* నేపాల్ వరదల నేపథ్యంలో తెలంగాణ ప్రజల భద్రతకు రేవంత్ ప్రభుత్వం చర్యలు..
* ప్రత్యేక హెల్ప్‌లైన్, కంట్రోల్ రూమ్
* నేపాల్‌లో చిక్కుకున్న 23మంది తెలంగాణ వాసులు
* యాత్రికుల వివరాలను కేంద్రానికి పంపిన రాష్ట్ర ప్రభుత్వం
* ఢిల్లీలోని తెలంగాణ భవన్, సచివాలయంలో ప్రత్యేక హెల్ప్‌లైన్, కంట్రోల్ రూమ్‌లు
* కేంద్ర విదేశాంగ శాఖ, భారత రాయబార కార్యాలయంతో నిరంతర సమన్వయం
* కుటుంబ సభ్యులు ఆందోళన చెందొద్దు-మంత్రి పొంగులేటి
Nepal Flash Floods: నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలంగాణ పర్యాటకులు, యాత్రికులు, ఇతర పౌరుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు అందించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ప్రాథమికంగా 23 మంది తెలంగాణ వాసులను గుర్తించినట్లు మంత్రి వెల్లడించారు.
కేంద్రానికి తెలంగాణ యాత్రికుల వివరాలు
గుర్తించిన వారి వివరాలను కేంద్ర విదేశాంగ శాఖకు పంపామన్నారు. వారి ప్రస్తుత పరిస్థితి, ఆచూకీ తెలుసుకోవడంతో పాటు అవసరమైన సాయం అందించేందుకు కేంద్ర విదేశాంగ శాఖ, కాఠ్మాండు భారత రాయబార కార్యాలయం, నేపాల్ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం సమన్వయం చేస్తోందని మంత్రి వెల్లడించారు.
ఢిల్లీలో ప్రత్యేక హెల్ప్ లైన్, కంట్రోల్ రూమ్
నేపాల్‌లో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్ లైన్, కోఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. అదే విధంగా హైదరాబాద్‌లోని డా.బీ.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో సాధారణ పరిపాలన శాఖ (NRI విభాగం) ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, బాధితుల కుటుంబాల నుంచి సమాచారం సేకరించి సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తున్నట్లు వివరించారు. నేపాల్ లో నెలకొన్న పరిస్థితులు, అక్కడ తెలంగాణ వాసులు ఎంతమంది ఉండే అవకాశం ఉంది వంటి అంశాలపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులతో గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి పొంగులేటి.
నేపాల్ లో చిక్కుకున్న 23మంది తెలంగాణ వాసులు
నేపాల్‌లో నెలకొన్న పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా పర్యవేక్షిస్తోందని మంత్రి పొంగులేటి తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు అందించిన సమాచారంతో 23 మంది తెలంగాణ వాసులను ప్రాథమికంగా గుర్తించామన్నారు. వారి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించామన్నారు. వారి ఆచూకీ, భద్రతపై కేంద్ర అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇంకా ఎవరైనా తెలంగాణ వాసులు నేపాల్‌లో చిక్కుకున్నట్లయితే వారి కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వానికి సమాచారం అందించాలని ఆయన కోరారు. బాధితుల పేరు, పాస్‌పోర్ట్ వివరాలు, మొబైల్ నెంబర్, నేపాల్‌లో చివరగా ఉన్న ప్రదేశం, ట్రావెల్/టూర్ ఆపరేటర్ వివరాలు, కుటుంబ సభ్యుల సంప్రదింపు నెంబర్లు అందిస్తే సంబంధిత అధికారులతో సమన్వయం చేసి అవసరమైన సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి చెప్పారు.
తెలంగాణ భవన్ అధికారులు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA), కాఠ్మాండు భారత రాయబార కార్యాలయం, నేపాల్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి, రాష్ట్రానికి చెందిన ప్రతి ఒక్కరి భద్రతకు అవసరమైన సాయాన్ని అందిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
తెలంగాణ భవన్ ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు
📞 9871999044
📞 9949351270
📞 9618597969
తెలంగాణ సచివాలయం ప్రత్యేక కంట్రోల్ రూమ్
నేపాల్‌లో చిక్కుకున్న లేదా ప్రభావితమైన తెలంగాణ ప్రజల కుటుంబ సభ్యులు సమాచారం కోసం అధికారులను సంప్రదించవచ్చు:
ఎస్. లక్ష్మీనారాయణ-అసిస్టెంట్ సెక్రటరీ
📞 9885371189
కె. శ్రీనివాస్ రెడ్డి-సెక్షన్ ఆఫీసర్
📞 7997959754
ఇ. చిట్టిబాబు-సెక్షన్ ఆఫీసర్
📞 9440854433
నేపాల్‌లో చోటు చేసుకున్న విషాదకర పరిస్థితులపై మంత్రి పొంగులేటి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విపత్తులో చిక్కుకున్న తెలంగాణ ప్రజలకు సాధ్యమైనంత త్వరగా సాయం అందేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, నేపాల్‌లో చిక్కుకున్న వ్యక్తుల కుటుంబసభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.












