తెలంగాణ

TG : సభకు రాని కొండా సురేఖ.. సొంత ఎజెండాతోనే ముందుకు!

రచన: Mahesh5 నిమిషాల పఠనం

TG : మంత్రివర్గం నుంచి తొలగించినప్పటి నుంచి సీనియర్ నాయకురాలు కొండా సురేఖ అడుగులు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పదవి ఊడగానే "త్వరలోనే నా దారెంటో చూపిస్తా" అంటూ హెచ్చరికలు చేసిన సురేఖ, ఆ తర్వాత మిన్నకుండిపోవడం వెనుక ఉన్నది నిస్తేజం కాదు...

TG : మంత్రివర్గం నుంచి తొలగించినప్పటి నుంచి సీనియర్ నాయకురాలు కొండా సురేఖ అడుగులు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పదవి ఊడగానే "త్వరలోనే నా దారెంటో చూపిస్తా" అంటూ హెచ్చరికలు చేసిన సురేఖ, ఆ తర్వాత మిన్నకుండిపోవడం వెనుక ఉన్నది నిస్తేజం కాదు... విస్ఫోటనానికి ముందున్న నిశ్శబ్దమేనా అనే సందేహాలు స్టార్ట్ అయ్యాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో, కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ సభకు విధిగా హాజరవుతుంటే సురేఖ మాత్రం అసెంబ్లీ గేటు కూడా తొక్కకపోవడం అధికార పార్టీలో తీవ్ర అంతర్మథనానికి దారితీసింది.

అవమాన భారమా? అధిష్ఠానంపై నిరసన గళమా?

శాసనసభ సమావేశాలు ప్రారంభమై ఐదు రోజులు కావస్తున్న కొండా సురేఖ మాత్రం అసెంబ్లీ ముఖం చూడలేదు. కనీసం సభ్యులతో కలిసి కూర్చోవాల్సిన సీఎల్పీ (CLP) సమావేశాన్ని కూడా ఆమె ఖాతరు చేయలేదు. నిన్నటివరకు కేబినెట్ ర్యాంకులో దర్జాగా తిరిగిన ఆమె, ఇప్పుడు వెనుక బెంచీల్లో కూర్చోవాల్సిన దుస్థితి రావడం దీనికి ఒక కారణంగా చెబుతుంటే, తనపై వేటు వేసిన సొంత ప్రభుత్వాన్ని బహిరంగంగానే వెలివేసే వ్యూహంలో ఆమె ఉన్నారన్నది మరో వాదన. సభకు హాజరుకాకపోవడం ద్వారా రేవంత్ రెడ్డి నాయకత్వంపై తనకున్న తీవ్ర అసంతృప్తిని, నిరసనను ఆమె ఎలాంటి మాటలు లేకుండానే హైకమాండ్‌కు గట్టిగానే వినిపిస్తున్నారని సురేఖ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

ఓఎస్డీ వివాదం.. పోలీసుల 'టార్గెట్' వెనుక ఎవరున్నారు?

సురేఖ అసంతృప్తికి కేవలం మంత్రి పదవి ఊడటం మాత్రమే కారణం కాదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఆమె మాజీ ఓఎస్డీకి కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, పోలీసు యంత్రాంగం మాత్రం ఇప్పటికీ వేధింపులు కొనసాగిస్తోందని కోండా వర్గం రగిలిపోతోంది. బుధవారం సైతం పోలీసుల నుంచి తమకు తీవ్రమైన వేధింపులు ఎదురయ్యాయని సురేఖ తన అత్యంత సన్నిహితుల ఎదుట వాపోయినట్లు సమాచారం. సొంత ప్రభుత్వం అధికారంలో ఉండగానే తనను, తన అనుచరగణాన్ని పోలీసులతో ఉక్కిరిబిక్కిరి చేయిస్తున్నారనే భావన ఆమెలో మరింత తీవ్రస్థాయి ఆగ్రహాన్ని పెంచుతోంది.

సీఎం చేతుల్లోకి కీలక శాఖలు...

మరోవైపు సురేఖ చేజారిన అటవీ, దేవాదాయ శాఖలను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకోవడం మరో కీలక పరిణామం. సురేఖను మంత్రివర్గం నుంచి పక్కనబెట్టడమే కాకుండా, ఆమె నిర్వహించిన శాఖలన్నింటినీ సీఎం పర్యవేక్షణలోకి తీసుకోవడం ద్వారా ఆమెకు ప్రభుత్వం నుంచి పూర్తిగా దారులు మూసేశారనే సంకేతాలు వెళ్లాయి.

ఎప్పుడూ దూకుడైన రాజకీయాలు చేసే కొండా దంపతులు ప్రస్తుతానికి కామ్‌గా కనిపిస్తున్నా, ఈ మౌనం వెనుక భారీ ప్రణాళికే దాగి ఉందన్నది రాజకీయ వర్గాల అంచనా. అసెంబ్లీని బాయ్‌కాట్ చేయడం ద్వారా ప్రభుత్వానికి దూరంగా జరిగిన సురేఖ, సరైన ముహూర్తం చూసి కాంగ్రెస్‌పై ఏ తరహా బాంబు పేలుస్తారో అన్న ఉత్కంఠ ఇప్పుడు గాంధీభవన్‌లో మొదలైంది.

#Konda Surekha#Telangana Politics#Telangana Congress#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి