ఒక జీవి భూమి మీద ప్రాణం పోసుకోవడానికి ఎంతో ప్రయాస పడాలి.. కానీ అదే ప్రాణం తీసుకోవడం క్షణాల్లో పని.. ప్రస్తుతం లోకంలో ఇదే జరుగుతుంది. కారణాలు ఏమైనా.. తనువును చాలిస్తున్న వారి సంఖ్య నిత్యం పెరిగిపోతుంది. సముద్రంలో ఆటుపోట్లు ఉంటాయి.. అలాగని అలలు సముద్రాన్ని వదిలి వెళ్లవు కదా!.. తీరాన్ని తాకి మళ్ళీ సముద్రంలోనే కలుస్తాయి.. జీవితం కూడా అలాంటిదే.. సుఖాల వెంటే కష్టాలు ఉంటాయి. అలాగని అన్నీ శాశ్వతంగా వెంటే నడవవు కదా!..
నేటి సమాజంలో బ్రతుకు మీద ఆశలు పెంచుకుంటున్న మనుషులు.. తమ జీవితం పట్ల ప్రేమను పెంచుకోలేక పోతున్నారు. ఫలితంగా ముందు వెనుక చూసుకోకుండా.. కన్న పిల్లల బ్రతుకు కోసం ఆలోచించకుండా.. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు వారి కుంటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి.. తాజాగా ఇలాంటి ఘటనే విశాఖ జిల్లా పెందుర్తి పరిధిలోని చింతల అగ్రహారంలో చోటుచేసుకుంది.
కొత్తవలసకు చెందిన మల్ల ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి కొంతకాలంగా జీవనోపాధి కోసం పెందుర్తికి వచ్చి.. ఇక్కడ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఆటో డ్రైవర్‌గా ప్రవీణ్ జీవనం సాగిస్తుండగా.. అతని భార్య కాయగూరల వ్యాపారం చేస్తూ బ్రతుకును వెళ్లదీస్తున్నారు.. కాగా ఈ దంపతులకు రెండేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఇక రాఖీ పండుగ రోజున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన ఆ కుటుంబంలో.. అదే రాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రవీణ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో రాఖీలు కట్టించుకున్న అనంతరం.. రాత్రి సమయంలో కుటుంబ సభ్యులకు సెల్‌ఫోన్ ద్వారా ‘RIP’ అంటూ సందేశం పంపినట్లు సమాచారం. ఆ తర్వాత అతను ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన భార్య, ఇద్దరు చిన్నారులు విషపదార్థం తీసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే తల్లి, ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
రాఖీ పండుగ రోజున సంతోషంగా గడిపిన కుటుంబంలో.. కొన్ని గంటల్లోనే ఈ విషాదం చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఘటనపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణానికి కారణం కుటుంబ కలహాలా?.. ఆర్థిక ఇబ్బందులా?..అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్టు సమాచారం..












