రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్న 22A నిషేధిత భూముల వ్యవహారంపై బిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ వేదికగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల నుంచి వందలాది మంది 22A భూబాధితులు శుక్రవారం తెలంగాణ భవన్‌కు భారీగా పోటెత్తారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులను నేరుగా కలసి తమ భూముల పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమ హక్కు భుక్తంలో ఉన్న భూములను రీ-సర్వేల పేరుతో అక్రమంగా కబ్జా చేస్తున్నారని బాధితులు ఆరోపించారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తమ భూములకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉన్నామని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనే తమ స్థలాలను 22A జాబితాలోకి చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు వాపోయారు. కాంగ్రెస్ నాయకులు, అధికారుల కుమ్మక్కుతోనే తమ పాత పట్టా భూములు, అసైన్డ్ భూములు మాయమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో తమ భూములను కాపాడి, న్యాయపోరాటం చేసేందుకు బీఆర్‌ఎస్ పార్టీ తమకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలని ఈ సందర్భంగా బాధితులు విజ్ఞప్తి చేశారు.
బాధితుల వినతుల అనంతరం, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న 22A నిషేధిత భూముల స్కామ్‌ను ఎండగడుతూ మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ఇచ్చారు. జిల్లాల వారీగా 22A పరిధిలోకి బలవంతంగా నెట్టివేసిన భూముల వివరాలు, వాటి వెనుక ఉన్న కాంగ్రెస్ పెద్దల అక్రమాలను ఆధారాలతో సహా ఆయన బట్టబయలు చేశారు. ప్రభుత్వం సర్వే నంబర్లను మార్చి విలువైన భూములను తమ అనుకూల వర్గాలకు కట్టబెట్టేందుకు పెద్ద కుట్ర చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు.
ఈ భూకుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులను తేల్చే వరకు శాసనసభ లోపలా, బయటా పోరాటం కొనసాగిస్తామని బీఆర్‌ఎస్ నాయకత్వం స్పష్టం చేసింది. బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందించడంతో పాటు, రెవెన్యూ కార్యాలయాల ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఈ 22A భూ వివాదం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య పీక్ స్టేజ్‌కి చేరుకుని రాజకీయ వాతావరణాన్ని తీవ్రంగా వేడెక్కించింది.









