 30 శాతం కమిషన్ పాలన నడుస్తోందని హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. ఇది 30 పర్సెంట్ గవర్నమెంట్ అని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారని చెప్పారు. సీఎం, రెవెన్యూ మంత్రి తమ బాధ్యతలను విస్మరించి సొంత ఆస్తులు, రెవెన్యూ పెంచుకోవడంపై దృష్టి పెట్టారని అన్నారు. హామీలు ఇవ్వకపోయినా కొత్త పథకాలు తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ అని, ఇచ్చిన హామీలకు పంగనామాలు పెట్టిన మోసగాడు రేవంత్‌రెడ్డి అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌కు ఓటు వేయకుండా తప్పు చేశామని రైతులు బాధపడుతున్నారని అన్నారు.

పొంగులేటి రాజీనామా డిమాండ్

22-ఏలో కొత్తగా ఏమీ చేర్చలేదని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెబుతున్నారని.. ఇది పచ్చి అబద్ధమని హరీశ్‌రావు మండిపడ్డారు. కొత్తగా 22-ఏలో ఏమీ పెట్టలేదని చెప్పడం బొంకులేటి బొంకుతున్న మాటలేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి పదవికి పొంగులేటి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

“ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే” అన్నట్టుగా కాంగ్రెస్ బురద రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఎప్పటికీ తమను (బీఆర్ఎస్ వాళ్లను) తిట్టుకుంటూ బతుకుతారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో ఇలాంటి పరిస్థితి ఉండేదా? అని నిలదీశారు. తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించిందని.. కాంగ్రెస్ సర్కార్ సమస్యలను సృష్టించిందని విమర్శించారు.

జీవో 179పై హరీశ్‌రావు ప్రస్తావన

2025 డిసెంబర్ 31న జీవో నంబర్ 179 వచ్చిందని హరీశ్‌రావు తెలిపారు. 22-ఏ కోసం భూముల లెక్కలు చెప్పాలని కలెక్టర్లను ఆదేశించారని అన్నారు. అంతకుముందు 2025 సెప్టెంబర్ 11న కొత్త ప్రొహిబిషన్ లిస్ట్ తయారు చేయాలని ఆదేశాలు వచ్చాయని పేర్కొన్నారు. 2025 నవంబర్ 11న జనగామ జిల్లా కలెక్టర్ జాబితాను తయారు చేశారని, అనంతరం భూములను నిషేధిత జాబితాలో చేర్చుతూ గెజిట్ విడుదల చేశారని అన్నారు. ఇదే విధంగా అన్ని జిల్లాల కలెక్టర్లు గెజిట్లు విడుదల చేశారని హరీశ్‌రావు వివరించారు.

సిర్పూర్‌లో 30 వేల ఎకరాలు.. మంచిర్యాలలో 11 వేల ఇళ్లు

సిర్పూర్‌ కాగజ్‌నగర్ నియోజకవర్గంలో ఏకంగా 30 వేల ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. అది ట్రైబల్ ఏరియా అని, అక్కడ ఉన్నవారంతా పేద రైతులేనని, ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంచిర్యాల నియోజకవర్గంలో 11 వేల ఇళ్లను నిషేధిత జాబితాలో చేర్చారని విమర్శించారు. ప్రజల భూములు, ఇళ్లు, ఆస్తులపై ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల వారి జీవితాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని అన్నారు.

భూమి అనేది కేవలం ఆస్తి కాదని.. అది ఒక రైతుకు జీవనాధారం, పేదవాడికి జీవితకాల పొదుపు, మధ్యతరగతి కుటుంబానికి పిల్లల భవిష్యత్తుపై భరోసా అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వం భూమిని మార్కెట్ వస్తువుగా కాకుండా ప్రజల హక్కుగా చూడాలని డిమాండ్ చేశారు.

#Harish Rao#Telangana Politics#BRS#BRS Party#22-A Lands#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి