సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న '1980ల ఏఐ ఫొటో ట్రెండ్' భారత రాజకీయాల్లో కొత్త రచ్చకు దారితీసింది. నెటిజన్లు, ప్రముఖులు తమ నేటి ఫొటోలను 1980ల కాలంనాటి వింటేజ్ లుక్‌లోకి మార్చుకునే సరదా ట్రెండ్‌గా ప్రారంభమైన ఈ ప్రక్రియ, చివరకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పరస్పర విమర్శలు, ఏఐ మీమ్ వార్‌గా పరిణమించింది. ప్రధాన రాజకీయ పార్టీల సోషల్ మీడియా హ్యాండిల్స్ పరస్పరం విమర్శలు గుప్పించుకోవడానికి ఈ ఏఐ చిత్రాలను వాడటంతో సోషల్ మీడియా వేదికలు వేడెక్కాయి.

ఈ వివాదానికి కాంగ్రెస్ కేరళ యూనిట్ షేర్ చేసిన ఒక ఏఐ చిత్రం పునాది వేసింది. 1980ల నాటి గుజరాత్ వీధి అని క్యాప్షన్ ఇస్తూ, మారుతి సుజుకి ఓమ్ని వ్యాన్ ముందరి సీట్లో ఒక వ్యక్తి కూర్చుని ఉన్న ఫొటోను షేర్ చేసింది. 80వ దశకంలో ప్రముఖంగా ప్రాచుర్యం పొందిన ఈ వ్యాన్‌ను పాత సినిమాల్లో కిడ్నాపులకు ఉపయోగించే వాహనంగా చూపేవారు. ఈ మీమ్ ద్వారా గుజరాత్‌ను కాంగ్రెస్ రాజకీయంగా లక్ష్యంగా చేసుకుందనే విమర్శలు వ్యక్తమయ్యాయి.

దీనికి బదులుగా బీజేపీ కౌంటర్ పోస్టులతో విరుచుకుపడింది. బీజేపీ తెలంగాణ యూనిట్ ఓ మహిళ బార్ టేబుల్‌పై డ్యాన్స్ చేస్తున్నట్టు ఉన్న ఏఐ చిత్రాన్ని షేర్ చేసి "లుసియానా, ఇటలీ - 1970లు" అని శీర్షిక ఉంచింది. కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ జన్మస్థలం ఆధారంగా ఈ పోస్ట్ పెట్టారనేది స్పష్టమైంది. అటు బీజేపీ గుజరాత్ యూనిట్ మరింత వివాదాస్పదంగా, సోనియా గాంధీని పోలిన రూపంతో అరకొర దుస్తుల్లో మద్యం గ్లాస్‌తో ఉన్న చిత్రాన్ని షేర్ చేసినప్పటికీ, తీవ్ర విమర్శలు రావడంతో ఆ తర్వాత దాన్ని తొలగించింది.
ఈ రాజకీయం పక్కన పెడితే, సాధారణ యూజర్లు, నేతలు ఈ ట్రెండ్‌లో సందడి చేశారు. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, పీయూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్ సహా పలువురు నేతలు తమ ఏఐ వింటేజ్ లుక్స్‌ను పంచుకోగా, కాంగ్రెస్ నేత శశి థరూర్, రేణుకా చౌదరి ఏఐ సాయం లేకుండా నిజమైన 80ల నాటి తమ పాత ఫొటోలను షేర్ చేసి ట్రెండ్‌లో నిలిచారు. రాజకీయ పార్టీలు ఏఐ సాంకేతికతను తమ ప్రచారాలకు, విమర్శలకు ఎంత వేగంగా వాడుకుంటున్నాయో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.












