International

ఢిల్లీకి VVIP అతిథులు.. నోరూరించే విందు సిద్ధం!

రచన: Kashi11 నిమిషాల పఠనం

రాజకీయ నాయకులు టేబుల్‌పై ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, భద్రత వంటి అంశాలపై చర్చించబోతున్నారు. అదే సమయంలో వారి ప్లేట్‌పై మాత్రం భారత్ తన సంప్రదాయాన్ని, సంస్కృతిని, ఆతిథ్యాన్ని పరిచయం చేయబోతోంది. అందుకే ఈసారి బ్రిక్స్ సమ్మిట్‌లో దౌత్యంతో పాటు.. భారతీయ రుచికి కూడా ఓ ప్రత్యేక స్థానం దక్కబోతోంది.

ఓవైపు VVIP అతిథులు

మ‌రోవైపు నోరూరించే వంట‌కాలు

ఢిల్లీలో భార‌తీయ వంట‌కాల ఘుమ‌ఘుమ‌లు

VVIPల‌కు ప‌సందైన విందు సిద్ధం

ఢిల్లీ రోడ్లపై ఇప్పుడు ఎక్కడ చూసినా భద్రతే కనిపిస్తోంది. వీఐపీ కాన్వాయ్‌ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. ట్రాఫిక్ ఆంక్షలు.. భారీగా మోహరించిన భద్రతా బలగాలు.. యాంటీ డ్రోన్ సిస్టమ్స్‌తో రాజధాని మొత్తం హై అలర్ట్‌లో ఉంది. కానీ దేశ రాజధానిలో మరో చోట మాత్రం ఇంకో రకమైన హడావుడి నడుస్తోంది. ఢిల్లీలోని అత్యంత విలాసవంతమైన హోటళ్ల కిచెన్లలో చెఫ్‌లు బిజీగా ఉన్నారు. కారణం.. సాధారణ అతిథులు కాదు. ప్రపంచ దేశాల నుంచి వస్తున్న వీవీఐపీ అతిథులు. వాళ్ల కోసం నోరూరించే వంటకాలు సిద్ధమవుతున్నాయి. భారతీయ రుచులను ప్రపంచ నేతలకు పరిచయం చేసేందుకు ప్రత్యేక మెనూలు రెడీ అవుతున్నాయి.

సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ లీడర్స్ సమ్మిట్ జరగనుంది. ఇప్పటికే వివిధ దేశాల ప్రతినిధులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. 2023 జీ20 సమ్మిట్ తర్వాత దేశ రాజధానిలో జరుగుతున్న అతిపెద్ద దౌత్య కార్యక్రమాల్లో ఇది ఒకటి. అందుకే భద్రత నుంచి అతిథుల బస వరకు ప్రతి అంశాన్నీ అత్యంత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ఏర్పాట్లలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో అంశం మాత్రం హోటళ్లలో సిద్ధమవుతున్న ప్రత్యేక విందు.

ఎవ‌రి బ‌స ఎక్క‌డ‌..?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఐటీసీ మౌర్యలో, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తాజ్ ప్యాలెస్‌లో బస చేయనున్నట్లు తెలుస్తోంది. యూఏఈ ప్రతినిధులు ది లీలా ప్యాలెస్‌లో, ఈజిప్టు ప్రతినిధులు షెరటన్ న్యూఢిల్లీలో ఉండనున్నారు. ది లలిత్, తాజ్ మహల్, ది ఇంపీరియల్ వంటి ప్రముఖ హోటళ్లు కూడా వివిధ దేశాల ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ హోటళ్లలో గదులు సిద్ధం చేయడం ఎంత ముఖ్యమో.. అతిథుల ప్లేట్‌లో ఏం ఉండాలన్నది కూడా అంతే కీలకంగా మారింది.

ది లలిత్ న్యూఢిల్లీ అయితే బ్రిక్స్ సమ్మిట్ కోసం వారాల ముందుగానే సన్నాహాలు మొదలుపెట్టింది. వంటకాల కోసం ప్రత్యేకంగా పదార్థాల సేకరణ, మెనూ ట్రయల్స్, టేస్టింగ్స్ నిర్వహించడంతో పాటు డెలిగేషన్ల అవసరాలకు అనుగుణంగా సర్వీస్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అయితే ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే అతిథులకు వారి వారి దేశాల వంటకాలను వడ్డించడం కంటే.. భారత్‌కు వచ్చిన అతిథులు భారతదేశపు అసలైన రుచిని ఆస్వాదించి వెళ్లాలన్నదే హోటల్ ఆలోచన.

భార‌తీయ వంట‌కాలే క్రేజీ!

మెనూలో భారతీయ వంటకాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. గలౌటి కబాబ్స్, తందూరీ బ్రెడ్స్‌తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల వంటకాల నుంచి స్ఫూర్తి పొందిన ప్రత్యేక వంటకాలు అతిథుల కోసం సిద్ధమవుతున్నాయి. ఈసారి మిల్లెట్స్‌కు కూడా ప్రత్యేక స్థానం కల్పించారు. సంప్రదాయ భారతీయ రుచితో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా పరిచయం చేయాలన్న ఉద్దేశంతో మిల్లెట్ ఆధారిత వంటకాలను మెనూలో చేర్చారు.

బ్రిక్స్ స్ఫూర్తితో కొన్ని ప్రత్యేక వంటకాలను కూడా రూపొందించారు. మిసో పేస్ట్‌తో తయారు చేసిన బ్రైజ్డ్ ఎగ్‌ప్లాంట్, సిమ్మర్డ్ చైనీస్ క్యాబేజీ, కిడ్నీ బీన్స్‌ను జపనీస్ స్టైల్‌లో తయారు చేసిన ప్రత్యేక వంటకం వంటి డిష్‌లు ఇందులో ఉన్నాయి. భారతీయ ఆతిథ్యానికి అంతర్జాతీయ రుచులను జోడిస్తూ.. వేర్వేరు దేశాల నుంచి వచ్చిన అతిథులను ఒకే టేబుల్ దగ్గరకు తీసుకురావాలన్న ఆలోచన ఇందులో కనిపిస్తోంది.

ది లీలా ప్యాలెస్ న్యూఢిల్లీ కూడా అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆయా దేశాల ప్రతినిధుల అభిరుచులు, ఆహారపు అలవాట్లు, ప్రత్యేక అవసరాలను ముందుగానే తెలుసుకుని వాటికి అనుగుణంగా మెనూను సిద్ధం చేస్తున్నారు. భారతీయ గ్యాస్ట్రోనమీకి ప్రధాన స్థానం ఇస్తూనే.. అంతర్జాతీయ అతిథులకు పరిచయమైన రుచులను కూడా అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. అతిథులు గదిలోకి వెళ్లిన తర్వాత కూడా భారతీయ రుచి వాళ్లను పలకరించనుంది. మిల్లెట్ కుకీస్, హ్యాండ్‌మేడ్ గ్రానోలా బార్స్, వెల్‌నెస్ ఇన్ఫ్యూషన్స్ వంటి ప్రత్యేక ఇన్‌రూమ్ ట్రీట్స్ సిద్ధంగా ఉన్నాయి. అంతేకాదు.. గులాబీ, కుంకుమపువ్వు, యాలకుల రుచులతో తయారు చేసిన ప్రత్యేకమైన ఎడిబుల్ లోటస్‌ను కూడా అతిథులకు అందించనున్నారు. భారతీయ సంప్రదాయాన్ని ఒక అందమైన తినే కళాఖండంగా మార్చినట్టుగా ఈ ఏర్పాటును చెప్పొచ్చు.

ఇక తాజ్ మహల్ న్యూఢిల్లీలో మాత్రం ఆతిథ్యానికి ఇంకాస్త వ్యక్తిగతమైన టచ్ ఇచ్చారు. “Tradition to Table” పేరుతో తాజ్ చెఫ్‌లు తమ తల్లుల నుంచి నేర్చుకున్న వంటకాల ఆధారంగా ప్రత్యేక కలెక్షన్‌ను సిద్ధం చేశారు. అంటే ప్రపంచ నేతలకు కేవలం ఓ ఖరీదైన హోటల్ వంటకాన్ని అందించడం కాదు.. భారతీయ కుటుంబాల్లో తరతరాలుగా వస్తున్న రుచుల కథను కూడా పరిచయం చేయబోతున్నారు.

కశ్మీర్‌కు చెందిన స్పైస్డ్ వాల్‌నట్స్ నుంచి పురానీ ఢిల్లీ మైదా కాజు వరకు.. మహారాష్ట్ర భాకర్‌వడీ నుంచి రాజస్థానీ మినీ కచోరీ వరకు.. బెంగాల్ కుచో నిమ్కీ నుంచి తమిళనాడు మురుక్కు వరకు ఆరు ప్రాంతాల సంప్రదాయ రుచులను ఒకే కలెక్షన్‌లో అందించనున్నారు. ఒక చిన్న స్నాక్ ప్లేట్‌లోనే దేశంలోని వివిధ ప్రాంతాల రుచులను చూపించే ప్రయత్నం ఇది. భారత్ అంటే కేవలం ఒక ప్రాంతం కాదని.. ఎన్నో సంస్కృతులు, ఎన్నో సంప్రదాయాలు, ఎన్నో రుచుల కలయిక అని చెప్పే విధంగా ఈ మెనూ సిద్ధమవుతోంది.

హోట‌ళ్ల‌లో నో రూమ్స్..!

ఇక బ్రిక్స్ సమ్మిట్ కారణంగా ఢిల్లీలోని లగ్జరీ హోటళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. విదేశీ ప్రతినిధులు, భద్రతా సిబ్బంది, మీడియా ప్రతినిధులు, ఇతర అధికారుల రాకతో హోటల్ రూమ్‌లకు డిమాండ్ పెరిగింది. కొన్ని ప్రముఖ హోటళ్లలో రూమ్‌లు దొర‌క‌డం లేద‌ట‌. ది లలిత్‌లోని 460 గదుల్లో దాదాపు 90 శాతం సమ్మిట్ సమయంలో ఆక్యుపెన్సీలో ఉండనున్నట్లు సమాచారం. సాధారణ రోజులతో పోలిస్తే రూమ్ టారిఫ్‌లు కూడా గణనీయంగా పెరిగాయి.

ఒకవైపు ఢిల్లీ రోడ్లపై కట్టుదిట్టమైన భద్రత.. మరోవైపు ప్రపంచ నేతల కోసం సిద్ధమవుతున్న విలాసవంతమైన గదులు.. ఇంకోవైపు కిచెన్లలో గంటల తరబడి కష్టపడుతున్న చెఫ్‌లు. బ్రిక్స్ సమ్మిట్ కోసం జరుగుతున్న ఏర్పాట్లు ఇలా ఎన్నో కోణాలను కలిగి ఉన్నాయి. భద్రతా ఏర్పాట్లు ప్రపంచానికి కనిపిస్తాయి. దౌత్య చర్చలు కూడా వార్తల్లో నిలుస్తాయి. కానీ ఆ అతిథుల ముందు పెట్టే ఒక్క ప్లేట్ భారతదేశం గురించి మరో కథ చెప్పనుంది.

రాజకీయ నాయకులు టేబుల్‌పై ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, భద్రత వంటి అంశాలపై చర్చించబోతున్నారు. అదే సమయంలో వారి ప్లేట్‌పై మాత్రం భారత్ తన సంప్రదాయాన్ని, సంస్కృతిని, ఆతిథ్యాన్ని పరిచయం చేయబోతోంది. అందుకే ఈసారి బ్రిక్స్ సమ్మిట్‌లో దౌత్యంతో పాటు.. భారతీయ రుచికి కూడా ఓ ప్రత్యేక స్థానం దక్కబోతోంది.

ఢిల్లీ సిద్ధమైంది. ప్రపంచ నేతలు వస్తున్నారు. భద్రత కట్టుదిట్టమైంది. కాన్వాయ్‌లు రెడీ అయ్యాయి. హోటళ్లు ముస్తాబయ్యాయి. మరి అతిథుల కోసం సిద్ధమైన ఆ విందు ఎలా ఉండబోతోందో చూడాలి. ఒక విషయం మాత్రం ఖాయం.. బ్రిక్స్ టేబుల్‌పై ఈసారి రాజకీయ చర్చలతో పాటు.. నోరూరించే భారతీయ రుచులు కూడా హాట్ టాపిక్ కానున్నాయి..!

#BRICS Summit#BRICS Summit 2026#BRICS India#BRICS Delhi#BRICS Leaders Summit#Narendra Modi#Vladimir Putin#Xi Jinping#Delhi Hotels#Indian Cuisine#VVIP Dinner#BRICS Dinner#India Hospitality#Delhi Summit#Indian Food#Diplomatic Dinner#Bharat Mandapam#New Delhi#Global Leaders#BRICS News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి