సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిల పాలనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొండల్ రెడ్డి, ఆయన ముఠా రాష్ట్రం మీద విరుచుకుపడి విచ్చలవిడిగా భూములను దోచుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ముఖ్యమంత్రికి సంబంధించిన వారు ‘కొండల్.. తొండల్.. అనకొండల్’ అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 'తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు' అన్నట్లుగా రేవంత్ రెడ్డి, పొంగులేటి వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో చీకటి వ్యాపారంలా ఒక సమాంతర రెవెన్యూ వ్యవస్థ నడుస్తోందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో దళితులు, గిరిజనులకు చెందిన అసైన్డ్ భూములు మాయమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా లగచర్ల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి తన అల్లుడి వ్యాపార ప్రయోజనాల కోసమే గిరిజనులకు చెందిన భూములను బలవంతంగా గుంజుకున్నారని ధ్వజమెత్తారు. పేదల భూములపై కాంగ్రెస్ నాయకులు కన్నువేశారని మండిపడ్డారు.
అదేవిధంగా రేవంత్ రెడ్డి భూ దందాల చరిత్రపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి సమాచార హక్కు చట్టాన్ని (RTI) అడ్డం పెట్టుకుని, అధికారులను, వ్యాపారులను బ్లాక్‌మెయిల్ చేస్తూ బతికేవాడని ఆరోపించారు. భూ దందాలు చేసే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఎట్లా ఉందంటే, ఎర్రచందనం దొంగ వీరప్పన్‌ను తీసుకెళ్లి అటవీ శాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉందని కేటీఆర్ తీవ్రస్థాయిలో సెటైర్లు వేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి, భూకబ్జాలు పెరిగిపోయాయని, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే ప్రత్యక్షంగా ఈ దందాల్లో భాగస్వాములవుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్ర వనరులు, పేదల భూములు దోపిడీకి గురవుతున్నాయని, ఈ అక్రమాలపై బీఆర్‌ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.










